Share News

District Collectors: సొంతంగా ఆలోచించండి

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:54 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు ప్రజలతో మమేకమై, ప్రజాప్రతినిధులను కలుపుకొని గ్రామాల్లో ఎక్కువ సమయం గడపాలని సూచించారు. అలాగే, రాష్ట్ర వారసత్వ కళలైన కూచిపూడి ప్రోత్సాహంపై దృష్టి పెట్టాలని, టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

District Collectors: సొంతంగా ఆలోచించండి

ప్రజాప్రతినిధులను కలుపుకొని వెళ్లండి

సమస్య పరిష్కారం అయ్యేదాకా వదలొద్దు

కానీ, క్రెడిట్‌ రాజకీయనాయకులకు ఇవ్వండి

కొంత అప్పు చేసి సూపర్‌ సిక్స్‌ అమలు

రాష్ట్రంలో నాలా చట్టం రద్దు చేస్తున్నాం: సీఎం

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ‘‘క్షేత్రస్థాయిలో ఎక్కువగా తిరగండి. ప్రజాప్రతినిధులను కలుపుకొని వెళ్లండి’’ అని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. తాను చెప్పింది, సీఎస్‌, సెక్రటరీలు చెప్పింది కాకుండా... మంచి ఆలోచనలు వస్తే అమలు చేయాలని, మంచి ఫలితాలు వస్తే వాటిని రాష్ట్రం మొత్తం అమలుచేస్తామని అన్నారు. ‘‘ఏదైనా ఒక పని కాలేదని తెలిస్తే బాధితుల ఇళ్లకి వెళ్లండి. ఫోన్‌ చేసి మాట్లాడండి. పీఆర్‌వోల ద్వారా ప్రజలకు తెలియజేయండి. దీనివల్ల ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లోకి ఒక సందేశం వెళ్తుంది. ఆ ఘనత మాత్రం రాజకీయ నాయకులకు ఇవ్వండి. ఎందుకంటే ఐదేళ్ల తర్వాత ఓట్లు అడగాలి కదా. కలెక్టర్లకు పని జరిగిందన్న సంతృప్తి మిగులుతుంది’’ అన్నారు. కలెక్టర్లు సదస్సు ముగింపు సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. కూచిపూడి మన వారసత్వ కళ అని, దీనిపై అన్ని స్కూళ్లలో, కాలేజీల్లో అవగాహన కలిగించాలన్నారు. ‘‘2000 మందికి పైగా పట్టేలా విశాఖ, తిరుపతిలో కల్చరల్‌ కేంద్రాలు ఏర్పాటు చేయండి. విశాఖలోని కేంద్రానికి గాయని సుశీల పేరు, తిరుపతి కేంద్రానికి గాయకులు ఘంటసాల లేదా బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టాలి. అమరావతిలో అంబేడ్కర్‌ ఆడిటోరియం ఉంది’’ అని తెలిపారు. ‘‘కొద్దిగా అప్పులు చేసి సూపర్‌ సిక్స్‌ పథకాలు ఇస్తున్నాం.. రాష్ట్రానికి 9.77 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయి. అసలు, వడ్డీ రెండూ కట్టాలి. కట్టలేకపోతే మార్కెట్లో రాష్ట్రం పరపతి కోల్పోతుంది. అప్పులు పుట్టవు, అరకొరగా వచ్చినా అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పాత అప్పునంతా వడ్డీరేట్లు తగ్గించేలా స్వాపింగ్‌కి వెళ్తున్నాం. దీంతో రూ.2,000- నుంచి 3,000 కోట్లు ఆదా అవుతాయి’’ అని తెలిపారు. పీ 4ను ఉగాది రోజున ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులొస్తున్నాయని, రాయలసీమ ఉద్యానవన హబ్‌, పంప్డ్‌ ఎనర్జీ, సోలార్‌, విండ్‌ ఎనర్జీలతో పైస్థాయికి వెళ్తుందని తెలిపారు. ‘‘పెట్టుబడుల ప్రక్రియలో వేధింపులు ఉండకూడదు. నాలా చట్టం ఎప్పటినుంచో ఉంది. పెద్ద సమస్య అయిపోయింది. నాలా తీసేస్తున్నాం. వచ్చే కేబినెట్‌లో పెట్టి ఆర్డినెన్స్‌ తెస్తాం. నాలా పాత బకాయిలు వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ చేస్తాం’’ అని వివరించారు.


వేసవి కలెక్టర్లకు పరీక్షా కాలం..

నియోజకవర్గానికి 10,000 చొప్పున ఇళ్లపైన సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించామని, ఒక్కో కలెక్టర్‌కు రూ.70,000 ఇళ్లు లక్ష్యంగా ఉంటాయని సీఎం అన్నారు. కుసుమ్‌, గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టులు తెస్తున్నామని, సోలార్‌, విండ్‌, పంప్డ్‌ ఎనర్జీ అన్నీ వస్తాయని తెలిపారు. శాంతిభద్రతల్లో ఎక్కడా రాజీ పడొద్దని, వేసవి కాలం కలెక్టర్లకు ఒక పరీక్షా కాలమని వ్యాఖ్యానించారు. అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీలపై కూడా శ్రద్ధ పెట్టాలన్నారు. ఎక్సైజ్‌, రిజిస్ర్టేషన్లు, జీఎస్టీ, మోటార్‌ వెహికిల్‌ పన్నులపై పట్టుసాధించాలని కోరారు. తదుపరి సమావేశంలో ప్రశ్నలు, సమాధానాలే ఉంటాయని, చివరి ర్యాంకులో ఉన్న వారిపై చర్చిద్దామని చెప్పారు. నవోదయం-2 కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి ఐడీ లిక్కర్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని ప్రకటించేలా కలెక్టర్లు కృషి చేయాలని మైనింగ్‌, ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. ఆగస్టు నుంచి అక్టోబరు 15 వరకు నదుల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంటుందని, 2 నెలలపాటు ఇసుక ఉండదన్నారు. అందువల్ల 60-70 లక్షల టన్నుల ఇసుకను ముందుగానే స్టాక్‌ పెట్టుకోవాలని సూచించారు.

22 గంటలు.. 600 స్లైడ్స్‌..

కార్యక్రమం ముగింపులో అల్లూరి జిల్లా కలెక్టర్‌ దినేశ్‌ అందరికీ ధన్యవాదాలు చెప్పారు. 2 రోజులు, 22 గంటలు, 600 స్తైడ్స్‌, 150 రకాల సమస్యలపై చర్చ.. 100 సమస్యల పరిష్కారం జరిగిందని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 03:54 AM