Share News

Deputy CM Pawan Kalyan : చంద్రబాబు అనుభవమే నాకు ప్రేరణ

ABN , Publish Date - Mar 23 , 2025 | 03:40 AM

‘ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, పాలన నాకు ఎంతో ప్రేరణ ఇచ్చింది. ఆ స్ఫూర్తితో రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించాం....

Deputy CM Pawan Kalyan : చంద్రబాబు అనుభవమే నాకు ప్రేరణ

  • ఆ స్ఫూర్తితోనే గ్రామసభల ప్రపంచ రికార్డు

  • ప్రజల ఆర్థిక స్థిరత్వం మా ప్రభుత్వ లక్ష్యం

  • ఉపాధితో అన్నదాతల జీవితాల్లో వెలుగులు

  • కర్నూలు జిల్లాలో నీటి కుంటల నిర్మాణానికి

  • భూమిపూజ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌

కర్నూలు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ‘ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, పాలన నాకు ఎంతో ప్రేరణ ఇచ్చింది. ఆ స్ఫూర్తితో రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించాం. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి ప్రపంచ రికార్డు సృష్టించాం’ అని ఉప ముఖ్యమంత్రి వపన్‌ కల్యాణ్‌ అన్నా రు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 1.55 లక్షల నీటి కుంటలు(ఫారం పాండ్స్‌) తవ్వకం పనులకు శనివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచర్ల గ్రామంలో ఆయన భూమిపూజ చేశారు. పలుగు, పార చేతపట్టి సూర రాజన్న అనే రైతు పొలంలో నీటి కుంట తవ్వకం పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ పల్లెసీమల్లో ప్రజల ఆర్థిక, ఉపాధి స్థిరత్వం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రైతన్నలు బలపడాలి. ఉపాఽధి హామీ పనుల ద్వారా అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపడమే కూటమి ప్రభు త్వం ప్రధాన అజెండా. త్వరలోనే ప్రతి నియోజకర్గంలో రెండు రోజులు పర్యటించి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తా. దీన్ని గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ ఉపాఽధి హామీ పథకంగా మార్చేసింది. అలాంటి వారిని ఎదుర్కొని బలమైన వ్యవస్థను తయారు చేస్తున్నాం. పల్లెపండుగ పనుల్లో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉండటం అభినందనీయం. రాయలసీమను రతనాలసీమగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. వర్షం వస్తే నీటిని నిల్వ చేసుకునే అవకాశాలు లేవు.


ఓ వైపు భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతూనే.. అవి పూర్తయ్యేవరకు నీటికి ఇబ్బందులు లేకుండా రైతు పొలంలోనే నీటి కుంటలు నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో 1.55 లక్షల నీటి కుంటల నిర్మాణం మే నెలాఖరులోగా పూర్తి చేస్తాం. వర్షాకాలంలో ఒక టీఎంసీ నీటిని వీటిలో నిల్వ చేసుకోవచ్చు’ అని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చేసిన అభివృద్ధి పనులను వివరించారు. అలాగే, ప్రధాని మోదీ సహకారంలో జన్మన్‌ పథకం ద్వారా విద్యుత్‌, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

కొణిదెల గ్రామం దత్తతకు కట్టుబడి ఉన్నా..

‘నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామాన్ని దత్తతకు తీసుకుంటానని గతంలో చెప్పాను. ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. నా సొంత ట్రస్టు నుంచి ఆ గ్రామానికి రూ.50 లక్షలు కేటాయించి మౌలిక సౌకర్యాలు కల్పిస్తా’ అని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పథకాల ద్వారా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. సీఎంతో మాట్లాడి ఉపాధి హామీ పథకం బకాయి నిధులు త్వరలో విడుదలయ్యేలా చూస్తానని చెప్పారు. ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్‌ అసోసియేషన్‌ నాయకులు పలు సమస్యలు తన దృష్టికి తెచ్చారని, వాటికి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

స్వధర్మాన్ని పాటిస్తా

‘కులాలు, మతాల గురించి నేను మాట్లాడితే చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. ధర్మాన్ని బలంగా నమ్ముతాను. నా స్వధర్మాన్ని పాటిస్తాను. అన్ని ధర్మాలను గౌరవిస్తాను’ అని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 07:19 AM