Share News

అక్రమ లేఅవుట్లపై కొరడా

ABN , Publish Date - Mar 25 , 2025 | 11:45 PM

ఉమ్మడి జిల్లాలో అనుమతులకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెంచర్లు, నిర్మాణాలపై శాఖపరమైనచర్యలు తప్పవని కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వరు అన్నారు.

అక్రమ లేఅవుట్లపై కొరడా
కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

తక్షణమే క్రమబద్ధీకరించుకోవాలి

కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌ మార్చి 25 (ఆంఽధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో అనుమతులకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెంచర్లు, నిర్మాణాలపై శాఖపరమైనచర్యలు తప్పవని కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వరు అన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు, నంద్యాల పార్లమెంటు పరిధిలో ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటన చేసి భారీ స్థాయిలో అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలను గుర్తించామని, ఇందులో దాదాపు 220 మందికి క్రమబద్ధీకరించుకోవాలని నోటీసులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ లేఅవుట్లు, భవంతులు పుట్టగొడుగుల్లా వెలిశాయని, వారి స్వార్థ ప్రయోజనాలకు అమాయక ప్రజలు నష్టపోవటంతోపాటు, ప్రభుత్వ ఆదాయానికి భారీ గండిపడిందని అన్నారు. ఈ అక్రమాలను వెలుగులోకి తీసుకవచ్చేందుకు కార్యాలయ సిబ్బంది కసరత్తు చేస్తున్నారని చెప్పారు. మంత్రాలయంలో అత్యధికంగా 75 వరకు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని, ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకొని, భారీ అంతస్తులు నిర్మించి వాటిని లాడ్జిలుగా వినియోగిస్తూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, దీని వల్ల ప్రభుత్వానికి అధికారికంగా రావాల్సిన రుసుం, ఆదాయం రావటం లేదని సోమిశెట్టి పేర్కొన్నారు. వీరంతా వెంటనే కుడా కార్యాలయంలో సంప్రందించి నిర్మాణాలకు అనుగుణంగా అనుమతులు తీసుకొని, అందుకు తగ్గ రుసుం చెల్లించాలని సూచించారు. లేనిపక్షంలో సంబంధింత నిర్మాణాల విద్యుత్‌, నీటి కనెక్షన్‌లను తొలగించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమ్మకందారులు అక్రమ వెంచర్లను ఏర్పాటు చేసి అమాయక ప్రజలకు అంటగడుతున్నారని, వీటిపై ప్రజలను చైతన్యుల్ని చేసేందుకు ప్రధాన రహదారులు, కూడళ్లు, ముఖ్య కార్యాలయాల వద్ద కరపత్రాల పంపిణీ, ఫ్లెక్సీల ఏర్పాటు, మైక్‌లో ప్రకటనల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొనుగోలుదారులు సైతం అనుమతులు లేని, నిబంధలనకు విరుద్ధంగా ఉన్న స్థలాలు, నిర్మాణాలను కొనుగోలు చేయవద్దని, దీని వల్ల వారికి ప్రభుత్వపరంగా ఎటువంటి సౌకర్యాలు, ప్రయోజనాలు అందవని స్పష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శులు సైతం తమ పరిధిలోని అక్రమ వెంచర్లు, నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధ్యులైన వారికి నోటీసులు అందజేసి, ప్రభుత్వ రాబడిని పెంచాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయతీ కార్యదర్శులపై శాఖపరమైన చర్యలకు సిఫారసుల చేస్తామని సోమిశెట్టి హెచ్చరించారు. ప్రభుత్వానికి రుసుంల రూపంలో వచ్చే రాబడి వల్ల అభివృద్ధి మరింత పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 11:45 PM