Share News

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక

ABN , Publish Date - Mar 25 , 2025 | 11:44 PM

వేసవిలో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గ్రామాలు, పట్టణాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లు, అధికారులకు సూచించారు.

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక
సదస్సులో పాల్గొన్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సదస్సుకు హాజరైన మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌, ఎస్పీ

కర్నూలు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): వేసవిలో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గ్రామాలు, పట్టణాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లు, అధికారులకు సూచించారు. మంగళవారం అమరావతిలోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరిగింది. జిల్లా మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌లు ఈ సదస్సుకు హాజరయ్యారు. జిల్లా ప్రగతి అజెండా లక్ష్యంగా వివిధ శాఖల పురోగతి నివేదికలతో వెళ్లారు. వేసవి తాగునీటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, ఎక్కడా సమస్య రాకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అదే క్రమంలో జిల్లాలో నీటి ఎద్డడి తలెత్తకుండా కర్నూలు నగరం, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపల్‌ పట్టణాలతోపాటు 484 పంచాయతీలు, 237 మజరా గ్రామాల్లో చేపట్టిన చర్యలు, 33 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్‌) ఎస్‌ఎస్‌ ట్యాంకులు, గాజులదిన్నె, సుంకేసుల, పులికనుమ, పత్తికొండ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు వివరాలను కలెక్టరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జిల్లాలో పీ4 అమలుపై తీసుకుంటున్న చర్యల నివేదికను కలెక్టర్‌ తీసుకెళ్లారు. నేడు జిల్లాల వారిగా ప్రగతి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు.

Updated Date - Mar 25 , 2025 | 11:44 PM