అభివృద్ధికి దారి లేదా..?
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:47 PM
రహదారులు ప్రగతికి చిహ్నాలు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అనుసంధానిస్తే రాకపోకలు మెరుగుపడుతాయి. తద్వారా వ్యాపారం, ఇతర రంగాల్లో పురోగతి సాధించవచ్చు.

జిల్లాలో విస్తరణకు నోచుకోని జాతీయ రహదారులు
గుత్తి-మాన్వి వయా పత్తికొండ జాతీయ రహదారిగా అప్‌గ్రేడేషన్ కోసం కేంద్రానికి ప్రతిపాదన
కర్నూలు-బళ్లారి వయా కోడుమూరు, ఆలూరు..
కాల్వబుగ్గ-ఎమ్మిగనూరు వయా వెల్దుర్తి, కోడుమూరు రోడ్లు కూడా..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం
ఈ ప్రభుత్వంలోనైనా మోక్షం లభించేనా..?
కర్నూలు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రహదారులు ప్రగతికి చిహ్నాలు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అనుసంధానిస్తే రాకపోకలు మెరుగుపడుతాయి. తద్వారా వ్యాపారం, ఇతర రంగాల్లో పురోగతి సాధించవచ్చు. అందులో జాతీయ రహదారులు అత్యంత ప్రధానం. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణకు నడుంబిగించింది. రాష్ట్ర ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడేషన్ కోసం ప్రతిపాదనలు స్వీకరించింది. నిత్యం కరువుతో తల్లడిల్లే పశ్చిమ ప్రాంతం అభివృద్ధిలో కీలకమైన గుత్తి-మాన్వి వయా పత్తికొండ, ఆదోని రోడ్డును నేషనల్ హైవేగా అప్‌గ్రేడేషన్ కోసం 2017లోనే సర్వే చేసి కేంద్ర రోడ్లు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. అత్యంత కీలకమైన కర్నూలు-బళ్లారి వయా కోడుమూరు, ఆలూరు రోడ్డు.. ఓర్వకల్లులోని కాల్వబుగ్గ-ఎమ్మిగనూరు వయా వెల్దుర్తి, కోడుమూరు, గోనెగండ్ల రోడ్లను నేషనల్ హైవేగా విస్తరించాలని రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు పంపారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం రావడం, కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండడంతో జాతీయ రహదారుల విస్తరణపై ఆశలు చిగురిస్తున్నాయి. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సహా ఎమ్మెల్యేలు దృష్టి సారించాలి.
ఎనిమిదేళ్ల స్వప్నం
గుత్తి-మాన్వి వయా పత్తికొండ, ఆదోని ప్రధాన రోడ్డును జాతీయ రహదారి విస్తరణ ఎనిమిదేళ్ల స్వప్నం. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర-కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ ఈ రోడ్డు విస్తరణకు సర్వే చేయించారు. ఉత్తర కర్ణాటకలోని రాయచూరు, సింధనూరు, మాన్వి, గంగావతి వంటి ప్రాంతాల ప్రజలు రాజధాని బెంగళూరుకు వెళ్లేందుకు దూరం తగ్గుతుంది. అలాగే జిల్లాలో ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆలూరు ప్రాంతవాసులు అనంతపురం, బెంగళూరు వెళ్లాలంటే ఈ మార్గమే ఆధారం. బెంగళూరులో జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వేలాది మంది పని చేస్తున్నారు. కీలకమైన గుత్తి-మాన్వి వయా పత్తికొండ, ఆదోని రోడ్డును నేషనల్ హైవేగా విస్తరించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. హైదరాబాద్-బెంగళూరు వయా కర్నూలు, అనంతపురం జాతీయ రహదారిని గుత్తి వద్ద కలుపుతూ గుత్తి, పత్తికొండ, ఆదోని, మదిరె, హానవాల్, కుంటనహాల్, ఉప్పరహాల్, కౌతాళం, ఉరుకుంద, హాల్వి, కుంబళనూరు మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి వరకు జాతీయ రహదారిగా విస్తరించాలని ప్రతిపాదించారు. సర్వే కోసం 2017 జూన్‌లో టెండర్లు పిలిచారు. ఆ వెంటనే సర్వే పూర్తి చేసి తుంగభద్ర నదిపై వంతెన నిర్మాణంతోపాటు ఏఏ ప్రాంతంలో కల్వర్టు నిర్మించాలి, సింగిల్ రోడ్డు ఎన్ని కిలోమీటర్లు, డబుల్ రోడ్డు ఎన్ని కిలోమీటర్లు అనేది తేలాచ్చారు. ప్రాథమికంగా 135 కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారిగా అప్‌గ్రేడేషన్ చేయాలని కేంద్ర రోడ్లు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రతిపాదన అటకెక్కింది. కూటమి ప్రభుత్వం రావడంపై గుంతకల్లు, పత్తికొండ, ఆదోని ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, కేఈ శ్యాంబాబు, డాక్టర్ పీవీ పార్థసారథి, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డిలు ఒత్తిడి తెచ్చి ఈ రోడ్డును నేషనల్ హైవేగా అప్‌గ్రేడేషన్ చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
ఆ రెండు రోడ్లు కూడా..!
కర్నూలు - బళ్లారి వయా కోడుమూరు, ఆలూరు ప్రధాన రహదారిని జాతీయ రాహదారిగా విస్తరించాలనే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉంది. ఇది జిల్లాలో అన్ని నియోజకవర్గాలను అనుసంధానం చేసే కీలకమైన రోడ్డు. కర్నూలు నుంచి కోడుమూరు, దేవనకొండ, ఆస్పరి మీదుగా ఆలూరు వరకు, హాలహర్వి మండలం ఛత్రగుడి నుంచి మోకా మీదుగా 126 కిలోమీటర్లు నేషనల్ హైవేగా అప్‌గ్రేడేషన్ చేయాలి. మంగళవారం ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టరు పి.రంజిత్‌బాషా నివేదికతో వెళ్లారు. కర్నూలు ఎమ్మెల్యే, మంత్రి టీజీ భరత్ సహా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌లు నేషనల్ హైవేగా విస్తరణకు కృషి చేయాలి.
కాల్వబుగ్గ - ఎమ్మిగనూరు వయా రామళ్లకోట, వెల్తుర్తి, లద్దగిరి, కోడుమూరు, గోనెగండ్ల మీదుగా 110 కిలో మీటర్ల రోడ్డును జాతీయ రహదారిగా విస్తరించి కర్నూలు - చిత్తూరు వయా నంద్యాల జాతీయ రహదారి, బళ్లారి-జడ్చర్ల వయా ఎమ్మిగనూరు, మంత్రాలయం జాతీయ రహదారి-167ను అనుసంధానం చేయాలనే ప్రతిపాదనను కేంద్ర రోడ్లు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపారు. ముఖ్యంగా కోడుమూరు-ఎమ్మిగనూరు వయా గోనెగండ్ల రోడ్డు అధ్వానంగా ఉంది. ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని నియోజకవర్గాల ప్రజలు వివిధ పనుల కోసం కర్నూలు రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి నేషనల్ హైవేగా విస్తరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆయనతో పాటు కోడుమూరు, పత్తికొండ, పాణ్యం ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, కేఈ శ్యాంబాబు, గౌరు చరితమ్మలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం
గుత్తి-మాన్వి వయా పత్తికొండ, ఆదోని, కర్నూలు-బళ్లారి వయా కోడుమూరు, ఆలూరు, కాల్వబుగ్గ-ఎమ్మిగనూరు వయా వెల్దుర్తి, కోడుమూరు ప్రధాన రోడ్లను జాతీయ రహదారులుగా విస్తరించాలని కేంద్ర రోడ్లు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపాం. రెండేళ్లుగా కేంద్రంలో ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేగా అప్‌గ్రేడేషన్‌కు ఆమోదం తెలిపి నిధులు ఇస్తే నిబంధనలు ప్రకారం డీపీఆర్ తయారు చేసి దశల వారిగా రోడ్డును విస్తరిస్తాం.
- శంకర్‌రెడ్డి, ఈఈ, జాతీయ రహదారుల శాఖ (ఎన్‌హెచ్), కర్నూలు