Share News

నాన్న రోడ్డున పడ్డాడు..

ABN , Publish Date - Mar 25 , 2025 | 11:42 PM

నాన్న ఎందుకో రోడ్డున పడ్డాడు.. భార్యా పిల్లలకు కోసం అహో రాత్రులు శ్రమించినా ఎందుకో నిరాదరణకు గురయ్యాడు..

నాన్న రోడ్డున పడ్డాడు..

రోడ్డు డివైడర్‌పై అనాథ వృద్ధుడు

ఎండ వేడిమికి విలవిల

కర్నూలు హాస్పిటల్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): నాన్న ఎందుకో రోడ్డున పడ్డాడు.. భార్యా పిల్లలకు కోసం అహో రాత్రులు శ్రమించినా ఎందుకో నిరాదరణకు గురయ్యాడు.. జీవిత చరమాంకంలో అండగా ఉండాల్సిన వారి ప్రేమను ఎందుకో పొందలేకపోయాడు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎదుట రోడ్డు డివైడర్‌పై 70 ఏళ్ల ఓ వృద్ధుడు అనాథగా పడి ఉన్న దృశ్యం అందర్నీ కలిచి వేసింది. ఆయన రెండు కాళ్లకు కట్లు కట్టి అచేతనావస్థలో పడి ఉన్నాడు. ఆయనను మాట్లాడించే ప్రయత్నం చేయగా తన పేరు సత్యనాగరాజు అని, తమది విజయవాడ అని ఆత్మకూరు వద్ద రోడ్డు ప్రమాదంలో దెబ్బలు తగిలాయని చెబుతున్నారు. ఇక్కడ ఎవరు వదిలి వెళ్లారని ప్రశ్నిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు తప్పా సమాధానం ఇవ్వడం లేదు. ఉదయమే వృద్ధుడిని వదిలేసి వెళ్లినట్లు కాళ్లకు కట్టిన కట్ల ద్వారా తెలుస్తోంది. ఎండవేడిమికి తట్టుకోలేకపోతున్న వృద్ధుని చూసి ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులు అల్పాహారం పెట్టి మంచినీరు అందించారు. సత్య నాగరాజు పేరుతో కర్నూలు జీజీహెచ్‌ క్యాజువాల్టీకి వచ్చి చికిత్స చేయించుకున్నట్లు వివరాలు లేవని ఎమర్జెన్సీ మెడిసిన్‌ హెచ్‌వోడీ డా.రామశివనాయక్‌ చెబుతున్నారు. ఈ ఘటనపై కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు స్పందించారు. 108 వాహనం ద్వారా రోగిని క్యాజువాల్టీలో చేర్పించి వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆయనకు సహాయకులుగా ఓ శానిటేషన్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

Updated Date - Mar 25 , 2025 | 11:42 PM