Share News

Just 10 Days After the Road Was Laid.. రోడ్డు వేసిన పదిరోజులకే..

ABN , Publish Date - Mar 25 , 2025 | 11:44 PM

Just 10 Days After the Road Was Laid.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గ్రామీణ రహదారుల నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. ఇందుకోసం కోట్లాది రుపాయలను వెచ్చిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా రహదారుల నిర్మాణాల్లో డొల్లతనం కనిపిస్తుంది. దీనికి నిదర్శనమే అర్థలి బీటీ రహదారి.

Just 10 Days After the Road Was Laid.. రోడ్డు వేసిన పదిరోజులకే..
రహదారిపై పెచ్చులూడిన తారు

నిర్మాణంలో నాణ్యతా లోపం

విమర్శల వెల్లువ

పాలకొండ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గ్రామీణ రహదారుల నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. ఇందుకోసం కోట్లాది రుపాయలను వెచ్చిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా రహదారుల నిర్మాణాల్లో డొల్లతనం కనిపిస్తుంది. దీనికి నిదర్శనమే అర్థలి బీటీ రహదారి. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చొరవతో సుమారు రూ.80 లక్షలతో వీపీ రాజుపేట గ్రామ జంక్షన్‌ నుంచి అర్థలి వరకు కిలోమీటరు మేర బీటీ రహదారి నిర్మాణం చేపట్టారు. దశాబ్దాల తర్వాత తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం జరిగిందని ఆ గ్రామ ప్రజలు ఎంతో మురిసిపోయారు. అయితే నిర్మాణం పూర్తయిన పదిరోజులకే రోడ్డుపై తారు పెచ్చులూడిపోతుండడంతో వారి ఆనందం ఆవిరై పోయింది. అసలు అర్థరాత్రి వేళ హడావుడిగా ఈ రహదారి నిర్మాణం చేపట్టారనే వ్యాఖ్యలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. తారు వేసే ముందు సక్రమంగా రోలింగ్‌ చేయకపోవడం, మట్టికట్ట పనులనూ పూర్తిస్థాయిలో చేపట్ట కపోవడంతో ఇటీవల కురిసిన అకాల వర్షానికి రోడ్డు కోతకు గురైంది. కాగా రహదారి నిర్మాణంలో లోపాలపై గ్రామస్థులు పెదవి విరుస్తున్నారు. పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, కాంట్రాక్టర్‌ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని చెబుతున్నారు.

మండల సమావేశంలో చర్చ...

నిర్మాణం చేపట్టి పది రోజులు కాకముందే అర్థలి బీటీ రహదారి పాడవ్వడం.. మండల సమావేశంలో చర్చనీయాంశమైంది. దీనిపై పంచాయతీరాజ్‌ అధికారులను స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు లోపించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సంబంధిత అధికారులను ఆదేశించారు.

చర్యలు తీసుకోవాలి..

మా గ్రామ బీటీ రహదారి నిర్మాణంలో నాణ్యతా లోపాలు స్పష్టంగా ఉన్నాయి. నిబంధనలు తుంగలోకి తొక్కి పనులు చేపట్టారు. ప్రస్తుతం రహదారిపై తారు పెచ్చులూడిపోతోంది. అధికారులు స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి.

- పి.సిమ్మినాయుడు, అర్థలి

=============================

నాణ్యత ప్రమాణాలు పాటించలేదు..

మా గ్రామానికి బీటీ రహదారి నిర్మాణం దశాబ్దాల కల. ఎమ్మెల్యే చొరవతో రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. అయితే అనుకున్న స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. దీనిపై మండల సమావేశంలో చర్చించాం. అధికారులు స్పందించాలి

- పి.వెంకటరమణ, అర్థలి

=============================

కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం..

అర్థలి బీటీ రహదారి నిర్మాణం పూర్తయిన వెంటనే వాహనాలు రాక పోకలు సాగించడంతో అక్కడక్కడా తారు పెచ్చులూడింది. ఈ విషయాన్ని కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. లోపాలను సరిచేస్తామన్నారు.

- భాస్కరరావు, జేఈ, పీఐయూ

Updated Date - Mar 25 , 2025 | 11:44 PM