పునాదుల్లోనే కోల్డ్ స్టోరేజీ
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:42 PM
రైతుల ప్రయోజనాల కోసం నిర్మించతలపెట్టిన కోల్డ్‌స్టోరేజీ ఏళ్ల తరబడి పునాదుల్లోనే నిలిచిపోయింది. వైసీపీ పాలకుల అసమర్థతో దర్శి నియోజకవర్గంలో అనేక అభివృద్థి పథకాలు మధ్యలోనే ఆగిపోయాయి. కోల్డ్‌స్టోరేజీ నిర్మాణ పనులు కూడా ముందుకుసాగలేదు.

గత వైసీపీ పాలకుల
అసమర్థతతో నిలిచిపోయిన పనులు
కూటమి ప్రభుత్వం రాకతో
చిగురిస్తున్న ఆశలు
దర్శి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రైతుల ప్రయోజనాల కోసం నిర్మించతలపెట్టిన కోల్డ్‌స్టోరేజీ ఏళ్ల తరబడి పునాదుల్లోనే నిలిచిపోయింది. వైసీపీ పాలకుల అసమర్థతో దర్శి నియోజకవర్గంలో అనేక అభివృద్థి పథకాలు మధ్యలోనే ఆగిపోయాయి. కోల్డ్‌స్టోరేజీ నిర్మాణ పనులు కూడా ముందుకుసాగలేదు.
స్థానిక మార్కెట్ యార్డులో గత టీడీపీ హయాంలో 2018లో రూ.5 కోటతో కోల్డ్ స్టోరేజీ నిర్మాణాన్ని ప్రారంభించారు. పునాదులు నిర్మించేసరికి 2019లో ఎన్నికలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అభివృద్ధి పనులకు బ్రేక్ వేసింది. అందులోభాగంగా కోల్డ్‌స్టోరేజీ నిర్మాణం కూడా ఐదేళ్లుగా అడుగు ముండుకు పడలేదు.
గత ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో కోల్డ్‌స్టోరేజీ నిర్మాణం కూడా ప్రారంభిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు. దర్శి మార్కెట్ యార్డు నూతన కమిటీని త్వరలో ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చైర్మన్‌గా దర్శి పట్టణానికి చెందిన దారం నాగవేణిని ఖరారు చేస్తూ టీడీపీ అధిష్ఠానానికి పంపారు. నూతన కమిటీ ఏర్పాటుకాగానే కోల్డ్ స్టోరేజీ నిర్మాణం పనులు పునఃప్రారంభానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్డ్ స్టోరేజీ నిర్మాణం పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం నుంచి హమీ లభించటంతో త్వరలో నిధులు విడుదలవుతాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సీఎం చంద్రబాబు, సంబంధిత మంత్రులకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు నిధులు విడుదలయ్యాయి. ఈనేపథ్యంలో త్వరలో కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి నిధులు విడుదలయ్యే అవకాశంఉంది. ఈప్రాజెక్టు పూర్తయితే దర్శి నియోజక వర్గంలో రైతులు పండించిన మిర్చి, కూరగాయులు, పండ్లు నిల్వ చేసుకొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గుంటూరు మార్కెట్ యార్డుకు తరలిస్తున్న రైతులు ఇక్కడే నిల్వ చేసుకొని మార్కెట్‌లో మద్దతు ధర లభించినప్పుడు విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది.