ప్రాణాలతో సెల్‌గాటం!
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:47 AM
పరీమ్యాచ్, బెట్ 365, డ్రాఫ్ట్‌కింగ్స్, ఫాన్ డ్యూయల్, 1ఎక్స్‌బెట్, బెట్‌ఎంజీఎం, టాజ్777, టార్గెట్‌గేమ్స్.. ఇవన్నీ ఏంటో అనుకుంటున్నారా.. బెట్టింగ్‌ల యాప్‌ల పేర్లు.. ‘వీటిలో జస్ట్ కొద్దిగా డబ్బులు పెట్టండి.. వెలకమ్ బోనస్ వస్తుంది..’ అంటూ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో యాప్‌ల ప్రమోషన్లు చేసి యువతను టెంప్ట్ చేస్తారు.

బెట్టింగ్ యాప్‌లపై ఆసక్తి
సోషల్‌మీడియాలో ప్రమోషన్లు
ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో ప్రచారం
వలలో పడుతున్న జనం
ఈజీ మనీ కోసం వెంపర్లాట
నష్టపోయినా..ఆగని వేట
తీరని అత్యాశతో అప్పులు
నిండా మునుగుతున్న వైనం
ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య
గుట్టుగా బెట్టింగ్ వ్యాపారాలు
తెలంగాణలో కేసులు నమోదు
ఉమ్మడి జిల్లాల్లో పట్టని పోలీసులు
(రాజమహేంద్రవరం/కాకినాడ, ఆంధ్రజ్యోతి)
పరీమ్యాచ్, బెట్ 365, డ్రాఫ్ట్‌కింగ్స్, ఫాన్ డ్యూయల్, 1ఎక్స్‌బెట్, బెట్‌ఎంజీఎం, టాజ్777, టార్గెట్‌గేమ్స్.. ఇవన్నీ ఏంటో అనుకుంటున్నారా.. బెట్టింగ్‌ల యాప్‌ల పేర్లు.. ‘వీటిలో జస్ట్ కొద్దిగా డబ్బులు పెట్టండి.. వెలకమ్ బోనస్ వస్తుంది..’ అంటూ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో యాప్‌ల ప్రమోషన్లు చేసి యువతను టెంప్ట్ చేస్తారు.వీటి మాయలో పడిన యువత త్వరగా డబ్బు సంపాదించాలనే కోరికతో డబ్బులు పెట్టీ.. పెట్టీ.. పెట్టీ నష్టపోతున్నారు. అప్పులపాలవుతున్నారు.. చేసిన తప్పును ఎవరికీ చెప్పుకోలేక..ఆ నరకం నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకోవడమో.. అదృశ్యం కావడమో చేస్తున్నారు.. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లు చేస్తున్న కొందరు ఇన్‌ఫ్లూయేన్సర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ యాప్‌ల బారినపడి నలిగిపోతున్న యువత పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చోరీ కేసు లు, గంజాయి రవాణా వంటి నేరాల వెనుక ఆన్‌లైన్ బెట్టింగ్ బూచీ లింక్ అయి ఉంటోంది. నేరాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా యు వత, నడి వయస్కులు ఉంటున్నారు. వీళ్లు నేరా ల ద్వారా సంపాదించిన సొమ్మును బెట్టింగ్‌లకు వెచ్చిస్తున్నారు. లేదంటే బెట్టింగ్‌ల వల్ల అప్పు లపాలై వాటిని తీర్చడానికి వక్రమార్గాన్ని అనుస రిస్తున్నారు. కొంత మంది ప్రాణాలు తీసుకుంటు న్నారు. సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూ యెన్సర్లు కాసుల కక్కుర్తితో ఇస్తున్న ప్రకటనలు మరింత కీడు చేస్తున్నాయి.ఆస్తులు అమ్ముకొని బికారులుగా మిగిలినవాళ్లు, అప్పులు తీర్చడానికి దొంగలుగా మారినవారు ఎంతో మంది. బెట్టింగ్ యాప్‌లు ప్రాణాలు తీసిన ఘటనలెన్నో. ఇవేవీ బయటకు రావు..పోలీసు కేసుల్లో నమోదు కావు.
విద్యార్థులు, ఉద్యోగులు..
బెట్టింగ్ యాప్‌ల వలలో స్టూడెంట్స్, ఉద్యో గులు ఇలా అన్ని వర్గాల వాళ్లూ పడుతున్నారు. ముందు సరదాగా మొదలుపెట్టినా తర్వాత వ్యసనంగా మారిపోతోంది. బెట్టింగ్ యాప్‌ల వలలో ఎక్కువగా చదువుకున్న వారే ఉంటుం డడం ఆందోళన కలిగిస్తోందని సర్వేలు చెబుతు న్నాయి. ఏఐ సాంకేతికత, ఆల్గారిథమ్స్ వంటి అధునాతన టెక్నాలజీలతో యాప్‌లు తయారు చేస్తుండడంతో యాడ్‌ల రూపంలో ఎలాగైనా డబ్బు సంపాదించాలనే బలహీనతను అవి క్యాష్ చేసుకుంటున్నాయి. యాప్‌ల వలలో పడి నష్టపోతున్న వారు కోకొల్లలు.వీరిలో 99 శాతం మంది పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. మరో వైపు పోలీసులు పట్టించుకోవడంలేదు . బెట్టింగ్ యాప్‌లపై చైతన్యం తీసుకురాలేకపోతు న్నారు. దాదాపు 90 శాతం మంది విద్యార్థులు, ఖాళీ సమయం దొరికేవాళ్లు బెట్టింగ్ యాప్‌లపై మొగ్గు చూపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో క్రికెట్ బెట్టింగ్‌లకు ఏకంగా ఒక కార్యాలయమే తెరిచేశారంటే పోలీసుల నిఘా ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తూర్పు గోదావరిలో 2023లో నిడదవోలు, బొ మ్మూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేవలం రెండు క్రికెట్ బెట్టింగ్ కేసులు మాత్రమే నమోదు కాగా..2024లో ఒక్క కేసూ నమోదు కాలేదు. 20 25లో రాజానగరంలో ఒక్క కేసు నమోదైంది. వాస్తవానికి బెట్టింగ్ యాప్‌ల గురించి యాడ్‌లు ఇచ్చినా..వాటిని ప్రమోట్ చేసినా పోలీసులు కేసులు పెట్టవచ్చు.కానీ ఆ దిశగా ఇప్పటి వర కూ ఉమ్మడి జిల్లా లో ఒక్క ప్రయత్నమూ లేదు.
నాడు వైసీపీ నేతల దందా..
ఐపీఎల్, టీ 20 వంటి ఇతర సీజన్ల సమయంలో క్రికెట్ బెట్టింగ్ యథేచ్ఛగా సాగుతోంది. కాకినాడ కేంద్రంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ బెట్టింగ్ భారీగా సాగింది. స్థానిక వైసీపీ నాయకుడి ముఖ్య అనుచరులే ఈ బెట్టింగ్ కార్యకలాపాలకు మధ్యవర్తులుగా ఉండి నిర్వహించేవారు. లక్షలాది రూపాయలు పందేలు కాసిన వారెందరో ఈ క్రికెట్ బెట్టింగ్ బారిన పడి అప్పులపాలై నట్టు తెలుస్తోంది. అప్పట్లో ఎవరూ దీనిపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేని పరిస్థితి.ప్రత్యేకంగా బుకీలను ఏర్పాటు చేసుకుని మరీ గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాన్ని నడిపిన కొందరు కోట్లు సంపాదిస్తున్నారు. ఈ తరహా ఇతర ప్రాంతాల్లో కూడా కొందరు వెనకుండి యాప్‌లను నిర్వహి స్తూ యువతను బెట్టింగ్ మాయలోకి దింపుతున్నారు.
అక్కడ లీగల్..ఇక్కడ ఇల్లీగల్?
బెట్టింగ్ యాప్ నిర్వాహకులు అధికశాతం విదే శాల నుంచి ఆపరేట్ చేస్తుంటారు. నైజీరి యా, కెన్యా, ఫిలిపైన్స్, మెక్సికో వంటి చాలా దేశాల్లో జూదం లీగల్.అంటే జూదాన్ని అక్కడి చట్టాలు అనుమతిస్తాయి. అంతెందుకు మన దే శంలో కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో లాటరీ టికెట్లను బహిరంగంగా అమ్ముతుంటారు.ఇలా ఒక చోట చట్టబద్ధమైన పని, మరో చోట చట్ట ఉల్లంఘన కింద ఉంటోంది. అందువల్ల బెట్టింగ్ యాప్‌ల్లో సొమ్ము పోగొట్టుకుంటే తిరిగి చేతికి రావడం అసాధ్యం. పోలీసులు ఎంత శ్రమించినా 10 శాతం ఫలితాలు సాధించలేక పోవచ్చు. ఇక్కడ బెట్టింగ్ యాప్‌ల్లో దోచుకున్న సొమ్ము విదేశా ల్లోని నేరగాళ్ల ఖాతాలకు చేరుతుంది. దాన్ని వెనక్కి రప్పించడం ఎంతో కష్టం.
మనోళ్లే..క్రికెట్ బుకీలుగా..
రాయవరం : ఈ నెల 3న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలి యా లీగ్ మ్యాచ్‌పై రాయవరం మండలం సోమేశ్వరం, రాజానగరం మండలం చక్రద్వారబంధంలో ఆరుగురు క్రికె ట్ బుకీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.4 ల్యాప్‌టాప్‌లు,50 సెల్‌ఫోన్లు, రెండు ఎల్‌ఈడీ టీవీలు, రెండు లైన్‌బాక్స్‌లు,రూ.7.38 లక్షల నగదు కలిగిన బ్యాంక్ ఖాతా ఫ్రీజ్‌చేశారు.
రాజానగరం : తూర్పుగోదావరి జిల్లా రాజా నగరం మండలం చక్రద్వారబంధం బ్రిడ్జి కౌంటీ లోని బి-12 విల్లాలో దుబాయ్ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు పోలీసులు నిర్ధారించారు. కర్ణాటక,భీమవరానికి చెందిన 12 మందిని అరెస్టు చేశారు.ఈ ముఠాలో భీమవరానికి చెందిన వినీత్ దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి పలు రకాల పేర్లతో వెబ్‌సైట్లను నిర్వహిస్తున్నట్టు తెలు సుకున్నారు. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌పై బెట్టి ంగ్ నిర్వహిస్తుండగా అరెస్టు చేశారు.
స్మార్ట్‌ఫోన్‌లోనే అన్నీ..
నేటి సాంకేతిక యుగంలో బెట్టింగ్ స్మార్ట్ ఫోన్‌లోకి వచ్చేయడంతో యువత ఆసక్తి చూపుతున్నారు. కలర్ ప్రిడిక్షన్, నెంబర్ ప్రిడిక్షన్.. క్రికె ట్, కాసినో.. ఇలా అనేక రకాల విదేశీ యాప్‌లు అందుబాటులోకి రావడంతో ఈజీగా డబ్బులు సంపాదించొచ్చనే ఆశతో డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.ఎక్కువగా ఉమ్మడి జిల్లాల్లోని గ్రా మీణ యువత వీటి బారినపడి నలిగిపోతున్నారు.
కొన్ని కేస్‌స్టడీస్..
రాజమండ్రికి చెందిన ఓ కాంట్రాక్టరు ఫేస్ బుక్ చూస్తూ ఓ యాడ్‌పై క్లిక్ చేశాడు. ఇంకే ముంది..తక్కువ సమయంలో కోట్లు సంపాదిం చవచ్చని కనబడింది. యాప్ డౌన్‌లోడ్ చేసు కున్నాడు. ముందు కొంత సొమ్ము పెట్టుబడి పెట్టాడు. రెట్టింపు వచ్చినట్టు యాప్‌లో చూపించింది. ఎప్పుడైతే యాప్‌లో తన వివరాలను నమోదు చేశాడో ఇతడి క్రెడిట్ కార్డుల నెంబర్లు, పిన్‌లతో సహా అవతలి వ్యక్తులకు వెళ్లిపోయాయి. మూడు రోజుల్లో అవి ఉపయోగించి రూ.50 లక్షలు దోచేశారు. యాప్ పని చేయడం ఆగిపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
కాకినాడ జగన్నాథపురానికి చెందిన ఓ యువకుడు ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మాత్రమే ఆదాయ మార్గమని తన స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే యాప్‌లను డౌన్‌లోడ్ చేసి రిజిస్ర్టేషన్ చేసుకున్నాడు. మొదట రూ.20 నుంచి మొదలు పెట్టిన ఈ ఆటకు అంతే లేకుండా పోయింది.అప్పులు చేసి మరీ ఈ బెట్టింగ్ యాప్‌ల్లో ఆడాడు.. తీవ్రంగా నష్టపోయాడు. తనకున్న సొంతింటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
సామర్లకోట మండలం వేట్లపాలెంలో రెవె న్యూ శాఖలో పనిచేస్తున్న ఒక మహిళా సిబ్బంది భర్త ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అల వాటుపడ్డాడు.తన భార్య బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి మరీ బెట్టింగ్ కాసి ఉన్నదంతా పొగొట్టుకున్నాడు.ఏమీ చేయలేని నిస్సహాయతతో ఇంటికి వెళ్లే ధైర్యం లేక అజ్ఞాతంలోకి వెళ్లాడు.
కొవ్వూరు మండలం మద్దూరుకు చెందిన ఒక తాపీ మేస్త్రి బెట్టింగ్‌లకు అలవాటుపడి అప్పులు పాలయ్యాడు.. చివరికి భరించలేక ఇటీవల పేరుపా లెం బీచ్‌కు వెళ్లి ఆత్మహత్య చేసుకుం టున్నట్టు భార్యకు వీడియో పెట్టాడు. కంగారుపడిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆచూకీ లభించలేదు. తరువాత అతను ఫోన్ చేసి బతికే ఉన్నానని.. బెట్టింగ్‌ల కారణంగా ఇలా చేశానని వాపోయాడు.