Share News

చెరువులు తొలగిస్తే.. చావే గతి

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:44 AM

ఎన్జీటీ ఆదేశాల మేరకు సముద్ర తీర ప్రాంతంలో గత కొన్ని రోజులుగా సీఆర్‌జడ్‌ పరిధిలో కరవాక నుంచి అంతర్వేది దేవస్థానం వరకు 200 మీటర్ల మేర ఉన్న చెరువులను తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు.

చెరువులు తొలగిస్తే.. చావే గతి

అధికారులను అడ్డుకున్న ఆక్వా రైతులు,. గ్రామస్తులు

ఇప్పటికే నష్టాల్లో ఉన్నాం..

మా పొట్టలు కొట్టవద్దు

కలెక్టర్‌ కలిసి తేల్చుకుంటాం

అవకాశమిచ్చిన అధికారులు

అంతర్వేది బీచ్‌లో ఆందోళన చేపడుతున్న రైతులు, మహిళలు

అంతర్వేది, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఎన్జీటీ ఆదేశాల మేరకు సముద్ర తీర ప్రాంతంలో గత కొన్ని రోజులుగా సీఆర్‌జడ్‌ పరిధిలో కరవాక నుంచి అంతర్వేది దేవస్థానం వరకు 200 మీటర్ల మేర ఉన్న చెరువులను తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. మూడు మండలాల్లో సీఆర్‌జడ్‌ పరిధిలో ఉన్న 486 చెరువులను ఎన్జీటీ ఆదేశాల మేరకు తొలగించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమయ్యారు. ఇది గురువారం ఉద్రిక్త పరిస్థి తులకు దారితీసింది. అంతర్వేది బీచ్‌లో చెరువులు తొలగించేందుకు వచ్చిన అధికారులను ఆక్వా రైతులు అడ్డుకున్నారు. అంతర్వేది, అంతర్వేదిదేవస్థానం, పల్లిపాలెం గ్రామస్తులు తొలగించవద్దంటూ అడ్డుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాజోలు సీఐ టి.నరేష్‌కుమార్‌, భీమరాజు బృందాలతో ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే రైతులు స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యుల సహకారంతో రెవెన్యూ, పోలీసు, మత్స్యశాఖ అధికారులతో చర్చలు జరిపారు. ముందుగా రైతులు ఆక్వా రంగంలో తీవ్రంగా నష్టపోయామని, మా ప్రాంతం భూములు చెరువులకు తప్ప దేనికీ నోచుకోదని, స్వచ్ఛందంగా క్రాప్‌ హాలీడే ప్రకటించుకున్నామన్నారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు చెరువులకు గండ్లు కొడితే ఆత్మహత్యలకు పాల్పడుతామంటూ పలువురు రైతులు పెట్రోల్‌, పురుగుల మందు డబ్బాలు చూపారు. ఇప్పటికే తీవ్ర నష్టాల బారిన పడ్డామని, ఇప్పటికిప్పుడు చెరువులకు గండ్లు కొట్టి మా పొట్టలు కొట్టవద్దంటూ మహిళలు, రైతులు ఆందోళనకు దిగారు. సుమారు నాలుగు గంటల పాటు మత్స్య, పోలీసు, రెవెన్యూశాఖలు, స్థానిక ప్రజాప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఫిషరీస్‌ జేడీ శ్రీనివాస్‌ అమలాపురం ఆర్డీవోతో మాట్లాడారు. రైతులు కలెక్టర్‌తో మాట్లాడుకోవడానికి ఒకరోజు గడువు కోరారు. కలెక్టర్‌తో రైతులు మాట్లాడిన అనంతరం చెరువు తొలగింపు చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు, ఏడీ సిద్ధార్థవర్థన్‌, సీఐలు టీవీ నరేష్‌కుమార్‌, భీమరాజు, ఎస్‌ఐలు కె.దుర్గాశ్రీనివాస్‌, పి.సురేష్‌, రాము, తహశీల్దార్‌ ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహశీల్దార్‌ భాస్కర్‌, సర్పంచ్‌లు కొండా జాన్‌బాబు, వడుగు శ్రీను, పోతురాజు నరసింహరావు(కిశోర్‌), ఎంపీటీసీ బైరా నాగరాజు, అడబాల రాంబాబు, లక్కు సత్యనారాయణ, రావూరి నాగు, నల్లా సత్యకిరణ్‌ప్రసాద్‌, తాడి నీలకంఠం, మందపాటి వెంకటేశ్వర్లు, బెల్లంకొండ రామకృష్ణ (నాని), అడబాల శ్రీను, తీరప్రాంత రైతులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 01:44 AM