Share News

ఆదమరిస్తే..అంతే!

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:38 AM

టెన్త్‌.. ఇంటర్‌.. పరీక్షలు ముగిశాయి.. విద్యార్థులకు దాదాపుగా వేసవి సెలవులు వచ్చేశాయి.. చిన్న తరగతులకు చూస్తే ఒంటిపూట బడులు నడుస్తున్నాయి.. దీంతో ఆనందానికి హద్దే లేకుండాపోతోంది.. ప్రతిరోజూ ఈరోజు ఏంటీ అనే ఆలోచనే.. దీంతో చాలా మంది పిల్లలు.. యువత సరదాగా గడుపుదామని నదీ స్నానాల బాటపడుతున్నారు. అయితే ఆదమరుపుగా ఉన్నారో ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే..

ఆదమరిస్తే..అంతే!
వేసవి ఉపశమనం..గోదారి : గోదావరిలో స్నానాలు

ప్రమాదకరంగా గోదారి ఘాట్లు

కాలువలదీ ఇదే పరిస్థితి

కానరాని కనీస రక్షణ చర్యలు

వేసవి తాపంతో పెరిగిన తాకిడి

బుధవారమే నలుగురు మృతి

అయినా పట్టని అధికారులు

ఇకనైనా మేల్కొనాల్సిందే

టెన్త్‌.. ఇంటర్‌.. పరీక్షలు ముగిశాయి.. విద్యార్థులకు దాదాపుగా వేసవి సెలవులు వచ్చేశాయి.. చిన్న తరగతులకు చూస్తే ఒంటిపూట బడులు నడుస్తున్నాయి.. దీంతో ఆనందానికి హద్దే లేకుండాపోతోంది.. ప్రతిరోజూ ఈరోజు ఏంటీ అనే ఆలోచనే.. దీంతో చాలా మంది పిల్లలు.. యువత సరదాగా గడుపుదామని నదీ స్నానాల బాటపడుతున్నారు. అయితే ఆదమరుపుగా ఉన్నారో ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే.. నది ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో ప్రమాదం జరిగిన తరువాత అంతే విషాదాన్ని మిగులు స్తోంది. అందుకే తస్మాత్‌ జాగ్రత్త.. నదిలో స్నానాలకు దిగినా రక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. ఆదమరుపుగా ఉన్నామా మునిగిపోతామంతే..పేరులోనే గోదావరి ఉన్న జిల్లా మనది.. నీటికి లోటు లేదు.. ఆ నీటిలో జరిగే ప్రమాదాలకు కొదువే లేదు. ప్రతి ఏటా 50 మంది వరకూ నదీ ప్రమాదాల్లో మృత్యుపడుతున్నారంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసు కోవచ్చు. నది ఏదైనా పైకి ప్రశాం తంగానే కనిపిస్తుంది.. దిగితేనే దాని లోతు తెలుస్తుంది.. ప్రస్తుత వేసవి నేపథ్యంలో నదీ స్నానాలకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది.. గోదావరి.. కాలువలు. సముద్రతీర ప్రాం తం ఇలా ఎక్కడపడితే అక్కడ సరదాగా స్నానాలకు క్యూకడుతుంటారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజు వేలాది మంది స్నానాలు ఆచరిస్తుంటారు. ఈ సరదాలో ప్రమాదాలను గుర్తించలేక పలు వురు మృత్యువాత పడిన ఘటనలు అనేకం. ఇటీవల శివరాత్రికి తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదా వరిలో స్నానం చేద్దామని వెళ్లి ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు. బుధవారమే చూస్తే కాకినాడ జిల్లాలో కాండ్రకోట, పెద్దనా పల్లి వద్ద ఏలేరు కాలువలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృత్యువాత పడ్డారు. వేసవి సెలవుల్లో సరదాకు స్నానాలు సరే కానీ ఆదమరుపుగా ఉన్నామా మిగిలేది మాత్రం కన్నీళ్లే..

ఈత సరదా.. కాదు!

రాజమహేంద్రవరం సిటీ/కొవ్వూరు/ఆత్రేయపురం: ఉమ్మడి జిల్లాలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతం చాలా ఎక్కువ. ఇటు తూర్పుగోదావరి.. అటు కోనసీమ జిల్లా లను ఆనుకుని గోదావరి ప్రవహిస్తుంది. వేసవి వచ్చిందంటే పిల్లలతోపాటు పెద్దలు గోదావరి స్నానాలకు క్యూకడుతుం టారు. కొవ్వూరు, రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ఉంటుంది. ఈ నేపథ్యంలో లోతు ఎక్కువ. కొవ్వూరు గోష్పాదక్షేత్రం.. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌, గౌతమి ఘాట్‌, అయ్యప్ప ఘాట్లు, ధవళేశ్వరం బ్యారేజీ, జొన్నాడ తదితర ప్రాంతాల్లో స్నానాలు ఎక్కువగా చేస్తుం టారు. ఆయా ప్రాంతాల్లో గతంలో ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కాటన్‌ బ్యారేజీ వద్ద గోదావరిలో ప్రతి ఏటా పర్యాటకులు వేలాదిగా స్నానాలు చేస్తుంటారు. ప్రతి ఏటా పదుల సంఖ్యలో యువకులు మృత్యువాతపడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలిస్తున్నారు. గతేడాది మే నెలలో ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి ఎందరో చనిపోయారు. ఊబలున్న చోట పైకి గోదావరి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది దిగితేనే దాని లోతు తెలి సేది. పుష్కరాల రేవులో చాలామంది పిల్లలు, పెద్దలు లోతు తెలియక దిగి మృత్యువాతపడిన సందర్భాలున్నాయి. పడవలపై గోదావరి మధ్యలోకి వెళ్లి లంకల్లో దిగి స్నానాలు చేస్తున్నవారున్నారు. అయినా నేటికీ రక్షణ చర్యలు కానరావడం లేదు. రోజురోజుకు సందర్శకులు పెరుగుతున్నా ఏ ఒక్కరూ రక్షణపై దృష్టి సారించడంలేదు.

కన్నీట..కాలువలు

పిఠాపురం/ ప్రత్తిపాడు/కిర్లంపూడి/ పెద్దాపు రం : కాలువలు ప్రమాదకరంగా మారుతున్నాయి.. లోతు తెలియకుండా దిగి ఎంతో మంది మృత్యువా తపడుతున్నారు. పిఠాపురం-గొల్లప్రోలు మధ్య గల ఏలేరు,ీ పబీసీ కాలువలు ఉన్నాయి. వర్షాకాలంలో సుద్దగడ్డ కాలువ ప్రమాదకరంగా ఉంది. ఏలేరు కాలువలో పిడిందొడ్డి, ఎదు రొడ్డి, గొల్లప్రోలు కాలువలతోపాటు బల్లకట్టు, భోగాపురం గుమ్మిడిగట్టు రెగ్యులేటర్‌, గొల్లప్రోలు, చిత్రాడ, నవఖండ్రవాడ, మల్లవరం, యండపల్లి తదితర ప్రాంతాల్లోని పీబీసీ కాలువలు, గొల్లప్రోలు వద్ద సుద్దగడ్డ కాలువ, చెందుర్తి, కొడవలి వద్ద పుష్కర, పోలవరం కాలువల వద్ద పలు ప్రమాదాలు చోటు చేసుకుని గత ఐదేళ్లలో 19 మంది మృత్యువాతపడ్డారు. ఏలేశ్వరం ఏలేరు రిజర్వాయర్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏలేరు ఎడమ కాలువ ప్రమాదభరితంగా మారింది. పెదశంకర్లపూడి, రౌతుపాలెం,పెద్దిపాలెం, గజ్జెనపూడి, యుజేపురం తదితర చోట్ల స్నానాలకు కాలువలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు.పొదురుపాక, గజ్జెనపూడి, చింతలూరు పరిసరాల్లో అనేక ప్రమాదాలు జరిగాయి. కిర్లంపూడి మండలం ముక్కొల్లు,పెద్దాపురం మండలం కాండ్రకోట ఏలేరు బెడ్‌ రెగ్యులేటర్ల వద్ద ప్రమాదకరంగా ఉంది. రెండు చోట్లా ఇప్పటివరకూ 30 మంది మృత్యువాతపడడమే అందుకు ఉదాహరణ.

ప్రమాదాల తీరం..

అల్లవరం : సముద్ర తీరం చూస్తే ఎవరికి స్నానం చేయాలనిపించదు మరి. ఉమ్మడి జిల్లాలో కాకినాడ, అల్లవరం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో సముద్రతీర ప్రాంతాలు ఉన్నాయి. వేసవి కావడంతో కొందరు యువకులు సముద్ర స్నానాలకు దిగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అల్లవరం, కాకినాడ సముద్ర తీర ప్రాంతాల్లో పలు ప్రాంతాల నుంచి కుటుంబీకులతో బీచ్‌కు చేరి సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఓడలరేవు తీరంలో మెరైన్‌ పోలీసులు గస్తీ తిరుగుతున్నా కొందరు యువత వారిని కాదని లోతుకు వెళ్లి మృత్యువాతపడుతున్నారు. తీరాన అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతి.

Updated Date - Apr 04 , 2025 | 01:38 AM