Share News

రి‘హార్స్‌’ల్స్‌

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:45 AM

ఒకప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి... తర్వాత మగధీరలో రామ్‌చరణ్‌..... బాహుబలిలో ప్రభాస్‌... వారిలా గుర్రపుస్వారీ చేయాలనే ఆసక్తి యువతలో పెరుగుతోంది. హార్స్‌ రైడింగ్‌ ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. యువతతో పాటు చిన్న పిల్లలు కూడా నేర్చుకునేందుకు శ్రద్ధ కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్‌ రైడింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. వారు గుర్రాలపై స్వారీ చేస్తుంటే చూసి ముచ్చట పడుతున్నారు. యువత, చిన్నారుల తల్లిదండ్రులకు అనుగుణంగా హార్స్‌ రైడింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు వెలుస్తున్నాయి.

రి‘హార్స్‌’ల్స్‌

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెరుగుతున్న శిక్షణ కేంద్రాలు

కాకినాడ బీచ్‌లో దౌడు తీస్తున్న యువకులు, చిన్నారులు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఒకప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి... తర్వాత మగధీరలో రామ్‌చరణ్‌..... బాహుబలిలో ప్రభాస్‌... వారిలా గుర్రపుస్వారీ చేయాలనే ఆసక్తి యువతలో పెరుగుతోంది. హార్స్‌ రైడింగ్‌ ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. యువతతో పాటు చిన్న పిల్లలు కూడా నేర్చుకునేందుకు శ్రద్ధ కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్‌ రైడింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. వారు గుర్రాలపై స్వారీ చేస్తుంటే చూసి ముచ్చట పడుతున్నారు. యువత, చిన్నారుల తల్లిదండ్రులకు అనుగుణంగా హార్స్‌ రైడింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు వెలుస్తున్నాయి.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు వందకు పైగా గుర్రాలను పెంచుతున్నారంటే గుర్రపు స్వారీ పట్ల యువత ఆసక్తి ఎంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాలు వెలిశాయి. గతంలో గుర్రపు స్వారీ నేర్చుకోవాలంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఓ మోస్తరు పట్టణాల్లో సైతం శిక్షణ కేంద్రాలు తెరుస్తున్నారు. వేసవి కావడంతో యువతతో పాటు చిన్నారులు కూడా గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు కార్పొరేట్‌ స్థాయి ప్రైవేటు స్కూళ్లల్లో సైతం గుర్రపు స్వారీ శిక్షణ ఇప్పిస్తుండడం విశేషం..

ఎన్నో ప్రయోజనాలు...

గుర్రపు స్వారీ నేర్చుకోవడం వల్ల మానసిక, శారీరక సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. పోలియో, పక్షవాతంతో పాటు, మెదడు, వెన్నెముక సమస్యలు, వినికిడి లోపాలు... ఇలా అనేక సమస్యలకు చక్కటి చికిత్సగా పని చేస్తుంది. ముఖ్యంగా మానసిక వికాసం లోపించిన పిల్లలకు మంచి ఫలితాలు ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు. పిల్లలు గుర్రపు స్వారీ చేయడం వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గుర్రం కళ్లెం పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, గుర్రాన్ని దుమికించడం, ఓకే రీతిలో ముందుకు సాగడం వంటి చర్యల వల్ల మెదడుకు, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ఉత్తేజం కలుగుతుంది. ఫలితంగా అనేక రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయని చెప్తున్నారు.

ఇసుక నేలైతేనే మేలు...

గుర్రపు స్వారీ ఓ సాహస క్రీడ. ప్రమాదాలకు ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గట్టినేలపై ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉండడంతో.. శిక్షక్షులు ఇసుక నేలల్లో శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు అనుకూలంగా ఉండడంతో ఇక్కడే చాలా మంది తమ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాకినాడ-ఉప్పాడ బీచ్‌ రోడ్డులోని ఇసుక మేటల మధ్య కొందరు యువకులు గుర్రపు స్వారీ శిక్షణ ఇస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం రెండేసి గంటల చొప్పున నేర్పుతున్నారు. అయితే మూడు నెలల పాటు శిక్షణకు వస్తే.. గుర్రపు స్వారీపై కాస్త పట్టు సాధించవచ్చని చెప్తున్నారు.

కాకినాడ విద్యుత్‌ నగర్‌కు చెందిన అనిల్‌ రెడ్డి జంతు ప్రేమికుడు. పలు జాతుల కుక్కలు, గర్రాలను పెంచి పోషిస్తుంటారు. హార్స్‌ రైడింగ్‌లో కూడా ఈయన నేర్పరి. ఈయన సుమారు పది వరకు మార్వాడీ జాతి గుర్రాలను పెంచుతున్నారు. అందులో ఏడింటిని వ్యక్తిగత అభిరుచి మేరకు పెంచుకుంటుండగా, మూడింటిని శిక్షణకు వినియోగిస్తున్నారు. ఆయన వద్ద రూ.లక్షన్నర మొదలు రూ.కోటి వరకు విలువైన గుర్రాలు వున్నాయి. వీటిని రాజస్థాన్‌, పంజాబ్‌ నుంచి తీసుకొచ్చారు. రెండేళ్లుగా ఇక్కడ శిక్షకులను, గుర్రాల సంరక్షకులను ఉంచి, గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈయన పెంచుతున్న గుర్రాలు రెండుసార్లు ఆల్‌ ఇండియా చాంపియన్‌షిప్‌ సాధించాయి.

Updated Date - Apr 02 , 2025 | 12:45 AM