Home Minister Anitha: అందుకే వెయ్యి జరిమానా!
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:47 AM
లక్ష రూపాయలు పెట్టి బండి కొన్నవారు రూ.300తో హెల్మెట్ కొని పెట్టుకోడానికి సమస్య ఏమిటి అని హోం మంత్రి అనిత ప్రశ్నించారు. హెల్మెట్ లేదని జరిమానాలు విధిస్తుండటంపై బుధవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

హెల్మెట్ పెట్టుకోడానికి సమస్య ఏమిటి?.. ప్రస్తుతం రద్దీ పట్టణాల్లోనే అమలు
అవగాహన కల్పించాక రాష్ట్రవ్యాప్తం చేస్తాం: హోంమంత్రి అనిత
అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): లక్ష రూపాయలు పెట్టి బండి కొన్నవారు రూ.300తో హెల్మెట్ కొని పెట్టుకోడానికి సమస్య ఏమిటి? అని హోం మంత్రి అనిత ప్రశ్నించారు. హెల్మెట్ లేదని జరిమానాలు విధిస్తుండటంపై బుధవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. హెల్మెట్ ధరించని వారిపై భారీగా జరిమానాలు విధించడం సరికాదని టీడీపీ సభ్యులు అన్నారు. పోలీసులు గౌరవంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.వెయ్యి జరిమానా వసూలుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. దీనిపై హోంమంత్రి మాట్లాడుతూ.. 2020లో కేంద్రం చేసిన చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రూ.వెయ్యి జరిమానా వసూలు చేస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో మరణాలతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ప్రాణమా? వెయ్యి రూపాయలా? అన్న సున్నితత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. పౌరుల్లో మార్పు కోసమే రూ.100 నుంచి వెయ్యికి జరిమానా పెంచినట్టు తెలిపారు. హెల్మెట్ లేకపోవడం వల్ల 2021లో 2,577 మంది, 2022లో 3042 మంది, 2023లో 3108 మంది, 2024లో 3400 మంది చనిపోయారని, క్షతగాత్రులు 2,3 రెట్లు ఎక్కువ అని చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండి ప్రమాదాలు జరిగే పట్టణాల్లోనే హెల్మెట్ తప్పనిసరి చేశామని, అవగాహన సదస్సులు నిర్వహించాక రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు.