ప్రభుత్వాస్పత్రుల్లో.. సమస్యల తిష్ఠ
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:58 AM
ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించా లనే ప్రభుత్వ లక్ష్యం సిబ్బంది కొరతతో నీరుగారుతోంది. అత్యాధునిక వసతులతో భవన నిర్మాణాలు, వసతు లను కల్పిస్తున్నా రోగులకు వచ్చిన వ్యాధుల నిర్ధారణ చేసేందుకు సరైన వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

వైద్యుల కొరత..రోగుల ఇబ్బందులు
సిబ్బంది కొరతతో సేవలు దూరం
ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు
ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించా లనే ప్రభుత్వ లక్ష్యం సిబ్బంది కొరతతో నీరుగారుతోంది. అత్యాధునిక వసతులతో భవన నిర్మాణాలు, వసతు లను కల్పిస్తున్నా రోగులకు వచ్చిన వ్యాధుల నిర్ధారణ చేసేందుకు సరైన వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి రూ.వేలల్లో సొమ్ము ఖర్చు చేయలేక ప్రభుత్వాస్పత్రినే ఆశ్రయిస్తున్నారు. మరికొంతమంది అప్పులు చేసి ప్రైవేటు వైద్యాన్ని పొందుతున్నారు. శుక్రవారం కైకలూరు ప్రభుత్వాస్పత్రి, చింతలపూడి ఏరియా ఆస్పత్రి, జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిని ‘ఆంధ్రజ్యోతి’ విజిట్ చేయగా పలు అంశాలు వెలుగుచూశాయి.
వారం రోజులుగా నో ఎక్స్‌రే..
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిని ఏళ్ల తరబడి పలు సమస్యలతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది కొరత వెంటాడుతూనే ఉంది. పేరుకు వంద పడకల ఆసుపత్రి అయి నా తగిన సిబ్బందిని నియమించకపోవడం వల్ల రోగులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నెల 22 నుంచి ఎక్స్‌రే విభాగంలో సీఆర్ సిస్టమ్ రీడర్‌కు రిపేరు రావడంతో రోగులకు ఎక్స్‌రే సేవలు అందడం లేదు. దీంతో ఆర్ధోపెడిక్ రోగులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. శుక్ర వారం భారతి అనే ఓ మహిళ కాలునొప్పితో రాగా సంబంధిత డాక్టరు ఎక్స్‌రే తీయించు కురమ్మన్నారు. తీరా ఎక్స్‌రే విభాగానికి వెళ్తే సోమవారం రమ్మని పంపిచేశారు. పట్టణానికి చెందిన అల్లిపల్లి శివకు శుక్రవారం కారు ప్రమా దం జరిగింది. ఈ ప్రమాదంలో అతని కాలికి, చేతికి గాయాలయ్యాయి. ఆర్ధోపెడిక్ డాక్టర్ పరి శీలించి ఎక్స్‌రే తీయించుకుని రమ్మనగా బయట రూ.600 ఖర్చు చేసి ఎక్స్‌రే తీయిం చుకుని వచ్చారు. ఆస్పత్రిలో రక్తపరీక్షా కేంద్రం వద్ద రిపోర్టులు తీవ్ర ఆలస్యం కావడంతో రోగులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల నుంచి ఇక్కడకు ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు. ఎమర్జెన్సీ కేసులను ఏలూరు, విజయవాడ రిఫర్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఐసీయూ విభాగం లేదు. ఆస్పత్రిలో 23 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 17 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు.ఆరు పోస్టులను భర్తీ చేయాల్సిఉంది. నర్సింగ్ సూపరిండెంటెంట్ గ్రేడ్–2 ఒక పోస్టు, స్టాఫ్ నర్సులు 11, ఫార్మా సిస్టు గ్రేడ్–2 ఒక పోస్టు, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 ఒక పోస్టు, రేడియో గ్రాఫర్ ఒక పోస్టు , డార్క్ రూమ్ అసిస్టెంట్ ఒక పోస్టు,ఆఫీస్ సబార్డినేట్ పోస్టు ఒకటి ఖాళీగా ఉన్నాయి. మార్చురీ రూమ్ నిర్మాణం పూర్తి కాకపోవ డంలో పాత ఆస్పత్రి భవనంలోనే మృత దేహాలను ఉంచుతున్నారు. అధికారులు స్పందిం చి వైద్య సిబ్బందిని నియమించి సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
పేరుకు వంద పడకలు.. ఉన్నవి 30
చింతలపూడి : చింతలపూడి ఏరియా ఆస్పత్రి రోగులపాలిట సమస్యల నిలయంగా మారింది. పేరుకు వంద పడకల ఆస్పత్రి. కాని 30 పడకల సౌకర్యం మాత్రమే ఉంది. ఇక్కడ 23 మంది డాక్టర్లను నియమించాల్సి ఉండగా ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఇటీవల స్థానికులు, వివిధ పార్టీల నాయకులు ఇక్కడ 23 మంది డాక్టర్ పోస్టులు మంజూరైనా 13 మందే ఉన్నారని, మిగిలిన వారిని భర్తీ చేయాలని వినతులు సమర్పించారు. అయితే విచిత్రంగా పోస్టుల భర్తీ కాలేదు కాని ఉన్నవారి సంఖ్య ఎనిమిది మందికి తగ్గింది. పట్టణ పరిసర గ్రామాలు, మండలాల నుంచి నిత్యం 600 మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు. ఇందులో 70 శాతం మహిళలే ఉంటారు. ఎక్కువగా డెలివరి కేసులు, మహిళా పేషెంట్లు, పిల్లలు, కంటి వైద్యం, ఆర్ధోపెడిక్, డెంటల్, యాక్సిడెంట్ కేసులు వస్తుంటాయి. చింతల పూడి, లింగపాలెం, చాట్రాయి, టి.నర్సాపురం మండలాల నుంచి 108లో పేషెంట్లను తీసు కొస్తుంటారు. ప్రస్తుతం ఉన్న ఈ ఎనిమిది మంది వైద్యుల్లో ఇద్దరు మత్తు డాక్టర్లు, ఒకరు జనరల్ మెడిసెన్, ఒకరు ఆర్ధోపెడిక్, ముగ్గురు జనరల్ డాక్టర్లు ఉండగా పది రోజుల క్రితం గైనకాలజి డాక్టర్‌ను నియమించారు. ఇక్కడ పని చేసిన చర్మవ్యాధులు, డెంటల్, పంటి వైద్యం, పలు విభాగాలకు చెందిన డాక్టర్లు బదిలీకాగా కొందరు డిప్యుటేషన్‌పై వెళ్లడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీడియాట్రిక్, గైనకాలజి, ఈఎన్‌టీ వైద్యులు లేకపోవడం రోగులకు ఇబ్బందిగా మారింది. ఆస్పత్రిలో డాక్టర్లు, స్టాఫ్ 90 మంది అవసర ముంది. ప్రస్తుతం ఉన్న భవనమంతా లీకేజీల వల్ల పెచ్చులూడి నీరుకారుతోంది. చికిత్సకు, పరీక్షలకు కావాల్సిన సిటీస్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్, రేడియాలజీ డాక్టర్ల కొరత తీర్చమంటే కొరతను సృష్టిస్తున్నట్టుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. వార్డుల్లోను, ఆపరేషన్ థియే టర్‌లో భవనం పెచ్చులూడి అధ్వానంగా ఉంది. ఆర్ధోపెడిక్ డాక్టర్ ఉన్నా సిఆర్మ్ సౌకర్యంలేదు. దీంతో వచ్చిన పేషెంట్లను ఏలూరు తరలిస్తున్నారు. ఆస్పత్రి వద్ద పార్కింగ్ సౌకర్యం, క్యాంటీన్ లేవు. ల్యాబ్ సౌకర్యం పూర్తిస్థాయిలో లేదు. ఇక రూ.25 కోట్ల వ్యయంతో చేపట్టిన నూతన భవనాలు 90 శాతం నిర్మాణం పూర్తయ్యాయి. ఇప్పటికి రెండుసార్లు ప్రారంభిస్తారని చెప్పినా పనులు పూర్తికావడం లేదు.
12 మందికి ఏడుగురే వైద్యసేవలు
కైకలూరు : కైకలూరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్య సేవలందక రోగులు ఇబ్బందులు పడుతు న్నారు. కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది వైద్యాధికారులు ఉండాల్సి ఉండగా ఏడుగురు మాత్రమే సేవలందిస్తున్నారు. మరో ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గైనకాలజిస్టు, సర్జన్, ఫిజియో థెరపీ, ఫిడియాట్రిషియన్, అనస్తీషియా వైద్యులు అందుబాటులో లేరు. ఆస్పత్రి భవన నిర్మాణం చేసినప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో కనీస మరమ్మతులు చేయకపోవడంతో క్యాజువాలిటీరూంలో గోడలకు, శ్లాబుకు పెచ్చులూడడంతో రోగులు మీద పడతాయోమనని భయాందోళన గుర వుతున్నారు. కొల్లేటికోట, సీతనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నిషీ యన్ల కొరత వేధిస్తోంది. కలిదిండి, కోరుకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషి యన్లు కొరత ఉంది. మండవల్లి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరే సేవలందిస్తున్నారు. తక్కెళ్లపాడులో పీహెచ్‌సీ ఆస్పత్రి ఏర్పాటు చేసి సుమారు రెండేళ్లు కావొస్తున్నా పూర్తిస్థాయిలో వైద్యసిబ్బంది నియామకం జరగలేదు. ఆస్పత్రి భవన నిర్మాణాలు చేపట్టకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగుతోంది.