Share News

Government Action : అదానీకి అడ్డు లేదా?

ABN , Publish Date - Feb 15 , 2025 | 06:46 AM

కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్‌ పాలనలోని అక్రమ నిర్ణయాలన్నీ రద్దు చేస్తారని అందరూ భావించారు. ఈ దిశగా కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.

Government Action : అదానీకి అడ్డు లేదా?

  • జగన్‌ పాలనలో మన్యంలో 3 హైడ్రో ప్రాజెక్టులు

  • మొత్తం 2 వేల ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు

  • కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా చర్యలు కరువు

(రంపచోడవరం-ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్‌ పాలనలోని అక్రమ నిర్ణయాలన్నీ రద్దు చేస్తారని అందరూ భావించారు. ఈ దిశగా కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అయితే మన్యంలో గిరిజన చట్టాల ఉల్లంఘనతో మంజూరైన పవర్‌ ప్రాజెక్టుల విషయంలో చర్యలు కొరవడ్డాయి. గత ప్రభుత్వంలో మాదిరిగానే ఇప్పుడు కూడా గిరిజన చట్టాల ఉల్లంఘనను కొనసాగిస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌ హయాంలోని పలువురు అధికారులే కూటమి ప్రభుత్వంలో కూడా అక్కడ కీలకంగా కొనసాగుతుండడమే ఇందుకు కారణమన్న విమర్శలు కూడా ఉన్నాయి. గత జగన్‌ పాలనలో గిరిజన చట్టాలను ఉల్లంఘించి మరీ మన్యంలో అదానీ పవర్‌ వంటి సంస్థలకు హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను కట్టబెట్టారు. అప్పట్లో చట్టవిరుద్ధంగా భూములు కేటాయించడం తీవ్ర వివాదాస్పదమెంది. గిరిజన ప్రయోజనాల కోసం గతంలో బాక్సైట్‌ లీజులను రద్దు చేసిన చంద్రబాబు.. అలాగే మన్యంలో భూ కేటాయింపుల విషయంలోనూ గిరిజన చట్టాలను కాపాడాలని కోరుతున్నారు.


2022లో కేటాయింపులు

దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుదుత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలను రూపొందించి అనేక రాయితీలతో ఆయా సంస్థలకు ప్రాజెక్టులు కట్టబెడుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2022లో జగన్‌ సర్కార్‌ పలు సంస్థల కోసం ప్రత్యేక విధానాన్ని అమలులోకి తెచ్చింది. 14,680 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి నిల్వ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాజెక్టులను వివిధ సంస్థలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయించింది. వీటిలో నాలుగు ప్రాజెక్టులు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం గిరిజన జిల్లాల్లోనే ఉన్నాయి. 1970 తర్వాత మన్యంలో ఒక్క అంగుళం భూమి కూడా గిరిజనేతరులకు బదలాయించేందుకు వీలులేని విధంగా చట్టాలు అమలులో ఉన్నాయి. అయితే జగన్‌ సర్కారు ఇక్కడ హైడ్రో ప్రాజెక్టులను, అందుకు అవసరమైన భూములను చట్టవిరుద్ధంగా గిరిజనేతర సంస్థలకు కేటాయించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దు దిశగా చర్యలు లేకపోగా, గత ప్రభుత్వం మాదిరిగానే మన్యంలో మరో రెండు పవర్‌ ప్రాజెక్టులను గిరిజనేతర సంస్థలకు కట్టబెట్టే చర్యలు మొదలయ్యాయి.


నాడు బాక్సైట్‌ లీజుల రద్దు

హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల కేటాయింపు తరహాలో గతంలో బాక్సైట్‌ తవ్వకాల విషయంలోనూ ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. వ్యవహారం వివాదాస్పదంగా మారి సుప్రీం కోర్టు వరకు కేసు నడిచింది. సమతా కేసుగా ప్రాచుర్యం పొందిన ఆ కేసులో గిరిజన ప్రాంతాలలో స్థిరాస్థులను గిరిజనేతరులెవ్వరికీ కట్టబెట్టేందుకు వీల్లేదని, ప్రభుత్వాన్ని కూడా గిరిజనేతరునిగానే పరిగణించాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. 2014కు ముందు బాక్సైట్‌ లీజులను అప్పటి ప్రభుత్వం ఇస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఆయా లీజులను రద్దు చేసింది. చంద్రబాబు స్ఫూర్తితో ప్రస్తుతం ఉన్న అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలోని చాలా మంది ఉన్నతాధికారులకు ఈ విషయాలు తెలిసినా.. ఇంకా గత ప్రభుత్వ పోకడలు వదిలించుకోలేక చట్టవిరుద్ధ నిర్ణయాలను కొనసాగిస్తున్నారు.


నిబంధనలకు విరుద్ధంగా..

జగన్‌ ప్రభుత్వం అల్లూరి జిల్లాలోని కొయ్యూరు మండలం ఎర్రవరంలో 1200 మెగావాట్లతో, అనంతగిరి మండలం పెదకోటలో 1000 మెగావాట్లతో, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కురుకుట్టిలో 1200 మెగావాట్లతో, కర్రివలసలో 1000 మెగావాట్లతో పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను కేటాయించింది. ఇందులో మూడు ప్రాజెక్టులను అదానీ పవర్‌ కంపెనీకి, ఒక ప్రాజెక్టును షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెట్టింది. ఈ ప్రాజెక్టుల కోసం మొత్తం సుమారు 2 వేల ఎకరాలకు పైగా భూమి కావాలి. వీటిలో 25 శాతం దాకా అటవీ భూములు ఉండగా, మిగిలినవి పట్టా భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూములను విక్రయం ద్వారా గానీ, లీజు ద్వారా గానీ ఆ సంస్థలకు కట్టబెట్టే వివాదాస్పద నిర్ణయాలను గత ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఏ విధమైన ప్రాజెక్టులు చేపట్టాలన్నా ఆయా గ్రామసభల తీర్మానాలు, రాష్ట్ర గిరిజన సలహా మండలి ఆమోదం అవసరం. కానీ ఇవేమీ లేకుండానే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఈ మేరకు భూ కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుల రద్దు దిశగా చర్యలు తీసుకోవడంలో గిరిజన సంక్షేమం, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

Updated Date - Feb 15 , 2025 | 06:46 AM