Share News

Vijayawada Politics: ఎమ్మెల్యే రుబాబు!

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:35 AM

పేదల ఆక్రమణలో ఉన్న 150 గజాల వరకు ఇంటి స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకుమించితే... నిర్ణీత ధర వసూలు చేయాలని తీర్మానించింది

Vijayawada Politics: ఎమ్మెల్యే రుబాబు!

  • విచక్షణ మరిచి నోటి దురుసు

  • రెవెన్యూ సీనియర్‌ అధికారులపై అసెంబ్లీ ఆవరణలో చిందులు

  • కబ్జా క్రమబద్ధీకరణ కోసం ఒత్తిళ్లు

  • కుదరదని చెప్పడంతో ఆక్రోశం

  • 5 నిమిషాలు ఆగకుండా దూషణలు

  • అడ్డుకున్న మంత్రిపైనా అదే దూకుడు

  • గట్టిగా చురకలు అంటించిన మంత్రి

  • ఎమ్మెల్యేపై సీఎంకు నిఘా సమాచారం

  • మంత్రిని పిలిపించి ఆరా తీసిన సీఎం

‘నేను చెప్పింది చేయాల్సిందే! ప్రభుత్వ స్థలాన్ని అడ్డగోలుగా ఆక్రమించుకుని... భారీ భవంతిని నిర్మించుకున్నా సరే! దానిని క్రమబద్ధీకరించాల్సిందే!’... ఇదీ ఆ ఎమ్మెల్యే తీరు! అలా కుదరదని చెప్పినందుకు... ఆయన రెచ్చిపోయారు. అసెంబ్లీలోనే ఇద్దరు సీనియర్‌ రెవెన్యూ అధికారులపై గొడవకు దిగారు. ‘నా మాటే వినరా? నా పనులు చేయరా?’ అంటూ దూషించారు. ‘ఇది సరైన పద్ధతి కాదు’ అని నిలువరించబోయిన ఒక కీలక మంత్రిపైనా ఆ ఎమ్మెల్యే నోరుపారేసుకున్నారు. విజయవాడ నగరంలో కేంద్రీకృతంగా సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ ఎమ్మెల్యే వైఖరితో... సీనియర్‌ అధికారి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గురువారం శాసనసభ వైపు కూడా రాలేదు. కార్యాలయానికీ వెళ్లలేదు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

పేదల ఆక్రమణలో ఉన్న 150 గజాల వరకు ఇంటి స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకుమించితే... నిర్ణీత ధర వసూలు చేయాలని తీర్మానించింది. అందులోనూ... అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను మాత్రమే క్రమబద్ధీకరిస్తామని రెవెన్యూశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కాలువలు, చెరువు గట్లు, కాలువ గట్లు, డిఫెన్స్‌ పరిధిలోకి వచ్చే భూముల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నా క్రమబద్ధీకరించడం కుదరదని స్పష్టంగా చెప్పింది. అయితే, విజయవాడ నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని కాలువలు, గట్లు, ఇంకా రహదారులపై నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని తన పీఏ ద్వారా కొన్ని దరఖాస్తులు పంపించారు. అందులో... ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన స్థలమూ ఉంది.


ఆ ముగ్గురూ... సగటున 300 గజాల చొప్పున మొత్తం 900 గజాల్లో ఒక భారీ భవనం నిర్మించుకున్నారు. దాన్ని కూడా క్రమబద్ధీకరించాలన్నది ఆ ఎమ్మెల్యే ప్రయత్నం. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. పైగా కాలువ గట్టు, రహదారిపై అడ్డగోలుగా నిర్మించిన భవనం రెగ్యులరైజ్‌ చేసే అవకాశమే లేదు. నిబంధనల ప్రకారం ఇరిగేషన్‌ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకొని అక్రమ నిర్మాణాలను కూల్చాల్సి ఉంది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులు ఫైలుపై రాశారు. ఆ ఆక్రమణను క్రమబద్ధీకరించడం కుదరదని చెప్పారు.

వైసీపీ హయాంలోనే కాలేదు..

ఇదే భూమిని రెగ్యులరైజ్‌ చేయించాలని జగన్‌ ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు విశ్వప్రయత్నం చేసినా సాధ్యంకాలేదు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యే ఆ పనిని భుజాన వేసుకున్నారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో... తనకు సంబంధించిన ఓ అధికారికి రెవెన్యూలో పోస్టింగ్‌ ఇప్పించారు. కొద్దిరోజుల్లోనే ఆ అధికారి మరోపోస్టుకు వెళ్లిపోయారు. దీంతో ఆ ఎమ్మెల్యే విచక్షణ మరిచిపోయారు. బుధవారం ఉదయం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిశాక టీ బ్రేక్‌ సమయంలో అధికారుల గ్యాలరీ వద్దకు వెళ్లారు. అక్కడున్న ఇద్దరు సీనియర్‌ రెవెన్యూ అధికారులతో గొడవకు దిగారు. ‘‘నా ఫైళ్లనే ఆపుతారా? నా మనిషినే బదిలీ చేయిస్తారా? నేనంటే ఏమిటో మీకు తెలియదు? పేదలు ఇల్లుకట్టుకోవడం మీకు ఇష్టం లేదా? ఎంత ధైర్యం ఉంటే నా పనులను అడ్డుకుంటారు?’’ అని గట్టిగా కేకలు వేశారు. దీంతో ఆ అధికారులు నిశ్చేష్టులయ్యారు. ఎమ్మెల్యే అలా దాదాపు 5నిమిషాల పాటు నాన్‌స్టా్‌పగా అధికారులపై నోరు పారేసుకొని వారిని బెదరగొట్టారు.


మంత్రిపైనా అదే దూకుడు

ఎమ్మెల్యే రెచ్చిపోతున్న సమయంలో అక్కడే ఉన్న సంబంధిత మంత్రి వెళ్లి ఆయనను వారించారు. నిగ్రహం కోల్పోయిన ఆ ఎమ్మెల్యే సదరు మంత్రిపైనా విరుచుకుపడ్డారు. ‘‘నన్ను అడ్డుకుంటారా? నా పనులు చేయరా? నీకసలు ఫైళ్లు చూడటం వచ్చా? నీవల్ల ప్రభుత్వానికి ఏమైనా మేలు జరుగుతోందా? ఏ పని ఎప్పుడు చేయాలో నీకు తెలుసా? పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్‌లో మీరు ఫెయిల్‌ అయ్యారు. పేదలకు మేలు చేయడం మీకు చేతకాదు’’ అంటూ రెచ్చిపోయారు. మంత్రి కూడా తీవ్రంగా స్పందించారు. ‘‘పేదలకు మేలు చేయడంలో ప్రభుత్వం ముందుంది. డబ్బున్నోళ్లు, బలిసినోళ్లకు, అక్రమార్కులకు మేలు చేయడానికి సిద్ధంగా లేదు. కాలువగట్లు, రోడ్లను ఆక్రమించి రెగ్యులరైజ్‌ చేయమంటే ఎలా సాధ్యం? రూల్స్‌కు వ్యతిరేకంగా ఏ మంత్రి, అధికారి పనిచేయడు. బలిసిన వారి భూములను రెగ్యులరైజ్‌ చేయమంటే చేయం. పేదలకు మేలు చేస్తున్నాం కాబట్టే అసెంబ్లీదాకా వచ్చాం. అధికారులను గౌరవించడం చేతకాకపోతే మాట్లాడొద్దు. అధికారులపై నోరుపారేసుకోవద్దు. పార్టీ, ప్రభుత్వం పరువు తీస్తే హీరోలవ్వరు’’ అంటూ చురకలు అంటించారు. అధికారుల గ్యాలరీ నుంచి బయట లాబీల్లోకి వెళ్లాక ఆ ఎమ్మెల్యే మరింత రెచ్చిపోయే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇతర ఎమ్మెల్యేలు ఆయనను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు.

ఆరాతీసిన సీఎం

ఎమ్మెల్యే రుబాబు గురించి నిఘా విభాగం సీఎం చంద్రబాబుకు బుధవారమే నివేదించినట్లు తెలిసింది. ఆ తర్వాత సీఎం మరో మార్గంలోనూ సమాచారం తెప్పించుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని అమరావతికి వచ్చాక, బుధవారం రాత్రే సంబంధిత మంత్రిని పిలిపించుకొని మాట్లాడారు. త్వరలో ఆ ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడుతానని సీఎం చెప్పినట్లు తెలిసింది.

Updated Date - Mar 21 , 2025 | 03:40 AM