Vijayawada: నేటి నుంచే ఆ పథకం స్టార్ట్.. ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్..
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:38 PM
విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో "డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం" పథకాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ముందుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన మంత్రి లోకేశ్.. తరగతి గదులు, కెమిస్ట్రీ ల్యాబ్ సందర్శించారు. అనంతరం క్లాస్ రూముల్లో విద్యార్థినిలతో కాసేపు ముచ్చటించారు.
అమరావతి: విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో "డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం" పథకాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ముందుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన మంత్రి లోకేశ్.. తరగతి గదులు, కెమిస్ట్రీ ల్యాబ్ పరిశీలించారు. అనంతరం క్లాస్ రూముల్లో విద్యార్థినిలతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం అందించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ కళాశాలల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.
అయితే డొక్కా సీతక్క మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిలతో మంత్రి లోకేశ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. "విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలకమైన దశ. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు ఇప్పటి నుంచే దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. డ్రగ్స్ వాతావరణం మీ పరిసరాల్లో ఎక్కడ కనిపించినా వెంటనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయండి. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తున్నాం. మీరంతా బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలి. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా కృషి చేస్తున్నాం. మీలో ఒక్కడిగా నన్నూ భావించి ఏం చేస్తే బాగుంటుందో సలహాలు సూచనలు ఇవ్వండి. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని" చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేడు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని కోసం ఈ ఏడాదికి రూ. 29.39 కోట్లు విడుదల చేయగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మరో రూ. 85.84 కోట్ల నిధులు కేటాయించారు. విద్యార్థులను చదువు వైపు మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు భోజనం అందించింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ దాన్ని రద్దు చేసింది. అమ్మఒడి ఇస్తున్నామనే వంకతో వారికి భోజనం దూరం చేసింది. అయితే నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో అనేక మంది విద్యార్థులు తమకు మళ్లీ ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హామీ ఇచ్చిన లోకేశ్ అధికారంలోకి రాగానే పథకం అమలుకు జీవో జారీ అయ్యేలా కృషి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP Ministers: తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులపై మంత్రులు ఏమన్నారంటే..
Game Changer Event: గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు.. సిద్ధమైన సభావేదిక..