Share News

కడలికోత!

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:09 AM

నియోజకవర్గంలో దివి గ్రామసమూహమైన ఎదురుమొండి దీవుల్లో సముద్రపు అటుపోట్ల కారణంగా ఏర్పడిన భూమి కోత నివారణ కోసం ఎదురుమొండి-గొల్లమంద నడుమ రహదారి నిర్మిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించి నెలలు గడుస్తున్నా పనులు కాగితాలకే పరిమితమవడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కడలికోత!
గొల్లమంద వద్ద నదిలోకి జారిపోతున్న భూమి

నదీగర్భంలో కలిసిపోతున్న దీవులు

రూ.13.45 కోట్లు మంజూరైనా కాగితాలు దాటని రహదారి పనులు

అలల తాకిడికి తీవ్రమవుతున్న కోత

ప్రమాదకర ప్రాంతంలోనే ఇసుక, బుసక అక్రమ తవ్వకాలు

(అవనిగడ్డ, ఆంధ్రజ్యోతి)

నియోజకవర్గంలో దివి గ్రామసమూహమైన ఎదురుమొండి దీవుల్లో సముద్రపు అటుపోట్ల కారణంగా ఏర్పడిన భూమి కోత నివారణ కోసం ఎదురుమొండి-గొల్లమంద నడుమ రహదారి నిర్మిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించి నెలలు గడుస్తున్నా పనులు కాగితాలకే పరిమితమవడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక, బుసక అక్రమ తవ్వకాలు.. నది గమనదిశలో అనూహ్య మార్పుల కారణంగా గడిచిన ఆరేళ్లుగా ఎదురుమొండి దీవులు సముద్రపు అటుపోట్లు కారణంగా కోతకు గురవుతున్నాయి. దీనికి తోడు ప్రతీఏటా క్రమం తప్పకుండా వస్తున్న భారీ వరదలు కోతను మరింత తీవ్రతరం చేయటంతో ఎదురుమొండి-గొల్లమంద గ్రామాల నడుమ దాదాపు 30మీటర్ల మేర వెడల్పు దాదాపు కిలోమీటరు పొడవున భూమి కోతకు గురైంది. కృష్ణానది బ్యాక్‌ వాటర్‌ పాయ రహదారి సైతం కనుమరుగైంది. కోత కారణంగా రహదారి పూర్తిగా నదిలో కలసిపోయే పరిస్థితి రావటంతో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రూ.1.7 కోట్లతో అంచనాలు రూపొందించారు.. అయితే పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ వ రదల కారణంగా కోత మరింత తీవ్రం కావటంతో జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ, స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్‌తో కలిసి పంటుపై గొల్లమంద ప్రాంతాన్ని పరిశీలించారు. కోత నివారణ చర్యలు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు అక్కడి పరిస్థితిని డ్రోన్‌ ద్వారా వీడియో తీసి ప్రభుత్వానికి పంపడంతో కోత నివారణకు ఎదురుమొండి నుంచి గొల్లమంద వరకు రహదారిని నిర్మించాలని, కోత తీవ్రంగా ఉన్న ప్రాంతంలో సాంకేతికతను వినియోగించి ఆటుపోట్ల ప్రవాహ వేగాన్ని నియంత్రించాలని ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగానే రూ.13.45 కోట్లు మంజూరయ్యాయని జనవరిలో ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్‌ ప్రకటించారు.

ఫ కాగితాలు దాటని పనులు

ఎదురుమొండి-గొల్లమంద మధ్య ఏర్పడిన కోత నివారణ కోసం ఎదురుమొండి-జింకపాలెం గ్రామాల మధ్య ఉన్న పాత రహదారిని అభివృద్ధి పర్చటంతోపాటు దాదాపు కిలోమీటరు మేర నదిలో కలిసిపోయిన ప్రాంతంలో భూ సేకరణ చేసి అక్కడ కొత్త రహదారిని నిర్మించాలని ప్రభుత్వం భావించింది. త్వరలోనే శంకుస్థాపన జరుగుతుందని, కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానిస్తున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు.. కానీ పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. రెండు నెలలపాటు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా టెండర్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడినా.. ఎన్నికలు ముగిసి నెలరోజులు కావొస్తున్నప్పటికీ పనులకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి ముందడుగు పడకపోవటం పట్ల దీవుల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ ఈ మూడు నెలలే కీలకం

ఎదురుమొండి-గొల్లమంద గ్రామాల మధ్య ఏర్పడిన కోత విషయంలో ఏ పనులు నిర్వహించాలన్నా ఈ మూడు నెలలే కీలకమని, ఆ తర్వాత పనులు నిర్వహించాలంటే వర్షాలు, వరదలు పనులకు ఆటంకం కలిగిస్తాయని, ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించాలని ఎదురుమొండి వాసులు కోరుతున్నారు. గడిచిన ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి వెళుతున్నారే గానీ పనులు ప్రారంభం కావటం లేదని, కూటమి ప్రభుత్వంలో రూ.13.45 కోట్లు మంజూరైనా పనులను ఇంకా ఎందుకు ప్రారంభించటం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కోత అటవీ భూముల వరకు చేరుకుందని, అది కొద్ది అడుగులు పెరిగితే ఆ ప్రాంతంలో భూ సేకరణకు కూడా అటవీ నిబంధనల కారణంగా వీల్లేని పరిస్థితి ఏర్పడుతుందని దీవుల వాసులు ఆందోళన చెందుతున్నారు. గడిచిన ఆగస్టు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా మరో ఏడు అడుగుల వెడల్పున కోత పెరిగిందని, నెలరోజుల్లో పనులు ప్రారంభించకుంటే కోత అటవీ భూముల వరకు చేరుకుంటుందని, అదే జరిగితే ఎదురుమొండి-జింకపాలెం గ్రామాల నడుమ రహదారి ఊసే మరిచిపోవాల్సిన పరిస్థితి వస్తుందని గొల్లమంద, జింకపాలెం, బ్రహ్మయ్యగారి మూల ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ ప్రమాదకర ప్రాంతాల్లోనే తవ్వకాలు

ఓ వైపు ఎదురుమొండి దీవుల మనుగడ ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో గొల్లమంద సమీపంలోనే కొందరు అక్రమార్కులు ప్రతినిత్యం ఇసుక, బుసక తవ్వకాలు సాగిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో గొల్లమంద ప్రాంతంలో కోతకు గురైన చోట ఇసుక, బుసకను తవ్వి తీసి అమ్ముకుంటున్నారని, దీని కారణంగా కోత మరింతగా పెరగటంతోపాటు భూమి కరుగుదల వేగం ఎక్కువవుతున్నదని, అధికారులు స్పందించి ఎదురుమొండి దీవుల చుట్టూ నదిలో నుంచి ఇసుక, బుసక వెలికి తీయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 04 , 2025 | 01:09 AM