Share News

ఆటాడేస్తాం..

ABN , Publish Date - Mar 18 , 2025 | 01:14 AM

ప్రజాప్రతినిధుల క్రీడా సంబరాలకు సమయం ఆసన్నమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పోటీలను ప్రారంభిస్తారు. ఇందుకోసం ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియాన్ని సిద్ధం చేశారు.

ఆటాడేస్తాం..
ముస్తాబైన ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం

నేటి నుంచి ప్రజాప్రతినిధుల ఆటల పోటీలు

ముస్తాబైన ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం

నేటి మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్‌తో ప్రారంభం

పోటీల నిర్వహణకు 200 మంది నియామకం

పలు విభాగాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్ల నమోదు

140 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎమ్మెల్సీల రిజిసే్ట్రషన్‌

చివరి రోజు మ్యాచ్‌లో సీఎం పాల్గొనే అవకాశం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ప్రజాప్రతినిధుల క్రీడా సంబరాలకు సమయం ఆసన్నమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పోటీలను ప్రారంభిస్తారు. ఇందుకోసం ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియాన్ని సిద్ధం చేశారు. అథ్లెటిక్స్‌, క్రికెట్‌, టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌, టెన్నికాయిట్‌, వాలీబాల్‌, త్రోబాల్‌, కబడ్డీ క్రీడలు ఇక్కడే జరుగుతాయి. షటిల్‌ బ్యాడ్మింటన్‌ను డీఆర్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తారు. ఈ క్రీడల నిర్వహణకు రిఫరీలు, అంపైర్లు, సహాయకులుగా మొత్తం 200 మంది శాప్‌ సిబ్బందిని నియమించారు. మంగళవారం నుంచి గురువారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. గురువారం ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు.

క్రీడలు ఇవీ..

అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలుగా ఉండగా, పోటీల్లో పాల్గొనడానికి 140 మంది పేర్లను రిజిసే్ట్రషన్‌ చేయించుకున్నారు. మండలిలో మొత్తం 58 మంది ఎమ్మెల్సీలు ఉండగా, 13 మంది మాత్రమే పేర్లను రిజిసే్ట్రషన్‌ చేయించుకున్నారు. శాప్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి. ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. రోజూ అసెంబ్లీ, మండలి సమావేశాలు ముగిశాక స్టేడియంలో పోటీలు ప్రారంభమవుతాయి. స్టేడియంలో ఏర్పాట్లను కమిటీ సభ్యులు విజయ్‌కుమార్‌, గన్నబాబు, ఆదిరెడ్డి శ్రీనివాస్‌, బొజ్జల సుధీర్‌రెడ్డి, పంచుమర్తి అనురాధ శాప్‌ చైర్మన్‌ రవినాయుడు సోమవారం సాయంత్రం పరిశీలించారు. మొత్తం 13 కీడ్రల్లో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. క్రికెట్‌, పరుగు పందెం, షాట్‌పుట్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, కబడ్డీ, టేబుల్‌ టెన్నిస్‌, టెన్నికాయిట్‌, టెన్నిస్‌, వాలీబాల్‌, త్రోబాల్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, క్యారమ్స్‌, మ్యూజికల్‌ చైర్స్‌ ఆటలో పోటీలు ఉంటాయి. మ్యూజికల్‌ చైర్స్‌లో కేవలం మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. టగ్‌ ఆఫ్‌ వార్‌ను రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. పురుషులకు, మహిళా ఎమ్మెల్యేలకు వేర్వేరుగా పోటీలు జరుగుతాయి.

విసిరేస్తాం..

13 క్రీడల్లో జరిగే పోటీల్లో పాల్గొనడానికి ప్రజాప్రతినిధులు సోమవారం రాత్రి వరకు పేర్లను నమోదు చేసుకుంటూనే ఉన్నారు. మహిళా మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి షాట్‌పుట్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. పురుషుల షాట్‌పుట్‌లో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేరును నమోదు చేసుకున్నారు.

పరుగులు తీస్తాం..

మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేరును నమోదు చేసుకున్నారు. పురుషుల 100 మీటర్ల పరుగులో పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, ఆదోని ఎమ్మెల్యే పీవీ పార్థసారథి, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాలరెడ్డి, తూమాటి మాధవరావు, వంకా రవీంద్రనాథ్‌ పేర్లను నమోదు చేసుకున్నారు.

‘గురి’ తప్పదు..

క్యారమ్స్‌ పోటీల్లో పాల్గొనడానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేరు నమోదు చేయించుకున్నారు. అలాగే, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కాయిన్స్‌ను గురి తప్పనివ్వబోమంటున్నారు. పురుషుల విభాగంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేరు రాయించుకున్నారు.

క్రికెట్‌లో కీలకమైన టీమ్‌లు

క్రికెట్‌ ఆడటానికి మొత్తం 40 మంది పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిని నాలుగు జట్లుగా విభజించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు జట్లను ఖరారు చేశారు. సీఎం 11 వెర్సస్‌ స్పీకర్‌ 11 జట్లుగా వీటికి నామకరణం చేశారు. చివరిరోజు జరిగే మ్యాచ్‌లో సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని శాప్‌ వర్గాలు తెలిపాయి. మంత్రులు కింజరపు అచ్చన్నాయుడు, నారా లోకేశ్‌, వాసంశెట్టి సుభాష్‌, ఎమ్మెల్యేలు కొలికలపూడి శ్రీనివాస్‌, యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్‌, వర్ల కుమార్‌రాజా తదితరులు పేర్లు నమోదు చేసుకున్నారు.

నేడు ఫొటోషూట్‌

ప్రజాప్రతినిధులతో సీఎం ఫొటోషూట్‌ ఉంటుందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో మాత్రమే ఉండే సంప్రదాయాన్ని ఇక నుంచి అసెంబ్లీలో అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఫొటో షూట్‌ ప్రతి ఏడాది ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీలో ఫొటో దిగుతారని తెలిపారు.

Updated Date - Mar 18 , 2025 | 01:14 AM