జామ్‌జామ్‌గా జంబో..!
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:45 AM
భారీ విమాన రాకపోకలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీ విమానాల సంఖ్య పెరగడంతో అందుకు తగ్గట్టుగానే ఆక్యుపెన్సీ నిష్పత్తి కూడా వృద్ధి చెందింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విస్తరించిన రన్‌వే కారణంగా ప్రస్తుతం భారీ విమానాల రాకపోకలకు మార్గం ఏర్పడింది.

విజయవాడ విమానాశ్రయం నుంచి భారీ విమానాల రాకపోకలు
ఎనిమిది నెలల్లో ఎనిమిది భారీ విమానాలు
రోజూ ఎయిర్‌బస్ 5, బోయింగ్ 3.. పెరిగిన ఆక్యుపెన్సీ
ఢిల్లీ, ముంబయి ప్రయాణికులకు ఉపయుక్తంగా..
బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్‌కు బోయింగ్
విమానాలకు అనుకూలంగా మారిన కొత్త రన్‌వే
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారీ విమానాలు ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఎయిర్‌బస్, బోయింగ్ విమానాలు పోటీలు పడుతూ తిరుగుతున్నాయి. గతంలో ఒకటి, రెండు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఎనిమిది భారీ విమానాలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 37 నుంచి 50కు విమానాల సంఖ్య పెరిగింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు విమాన సర్వీసులు గణనీయంగా పెరిగాయి. ఈ కారణంగా భారీ విమానాల సంఖ్య కూడా పెరిగింది. 750 ఎకరాలను ఏఏఐకు ఇవ్వటంతో అదనంగా రన్‌వేను విస్తరించటానికి అవకాశం ఏర్పడింది. భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత ఏఏఐ అధికారులు మరో 1,075 మీటర్ల మేర రన్‌వేను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2018 మధ్యకాలంలో నూతన రన్‌వే పనులు శరవేగంగా జరిగాయి. ఫలితంగా మొత్తంగా 3,360 మీటర్ల రన్‌వే ఏర్పడింది. అంటే 11,023.62 చదరపు గజాల మేర విస్తరణ జరిగింది. రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే కలిగిన విమానాశ్రయంగా విజయవాడ నిలిచింది. ఈ క్రమంలో బోయింగ్-747, బోయింగ్-777, బోయింగ్-787 విమానాలు కూడా ల్యాండ్ కావటానికి వీలు కలిగింది.
రోజూ 8 భారీ విమానాల రాకపోకలు
విమానాశ్రయంలో ఒకేసారి 15 విమానాలను పార్కింగ్ చేసేలా పార్కింగ్ బేలను సిద్ధం చేశారు. ప్రస్తుతం శాశ్వత అవసరాల ప్రాతిపదికన దేశీయ, అంతర్జాతీయ నూతన టెర్మినల్ బిల్డింగ్ (ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్)ను నిర్మిస్తున్న సంగతి తెలిసింది. దీని పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ టెర్మినల్‌కు అనుసంధానంగా ఆఫ్రాన్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ ఆఫ్రాన్‌లో ఒకేసారి ఆరు భారీ విమానాలను నిలిపే అవకాశం ఉంది. దీనిని ఇంకా వినియోగంలోకి తీసుకురాలేదు. భారీ విమానాల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా ఈ నూతన ఆఫ్రాన్‌ను సిద్ధం చేస్తున్నారు.
రన్‌వేను విస్తరించడం వల్లే..
విజయవాడ విమానాశ్రయం భారీ విమానాలు ల్యాండింగ్ కావటానికి వీలుగా రన్‌వే పటిష్టతతో పాటు విస్తరణ పనులు కూడా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. 2017లో అప్పటికి ఉన్న 1,685 మీటర్ల రన్‌వేను భారీ విమానాలు దిగేందుకు వీలుగా అభివృద్ధిపరచటంతో పాటు అదనంగా 600 మీటర్ల మేర రన్‌వేను విస్తరించారు. ఫలితంగా మొత్తం 2,285 మీటర్ల పొడవున రన్‌వే విస్తరించింది. దీనివల్ల ఎయిర్‌బస్-321 అనే పెద్ద విమానాలు ల్యాండింగ్ అయ్యే స్థాయికి విమానాశ్రయం చేరుకుంది. ఆ తర్వాత భూ సేకరణ జరిపి
భారీ విమానాలు ఇవే..
విజయవాడ విమానాశ్రయం నుంచి రోజూ 8 భారీ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ఐదు ఎయిర్‌బస్, మూడు బోయింగ్ విమానాలు ఉన్నాయి. ఎయిర్‌బస్‌లలో ఏ321, ఏ330, ఏ380 రకాలు ఉంటాయి. ఇవన్నీ విమానాశ్రయంలో ల్యాండ్ కావటానికి అవకాశం ఉంది. ఎయిర్‌బస్ ఏ321లో 150 నుంచి 180 మంది ప్రయాణించవచ్చు. ఏ330లో 250 నుంచి 300 వరకు ప్రయాణించవచ్చు. ఎయిర్‌బస్ ఏ380లో 500 నుంచి 850 మంది ప్రయాణించవచ్చు. వీటిలో ఎయిర్‌బస్ ఏ321 విమానాలు ప్రస్తుతం మన దగ్గర రాకపోకలు సాగిస్తున్నాయి. ఎయిరిండియా సంస్థ ఢిల్లీకి మూడు విమానాలు నడుపు తోంది. ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో ముంబయికి రెండు నడుస్తున్నాయి. ఎయిర్‌బస్‌లతో పోల్చుకుంటే పరిమాణం రీత్యా బోయింగ్ విమానాలు పెద్దగా ఉంటాయి. ఈ విమానాల్లో బి737, బీ777, బీ787 విమానాలు ఉంటాయి. బోయింగ్ 737లో 130 నుంచి 220 మంది ప్రయాణించవచ్చు. బోయింగ్ 777లో 300 నుంచి 400 మంది ప్రయాణించవచ్చు. బోయింగ్ 787లో 240 నుంచి 330 మంది ప్రయాణించవచ్చు. ఈ బోయింగ్ శ్రేణి విమానాలన్నీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేలా రన్‌వేను సిద్ధం చేశారు. ప్రస్తుతం మన దగ్గర బోయింగ్ 737 విమానాలు నడుస్తున్నాయి. ఈ విమానాలు బెంగళూరుకు 1, హైదరాబాద్‌కు 1, విశాఖపట్నానికి 1 చొప్పున నడుస్తున్నాయి. వీటిని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ నడుపుతోంది.