పట్టణ సమగ్రాభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:49 AM
పట్టణ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా అందరం కలిసి పనిచేద్డామని కౌన్సిలర్లను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య కోరారు.

అందుకోసం అందరం కలిసి పనిచేద్దాం
కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లతో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పట్టణ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా అందరం కలిసి పనిచేద్డామని కౌన్సిలర్లను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య కోరారు. సోమవారం జగ్గయ్యపేట కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం నుంచి నిధుల సాధనలో ముందున్నామని తెలిపారు. రాష్ట్రంలో శానిటేషన్‌లో మోడల్‌టౌన్‌గా పట్టణాన్ని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ప్రకటించిందన్నారు. డ్రెయిన్లు, రోడ్లు, వీధిదీపాలు, తాగునీటి సమస్యలన్నింటినీ ప్రణాళికబద్ధంగా, ప్రాధాన్య క్రమంలో పూర్తి చేద్దామని హామీ ఇచ్చారు. కౌన్సిల్ చరిత్రలో ప్రప్రథమంగా ఒకే అజెండాలో రూ.11 కోట్ల విలువైన గ్రాంట్లను ఆమోదం కోసం ఉంచామని చైర్మన్ రాఘవేంద్ర అన్నారు. నిధులు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య కృషితో వచ్చాయన్నారు.
అనధికార లే అవుట్లపై చర్యలకు వైసీపీ డిమాండ్
అనధికార లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కౌన్సిలర్ వట్టెం మనోహర్, వైస్ చైర్మన్ హఫీజున్నీసా, కో ఆప్షన్ సభ్యురాలు బషీరున్నీసాలు చైర్మన్ పోడియం ఎదుట బైఠాయించారు. గత ఐదేళ్లలో ఎందుకు ప్రశ్నించలేదని, ఇప్పుడు ఎందుకు ఆందోళనకు దిగారని చైర్మన్ రాఘవేంద్ర నిలదీశారు. పోడియం ముందు బైఠాయించిన వట్టెంను సస్పెండ్ చేయాలని టీడీపీ కౌన్సిలర్లు పేరం సైదేశ్వరరావు, కన్నెబోయిన రామలక్ష్మీ, నకిరికంటి వెంకట్ తదితరులు డిమాండ్ చేశారు. అనధికార లే అవుట్లకు, లే అవుట్ ప్లాట్లకు తేడా లేదని, పురపాలకసంఘాలు లే అవుట్ వెంచర్లలో సౌకర్యాలు కల్పించటం లేదని జనసేన కౌన్సిలర్ కొలగాని రాము అన్నారు. ఎమ్మెల్యే తాతయ్య జోక్యం చేసుకుని అనధికార లే అవుట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని పురపాలక సంఘాలు సూచించినా రిజిస్రేషన్ శాఖ అంగీకరించటం లేదని, ప్రభుత్వం నుంచి జీవోకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు ఆందోళన విరమించారు. 2024-2025 సంవత్సరం రూ.2,59,94,249 లోటుతో సవరించిన బడ్జెట్‌కు మునిసిపల్ కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది.
భారీ అంచనాతో 2025-26 బడ్జెట్
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గత ఏడాది బడ్జెట్‌కు రెట్టింపు మొత్తంతో అంచనాలు వేసినట్టు చైర్మన్ రాఘవేంద్ర తెలిపారు. ఆస్తిపన్నులు, షాపిం గ్ కాంప్లెక్స్‌ల అద్దెలు, ప్రణాళిక విభాగంలో వృద్ధితో పాటు, 15వ ఆర్ధికసం ఘం గ్రాంటు రూ.3 కోట్లు, ఇతర గ్రాంట్లు రూ.13కోట్లు వస్తాయని మొ త్తం రూ.32,26,92,800 ఆదాయం సమకూరుతుందని, రూ.22.67 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు చైర్మన్ తెలిపారు. వచ్చే ఏడాదికి రూ.10 కోట్లు మిగులు రాగలదని, ఆ నిధులతో జగ్గయ్యపేటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దొచ్చని అన్నారు.