మెరక పేరిట మేసేస్తున్నారు
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:40 AM
మచిలీపట్నం నియోజకవర్గంలో డ్రెయిన్లపై ఉన్న ఆక్రమణలను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్న మునిసిపల్ అధికారులు.. డ్రెయినేజీ భూముల ఆక్రమణల విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల నుంచి మట్టి, బుసకను తవ్వి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నా, రాత్రి 10 గంటల సమయంలో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా బుసకను తరలిస్తున్నా, తెల్లారేసరికి ఎక్కడి వాహనాలను అక్కడ దాచేస్తున్నా చోద్యం చూస్తున్నారు. ప్రతిపక్ష నాయకులతో కుమ్మక్కైన కొందరు అక్రమార్కులు ఈ దందాను యథేచ్ఛగా నడిపిస్తున్నా పట్టించుకునేవారు లేరు.

మచిలీపట్నంలో యథేచ్ఛగా భూ ఆక్రమణలు
ప్రభుత్వ భూముల్లోని బుసక అక్రమ తవ్వకాలు
అధికారులు అడ్డుకుంటున్నా బెదిరింపు ధోరణి
ఎవరికీ అనుమానం రాకుండా రాత్రివేళ తవ్వకాలు
తెల్లారేసరికి అంతా గప్‌చుప్
స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా స్పందన శూన్యం
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం సౌత మండలం రుద్రవరం పంచాయతీలో మచిలీపట్నం-చిన్నాపురం రహదారి పక్కనే బొంబాయి కాల్వ పేరుతో డ్రెయినేజీ భూమి ఉంది. ఈ భూమిని కొందరు అక్రమార్కులు కొనుగోలు చేసినట్లుగా పత్రాలు సృష్టించారు. గతనెల చివర్లో ఈ ప్రభుత్వ భూమిలో బుసకతో మెరక పనులు ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు పరిశీలించి పనులను అడ్డుకున్నారు. డ్రెయినేజీ విభాగం అధికారులతో మాట్లాడి ఆ భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకున్నారు. అక్రమార్కులు కొంతకాలం పనులు నిలిపివేశారు. అలాగే, చిన్నాపురం మత్స్య సహకార సంఘం ఆధీనంలో చిన్నాపురం శివారులోని పాటిమీద గ్రామం సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల నుంచి మట్టి తోలకాన్ని ప్రారంభించారు. చిన్నాపురం శ్మశానవాటిక మెరక పనులకు ఈ మట్టిని వినియోగిస్తామని చెప్పారు. కానీ, అలాకాకుండా ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న రుద్రవరంలోని డ్రెయినేజీ పోరంబోకు భూమిని మెరక చేస్తున్నారు.
మైనింగ్ అధికారులు దాడులు చేసినా..
నార్త్ మండల పరిధిలోని మంగినపూడి, తపసిపూడి, కరగ్రహారం, మేకావానిపాలెం, గోపువానిపాలెం గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, సముద్రతీరం వెంబడి ఉన్న బే ఆఫ్ బెంగాల్ భూముల నుంచి బుసకను ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండటంతో ముడా అధికారులు పరిశీలనార్థం వెళ్లారు. అక్రమార్కులు వారిపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ముడా అధికారులు వెనుదిరిగారు. బుసక రవాణా అధికం కావడంతో ఇటీవల మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే అక్రమార్కులు తమకు మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు ఉందని బెదిరింపులకు దిగారు. వారితోనే తమకు చెప్పించాలని మైనింగ్ అధికారులు పట్టుబట్టడంతో బుసక రవాణా చేసేవారు మిన్నకుండిపోయారు. రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో చినకరగ్రహారంలో బుసక తవ్వకాలను అడ్డుకునేందుకు ఒక రెవెన్యూ డివిజన్ అధికారి వస్తున్నారనే సమాచారంతో అక్రమార్కులు వాహనాలను దాచేసి మిన్నకుండిపోయారు. రెండు రోజుల తరువాత మళ్లీ టిప్పర్లను పక్కనపెట్టి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా బుసకను తరలించే పనులు ప్రారంభించారు. ఆదివారం తెల్లవారుజాము వరకు కరగ్రహారం నుంచి బుసక రవాణా చేశారని గ్రామస్తులు చెబుతున్నారు.
నార్త్ మండలంలో..
మచిలీపట్నం నార్త్ మండల పరిధిలోని ముడా, ప్రభుత్వ భూముల్లోని బుసకను రాత్రి 10 గంటల నుంచి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. మంగినపూడి బీచ్ రహదారి వెంబడి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని 13 ఎకరాల భూములను ఇటీవల కొందరు కొని రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. ఈ భూములను మెరక చేసేందుకు ప్రభుత్వ, ముడా భూముల నుంచి బుసకను ఎలాంటి అనుమతులు లేకుండా కొన్నిరోజులుగా రాత్రి సమయంలో తరలిస్తున్నారు. ఈ అంశంపై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
వివాదాస్పద భూమిలో మెరక పనులు
30వ డివిజన్ పరిధిలో శివగంగ గుడి వెనుక ఉన్న పది ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్లో గతంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. ఈ వెంచర్‌లో ఎలాంటి విక్రయాలు, మెరక పనులు చేయకూడదని 2019కు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ బోర్డును తొలగించారు. ప్రస్తుత ం ఈ భూములను మెరక చేసే పనులు కొద్దిరోజులుగా చేస్తున్నారు. మచిలీపట్నం నగరంలో జిల్లా పరిషత సెంటరు నుంచి శారదానగర్ వరకు రహదారుల వెంబడి, డ్రెయిన్లపై ఉన్న ఆక్రమణలు తొలగించే పనిలో సఫలీకృతులైన అధికారులు, మండలంలో డ్రెయినేజీ భూములను ఆక్రమిస్తున్న, బుసకను అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఏ కారణంతో కళ్లెం వేయలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.