Share News

రెండు ప్రభుత్వాలదీ ఒకే నిర్లక్ష్యం

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:52 PM

రెండున్నరేళ్ల వెనక..కర్ణాటకాంధ్ర సరిహద్దులో ప్రవహించే హగరి నదికి వరద వచ్చింది. మోకా సమీపంలో నదిపై నిర్మించిన తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) అక్విడక్ట్‌ పిల్లరు కొట్టుకుపోయింది.

రెండు ప్రభుత్వాలదీ ఒకే నిర్లక్ష్యం

2022లోవరదకు కొట్టుకుపోయిన ఎల్లెల్సీ అక్విడక్ట్‌ పిల్లర్‌

తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టిన గత వైసీపీ ప్రభుత్వం

ఆ తర్వాత వచ్చిన కూటమి పాలనలోనూ అదే నిర్లక్ష్యం

మళ్లీ వరదొస్తే అడ్డు పెట్టిన చెక్కలు కొట్టుకుపోయే ప్రమాదం

పశ్చిమ పల్లెల్లో 1.51 లక్షల ఎకరాల సాగు, 194 గ్రామాలకు తాగు నీటిపై ప్రభావం

రెండున్నరేళ్ల వెనక..కర్ణాటకాంధ్ర సరిహద్దులో ప్రవహించే హగరి నదికి వరద వచ్చింది. మోకా సమీపంలో నదిపై నిర్మించిన తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) అక్విడక్ట్‌ పిల్లరు కొట్టుకుపోయింది. కర్నూలు పశ్చిమ పల్లెలకు నీటి సరఫరా ఆగిపోయింది. అప్పటి వైసీపీ పాలకులు అక్విడక్ట్‌ స్లాబ్‌ కూలిపోకుండా ఇనుప గడ్డర్లు ఏర్పాటు చేసి తాత్కాలిక మరమ్మతులతో సరిపుచ్చారు. శాశ్వత మరమ్మతులను పట్టించుకోలేదు. ఆ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఆ వైపు ఆలోచించలేదు. ఈ వేసవిలోనైనా కొట్టుకుపోయిన పిల్లరును పునర్నిర్మించడానికి కనీసం ప్రతిపాదనలు కూడా తయారు చేయలేదు. మళ్లీ వరదొస్తే అడ్డంగా పెట్టిన చెక్కలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. 1.43 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకమవుతుంది. ఈ స్థితిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

కర్నూలు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా పశ్చిమ ప్రాంతం పల్లెలకు తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) ఒక్కటే ఆధారం.. జిల్లాల విభజన తరువాత కర్నూలు జిల్లాలో మిగిలిన ఏకైక అతి పెద్ద సాగునీటి వనరు ఇదే. ఎల్లెల్సీ కాలువ 1953-57 మధ్యలో నిర్మించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా మోకా సమీపంలో కాలువ 121 కి.మీల వద్ద హగరి నదిపై 700 మీటర్లు పొడవు, 56 పిల్లర్లతో అక్విడక్ట్‌ నిర్మించారు. ఒక్కో పిల్లరు మధ్య 30 అడుగులు దూరం (గ్యాప్‌) ఉంది. పిల్లరు మధ్య భాగంలో కాలువ, రోడ్డు స్లాబులు జాయింట్‌ (అనుసంధానం) చేశారు. 72 ఏళ్ల క్రితం నిర్మించిన అక్విడక్ట్‌ పిల్లర్లు మరమ్మతులకు వచ్చాయి. 2022 అక్టోబరు 9, 10వ తేదీల్లో కర్ణాటక రాష్ట్రం, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు హగరి నదికి వరద పోటెత్తింది. వరద ఉధృతికి ఎల్లెల్సీ అక్విడక్ట్‌ 9వ పిల్లరు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. స్లాబులు కూలిపోయే ప్రమాదం ఉండడంతో తుంగభద్ర డ్యాం నుంచి నీటి సరఫరా నిలిపివేశారు. జిల్లాలో సాగు, తాగునీరు ప్రశ్నార్థకంగా మారడంతో.. అప్పటి అధికార వైసీపీ ముఖ్య నాయకులు, నాటి వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం (ప్రస్తుతం గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే), వైసీపీ ఎమ్మెల్యేలు వై. సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్న కేశవరెడ్డి హడావుడి చేశారు. తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి.. ఆ వెంటనే శాశ్వత మరమ్మతులు చేపడుతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రతిపాదనలు కూడా తయారు చేయలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి నాయకులైనా అక్విడక్ట్‌ పునఃనిర్మాణం గురించి పట్టించుకోలేదు. ఎల్లెల్సీ సీసీ లైనింగ్‌ పనుల్లో వాటాలపై పెట్టిన శ్రద్ధ రైతుల జలప్రయోనాలపై లేదనే ఆరోపణులు వినిపిస్తున్నాయి.

మళ్లీ వరదొస్తే..!

జల్లాలో ఆలూరు, ఆదోని, మంత్రాయలం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో ఖరీఫ్‌లో 43,519 ఎకరాలు, రబీలో 1,07,615 ఎకరాలు కలిపి 1,51,134 ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. తుంగభద్ర డ్యాం నుంచి 24 టీఎంసీల నీటివాటా ఉంది. ఆంధ్ర సరిహద్దు ఆదోని మండలం ఆనవాళ్ల సమీపంలో 251 కి.మీల వద్ద 650-700 క్యూసెక్కుల నీరు ఇవ్వాలి. ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్‌ పట్టణాలతో పాటు పది మండలాల్లో 194 గ్రామాలకు తాగు, ఆయకట్టుకు సాగునీరు అందించే టీబీపీ ఎల్లెల్సీకి ప్రమాదం పొంచి ఉంది. జూన్‌ నుంచి హగరికి వరదలు మొదలవుతాయి. భారీ వరదరాకముందే అక్విడక్ట్‌ పిల్లర్‌ను జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పునఃనిర్మించాలని రైతులు కోరుతున్నారు.

హగరి నదిపై ఎల్లెల్సీ అక్విడక్ట్‌ నిర్మించి 72 ఏళ్లు దాటింది. మరమ్మతులు చేస్తే ప్రజాధనం వృథా అవుతుంది. పాత అక్విడక్ట్‌ పక్కనే హగరిపై 700 మీటర్లు పొడవు నూతన అక్విడక్ట్‌ నిర్మిస్తే మరో 50-60 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని టీబీపీ బోర్డు ఇంజనీర్లు అంటున్నారు. దీనికి దామాషా ప్రకారం నిధులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ప్రభుత్వాలు ఆమోదం తెలపాలి. రెండున్నరేళ్లు గడిచినా సర్వే కూడా టీబీపీ బోర్డు చేయలేదని తెలుస్తున్నది.

నూతన అక్విడక్ట్‌ నిర్మాణమే ఉత్తమం

హగరి నదిపై టీబీపీ ఎల్లెల్సీ అక్విడక్ట్‌ నిర్మించి 72 ఏళ్లు కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. దాని పక్కనే కొత్తగా మరో అక్విడక్ట్‌ నిర్మిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ దిశగా సర్వే, డీపీఆర్‌ తయారు చేయించాల్సి ఉంది. తుంగభద్ర డ్యాం నుంచి ఎల్లెల్సీ వాటా 24 టీఎంసీలు ఉంది.. ఎల్లెల్సీ పరిధిలో కర్నూలు జిల్లాలో 1.51 లక్షల ఆయకట్టు, 194 గ్రామాలకు తాగునీరు అందుతోంది.

- నారాయణ నాయక్‌, ఇన్‌చార్జి ఎస్‌ఈ, తుంగభద్ర బోర్డు, హోస్పెట

Updated Date - Mar 24 , 2025 | 11:52 PM