సమర్పిస్తేనే సంతకం
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:30 AM
తుగ్గలి తహసీల్దార్ కార్యాలయ పరిధిలో పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు కావాలంటే రూ.వెయ్యి ఇవ్వాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకం కింద ఇల్లు నిర్మించుకోవాలంటే ఈ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

రూ.వెయ్యి ఇస్తేనే పొజిషన్ సర్టిఫికెట్
తుగ్గలి మండలంలో రెవెన్యూ అధికారుల దందా
తుగ్గలి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): మండలంలో మొత్తం 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. దాదాపు 50 వేలకు పైగా జనాభా ఉంది. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇల్లు నిర్మిచుకోవాలంటే పొజిషన్ సర్టిఫికెట్ ఉండాలి. ఇది ఉంటేనే ప్రభుత్వ పథకం వర్తిసుంది. దీంతో లబ్ధిదారులు పొజిషన్ సర్టిఫికెట్ కోసం గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. కాని మంజూరు చేయాలంటే రెవెన్యూ అధికారులకు ముట్టజెప్పాల్సిందేనని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ. వెయ్యి ఇస్తేనే..
పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేయాలంటే వీర్వోలు రూ.వెయ్యి డిమాండ్ చేస్తున్నట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. సచివాలయంలో దరఖాస్తు చేసి తహసీల్దార్ కార్యాలయంలో అప్రూవల్ చేయాలంటే వీఆర్వోల చేతులు తడపాల్సి వస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగమంతా ఉన్నతాధికారుల సమక్షంలో సాగుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. లంచం ఇవ్వకుంటే సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తున్నారని, డబ్బు ముట్టజెప్పితే వెంటనే వస్తోందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి ఈ దందాను ఆపాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఒక్క రూపాయి కూడా తీసుకోరాదు
వీఆర్వోలు పొజిషిన్ సర్టిఫికెట్ల మంజూరుకు ఒక్క రూపాయి కూడా అడగకూడదని ఆదేశాలిచ్చాం. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే నా దృష్టికి తీసుకురావాలి. - రమాదేవి, తహసీల్దార్