టిడ్కో గృహాల్లో సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:57 PM
టిడ్కో గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు నగర శివారులో నిర్మించిన టిడ్కో గృహాలను బుధవారం పరిశీలించి అక్కడ నివాసం ఉంటున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
కర్నూలు న్యూసిటీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): టిడ్కో గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు నగర శివారులో నిర్మించిన టిడ్కో గృహాలను బుధవారం పరిశీలించి అక్కడ నివాసం ఉంటున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2017లో టీడీపీ హయాంలో రూ.575 కోట్లతో కర్నూలు నగరంలో సుమారు 10,400 గృహాలు నిర్మించారని, 90 శాతం పనులు పూర్తి అయ్యాయని అన్నారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. గృహాలకు నీటి వసతి, డ్రైనేజీ, రవాణా సౌకర్యం లేదని, అయితే ఇంటి అద్దె చెల్లించలేని సుమారు 130 మంది పేద కుటుంబాలు వారికి కేటాయించిన గృహాల్లో నివాసం ఉంటున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేసిందని, మరో రూ.100 కోట్లు ఖర్చు చేస్తే గృహాలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించవచ్చన్నారు. అనంతరం టిడ్కో అధికారి రవికుమార్ గుప్తాతో మాట్లాడి గృహాలలో కనీస సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య, సహాయ కార్యదర్శి ఎస్. మునెప్ప, సీనియర్ నాయకులు కె. జగన్నాథం, నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శులు సి.మహేష్, శ్రీనివాసరావు, బీసన్న, శరత్ పాల్గొన్నారు.