మూల పెద్దమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:35 AM
మండల కేంద్రంలో మూల పెద్దమ్మ బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

గడివేముల, మార్చి 31(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మూల పెద్దమ్మ బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ఆలయ అర్చకులు కుంకుమార్చన, ఆకు పూజలు నిర్వహించారు. భక్తులు పుట్ట మన్నుకు వెళ్లి అమ్మవారికి ఘటానికి వెళ్లారు. సాయంకాలం వాల్మీకులు తమ ఇంటి నుంచి మంగళవాయిద్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారికి బియ్యం బేడలు, సారెలు సమర్పించి పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గడివేములలో సందడి వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అంగళ్లు, రంగుల రాట్నాల వద్ద సందడి చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాణ్యం సీఐ కిరణ్ కుమార్‌రెడ్డి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో రామలింగారెడ్డి, ఫెస్టివల్ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.