Share News

ట్యాంకు శిథిలావస్థ.. అధికారుల నిద్రావస్థ

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:36 PM

మండలం లోని కడ్లమాగి క్యాంపు వద్ద నిర్మించిన ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ (సమగ్ర రక్షిత మంచి నీటి పథకం) శిథిలా వస్థకు చేరుతోంది.

ట్యాంకు శిథిలావస్థ.. అధికారుల నిద్రావస్థ
ట్యాంకు గట్లపై పిచ్చిమొక్కలు.. పగిలిన రాతి బండలు

గట్టుపై పిచ్చి మొక్కలు, పగిలిపోతున్న రక్షణ బండలు

గతంలోనే ట్యాంకుకు ఓ సారి గండి

హొళగుంద ఎస్‌ఎస్‌ ట్యాంకు దుస్థితి

హోళగుంద, మార్చి 27(ఆంధ్రజ్యోతి): మండలం లోని కడ్లమాగి క్యాంపు వద్ద నిర్మించిన ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ (సమగ్ర రక్షిత మంచి నీటి పథకం) శిథిలా వస్థకు చేరుతోంది. ఈ ట్యాంక్‌ నుంచి వందవాగిలి, గజ్జెహళ్లి, నాగరకన్వీ, హన్నూరు, హాన్పూరు కొట్టాల, ముద్దటమాగి, మార్లమాడికి గ్రామాలతో పాటు హొళగుందకు నీటి సరఫరా చేసున్నారు.

నీటిని తగ్గించిన అధికారులు

ఎస్‌ఎస్‌ ట్యాకుకు గత ఏడాది చిన్న గండి పడింది. దీంతో అధికారులు తూతూ మంత్రంగా మరమ్మతులు

చేయించి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిల్వ పెంచితే ట్యాంకు దెబ్బతినే ప్రమాదముందనే ఇలా చేసినట్లు సమాచారం. అయితే నీటి నిల్వ తగ్గింపుతో తాగునీటి కష్టాలు తప్పేలా లేవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిర్వహణ మరిచారు

ట్యాంకును పట్టించుకునేవారు లేకపోవడంతో గట్టుపై పిచ్చి మొక్కలు పెరిగాయి. రక్షణగా ఉన్న బండలు కూడా పగిలిపోవడంతో గండి పడే ప్రమాదం ఉంది.

పనిచేయని ఫిల్టర్‌ బెడ్లు

ఎస్‌ఎస్‌ ట్యాంకులో ఫిల్టర్‌ బెడ్లు పని చేయకపోవడంతో తాగునీరు దుర్వాసన వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని తాగి తాము రోగాలబారిన పడుతున్నామని జిల్లా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

నీరు పెంచే గట్టు తెగే ప్రమాదం

గతేడాది స్లిపేజ్‌ అవ్వడంతో గట్టు బలహీనంగా ఉంది. అందుకే నీటి నిల్వలు 80శాతం వరకే ఉంచాం. పూర్తిగా నింపితే గట్టు తెగే ప్రమాదం ఉంది. ఏప్రిల్‌ 15 వరకు నీటి నిల్వలు తగ్గకుండా చూసుకుంటాం. ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ మరమ్మతులకు త్వరలో టెండర్లు పిలుస్తాం. - మల్లికార్జునయ్య, ఏఈ, ఆర్‌డబ్య్లూఎస్‌

Updated Date - Mar 27 , 2025 | 11:36 PM