Share News

రామయ్యా.. దిగిపోవయ్యా..!

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:27 AM

ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు అధికార కూటమి నాయకుల టచ్‌లో ఉన్నారు. వారు టీడీపీలో చేరితే సంఖ్యాబలం దృష్ట్యా మేయర్‌ పీఠం కూటమి సొంతం అవుతుంది.

రామయ్యా.. దిగిపోవయ్యా..!

కర్నూలు మేయర్‌ పీఠం కోసం కూటమి వ్యూహం

బీవై రామయ్య మీద అవినీతి అస్త్రాలు సంధిస్తున్న టీడీపీ

ఎంపీ, ఎమ్మెల్యేలు సహా 24కు చేరిన టీడీపీ సంఖ్యాబలం

కూటమి నేతలకు టచ్‌లో మరో ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు

మేయర్‌ పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి.. అవిశ్వాసం పెట్టేందుకు సన్నాహాలు

కర్నూలు న్యూసిటీ/కర్నూలు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు అధికార కూటమి నాయకుల టచ్‌లో ఉన్నారు. వారు టీడీపీలో చేరితే సంఖ్యాబలం దృష్ట్యా మేయర్‌ పీఠం కూటమి సొంతం అవుతుంది. మేయర్‌ బీవై రామయ్య పదవీ కాలం నాలుగేళ్లు పూర్తయ్యింది. ఆయనను పదవి నుంచి దింపేందుకు రాజకీయ ఎత్తులకు పదును పెట్టినట్లు తెలుస్తున్నది. మేయర్‌ పీఠం కోసం టీడీపీ నాయకులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గత నెలలో టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు రహస్యంగా సమావేశమై అవిశ్వాసం పెడిపే మద్దతు ఇస్తా మని సంకేతాలు పంపించారు. సాంకేతిక కారణాల వల్ల టీడీపీ నాయకులు ఆ దిశగా దృష్టిసారించలేక పోయారు. తాజాగా ఆ అడ్డంకులు తొలగిపోవడంతో ఎప్పుడైనా కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వవచ్చనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. అదే క్రమంలో మేయర్‌ రామయ్య అవినీతి అక్రమాలపై టీడీపీ కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. అవిశ్వాసం ద్వారా మేయర్‌ రామయ్యను దింపేస్తారా..? ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది.

కర్నూలు నగరపాలక సంస్థ పరిఽధిలో ఉన్న 52 డివిజన్ల (వార్డులు)లో కర్నూలు నియోజకవర్గంలో 33, పాణ్యం నియోజకవర్గం పరిధిలో 16, కోడుమూరు నియోజకవర్గం పరిధిలో మూడు డివిజన్లు వస్తాయి. 2021 మార్చిలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ 43 వార్డుల్లో విజయం సాధిస్తే.. టీడీపీ అభ్యర్థులు ఆరుగురు, ఆ పార్టీ మద్దతుతో విజయం సాధించిన ముగ్గురు స్వతంత్రులతో కలిపి టీడీపీ బలం 9 మంది కార్పొరేటర్లే. 19వ డివిజన్‌ విజయం సాధించిన వైసీపీ కార్పొరేటరు బీవై రామయ్య అదే ఏడాది మార్చి 19న మేయర్‌గా, డిప్యూటీ మేయర్లుగా ఎస్‌. రేణుక, ఎన్‌. అరుణ బాధ్యతలు స్వీకరించారు. రామయ్య మేయర్‌గా ఎంపికైనా తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు వైసీపీ కార్పొ రేటర్లు అసంతృప్తితో రగిలిపోతున్నా.. వైసీపీ అధికారంలో ఉండడంతో బయట పడలేదు. 2024 జూన్‌ 12న టీడీపీ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు.. ఆ తరువాత ఒక్కొక్కరుగా వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరుతూ వచ్చారు.

బలం పుంజుకున్న కూటమి

కర్నూలు నగరపాలక సంస్థలో టీడీపీ కూటమి సంఖ్యాబలం పెంచుకుంటూ వస్తోంది. 52 మంది కార్పొరేటర్లు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కర్నూలు ఎమ్మెల్యే మంత్రి టీజీ భరత్‌, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. వీరితో కలిపితే ఓటు హక్కు కలిగిన సభ్యుల సంఖ్య 56కు చేరింది. వీరిలో ఒకరు ఓ కేసులో న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడంతో జిల్లా జైలులో ఉన్నారు. ఆయన ఓటు హక్కు కోల్పోతే.. 55 మంది ఉంటారు. అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్‌ను పదవి నుంచి దింపాలంటే 28 మంది సభ్యుల బలం ఉండాలి. టీడీపీ కార్పొరేటర్లు 9 మంది ఉంటే.. మరో 11 మంది వైసీపీ కార్పొరేటర్లు ఇప్పటికే అధికారికంగా టీడీపీలో చేరారు. ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు నాలుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యులు కలిపితే టీడీపీ సభ్యుల సంఖ్యా బలం 24కు చేరుతుంది. మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే నలుగురు సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. అయితే.. ఇప్పటికే ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ నాయకులకు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. వాళ్లు టీడీపీలో చేరినా, అవిశ్వాస తీర్మానం రోజున మద్దతు ఇచ్చినా రామయ్యకు పదవీ గండం తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పీఠం చేజారకుండా వైసీపీ వ్యూహం

మేయర్‌ పీఠం కోసం ఓ వైపు కూటమి నాయకులు వ్యూహాత్మక పావులు కదుపుతోంటే.. ఎలాగైనా పీఠం చేజారకుండా చూడాలని వైసీపీ ముఖ్య నాయకులు పావులు కదుపు తున్నారు. టీడీపీ నాయకులతో టచ్‌లో ఉన్నారనుకుంటున్న వైసీపీ కార్పొరేటర్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే.. వైసీపీలో మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇటీవల నిర్వహించిన యువత పోరు నిరసన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఫొటో లేకపోవడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీలో అంతర్గత విభేదాలు మేయర్‌ అవిశ్వాస తీర్మానంలో టీడీపీకి కలిసొచ్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

వ్యూహంలో భాగమేనా..?

మేయర్‌ బీవై రామయ్య నాలుగేళ్ల పదవీ కాలంలో పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ కార్పొరేటర్లు గురువారం విరుచుకుపడ్డారు. అధికారం అడ్డం పెట్టుకొని ఏ పనికి ఎంత డబ్బు వసూలు చేసిందీ ఆధారాలతో సహా వెల్లడించారు. బినామి పేర్లతో ప్రభుత్వ భూములు కబ్జా చేశారంటూ ఆరోపించారు. రామయ్యను పదవి నుంచి దించే వ్యూహంలో భాగంగానే టీడీపీ కార్పొరేటర్లు ఈ అవినీతి అస్త్రాలను ఆయనపై సంధించారని పలువురు చర్చించుకుంటున్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:27 AM