మూగజీవాలకు మేతగా కొత్తిమీర
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:22 AM
ఎండలకు కొత్తిమీర సాగు చేసిన రైతులు విలవిలలాడుతున్నారు.

గోనెగండ్ల, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ఎండలకు కొత్తిమీర సాగు చేసిన రైతులు విలవిలలాడుతున్నారు. దీనికి తోడు ముదురుతుండ టంతో కొత్తి మీర కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని సాగు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. కొత్తి మీర పంటకు ప్రతి రోజు లేక పోతే రోజు విడిచి రోజు నీరు కట్టాల్సి ఉంది. ఊహించని విధంగా బావులు, బోర్లలో నీరు అడుగంటి పోవడం, బోర్లలో పట్టిపట్టి నీరు వస్తుండటంతో సాగు చేసిన పంటకు నీరు సరిపోవడం లేదు. దీంతో కొత్తి మీర రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావు. పంట ఎండిపోతుం డటంతో మూగజీవాలకు మేతగా వదులుతున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు 200 ఎకరాల్లో కొత్తిమీరను సాగు చేశారు. కబుల్ అనే రైతు ఒక ఎకరంలో కొత్తిమీరకు రూ. 70వేలు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశాడు. పంట ఎండిపోవడంతో ధర పలకడం లేదు. దీనికి తోడు పంట సాగు చేసి 40 రోజులు ముగియడంతో ఇక చేసేది లేక మూగజీవాలకు వదిలివేస్తున్నారు. కొత్తి మీర రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.