సద్గుణ మార్గమే రంజాన్
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:13 AM
సద్గుణ మార్గమే రంజాన్

సేవాగుణం, శాంతియుత జీవనం అలవరచుకోవాలి..
ఈద్గాలలో మత పెద్దల పిలుపు
ఉమ్మడి జిల్లాలో ఘనంగా ‘ఈద్-ఉల్-ఫితర్’
కర్నూలు కల్చరల్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రంజాన్ మాసంలో ఆచరించిన ఉపవాస దీక్షల సారం సద్గుణమార్గంలో జీవించడమే అని మత పెద్దలు ఉద్బోధించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోమవారం ‘ఈద్-ఉల్-ఫితర్’ (రంజాన్) వేడుకను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని ఈద్గా ల వద్ద ప్రత్యేక ఈద్ నమాజులు నిర్వహించారు. మతపెద్దలు ప్రార్థనలు చేయించి, దైవ సందేశం అందించారు. రంజాన్ మాసం ముప్పయ్ రోజుల్లో ఉపవాసం దీక్షల ద్వారా పొందిన పరివర్తన ఏడాది పొడవునా కొనసాగించా లని, జీవన మార్గంగా స్వీకరించాలని ఉద్బోధించారు. ఈ ప్రార్థనల్లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు చట్టాల సవరణకు నిరసనగా, నల్లబ్యాడ్జీలు ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
రంజాన్ వేడుకల్లో ప్రముఖులు
ఉమ్మడి జిల్లాలో సోమవారం రంజాన్ వేడుకల సందడి కొట్టొచ్చినట్లు కనిపించింది. పేద, ధనిక వర్గ భేదాలు లేకుండా అందరూ పండుగను ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, నంద్యాల జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆత్మకూరు, డోన్ తదితర ప్రాంతాల్లో ఈద్ నమాజులకు వేలాదిగా హాజరయ్యారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ పి. రంజిత్ బాషా, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.