Share News

ఉపాధ్యాయుడి తీరు దారుణం

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:54 PM

మండలంలోని ఏనుగమర్రి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు బొజ్జన్న తీరు దారుణంగా ఉందని, విద్యార్థినులు, ఉపాధ్యాయినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

ఉపాధ్యాయుడి తీరు దారుణం
విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న సీఐ

అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు, తల్లిదండ్రుల ఆందోళన

ఏనుగుమర్రి హైస్కూల్‌ వద్ద ఉద్రిక్తత

సస్పెండ్‌ చేసిన అధికారులు

ప్యాపిలి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఏనుగమర్రి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు బొజ్జన్న తీరు దారుణంగా ఉందని, విద్యార్థినులు, ఉపాధ్యాయినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం 8 గంటలకు పాఠశాల వద్దకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న ఆ ఉపాద్యాయుడు విధులకు రాలేదు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. సీఐ వెంకటరామిరెడ్డి, సిబ్బందితో చేరుకొని ఆందోళనకారులను నిలువరించారు.

ఆ సారు ఉంటే బడి మానుకుంటాం

ఆ సారు తమపై అసభ్య కరంగా వ్యవహరిస్తున్నాడని, ఆయన ఉంటే తాము బడి మానుకుంటామని విద్యార్థినులు చెప్పారు. నోటితో చెప్పలేని విధంగా దుర్భాషలాడుతాడని, బయట చెప్పలేని విధంగా వ్యవహరిస్తాడన్నారు. ఇటువంటి టీచర్‌ను పాఠశాలలో లేకుండా చేయాలని, లేనిపక్షంలో తాము బడి మానుకుంటామని విద్యార్థునులు చెబుతున్నారు.

విద్యాశాఖ మంత్రి స్పందించాలి

విద్యార్థునులతో పాటు తమపై కూడా ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఉపాధ్యాయినులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌, హోంమంత్రి అనిత స్పందించాలని ఉపాధ్యాయినులు కోరారు.

ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

నంద్యాల నూనెపల్లె/ఎడ్యుకేషన్‌: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యా యుడిగా పనిచేస్తున్న బొజ్జన్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సస్పెండ్‌ చేసినట్లు కలెక్టర్‌ రాజకుమారి, డీఈవో జనార్దన్‌రెడ్డి గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఉపాధ్యాయుడు బొజ్జన్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి కావడంతో సస్పెండ్‌ చేశామని చెప్పారు. విధుల నిర్వహణలో తీవ్ర ఆలసత్వం వహించడమే కాకుండా విద్యార్థినుల పట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించినట్లు ఎంఈవో, డిప్యూటీ ఈవోలు తమ నివేదికల్లో వెల్లడించినట్లు తెలిపారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఉపాధ్యాయుడిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు నివేదికలో పేర్కొనడంతో విద్యార్థినులను విచారించినట్లు తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 20 , 2025 | 11:54 PM