శ్రీగిరిపై ముగిసిన ఉగాది ఉత్సవాలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:06 AM
శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం ఉగాది మహోత్సవాలు యాగపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.

అశ్వవాహనంపై ఆది దంపతుల విహారం
నిజరూప అలంకరణలో భ్రమరాంబదేవి
శ్రీశైలం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం ఉగాది మహోత్సవాలు యాగపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో ముందుగా స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిపించి అనంతరం స్వామివారి యాగశాలలో చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాధికాలు చేశారు. అమ్మవారి ఆలయ యాగశాలలో చండీహోమం జరిపారు. తరువాత యాగపూర్ణాహుతి, వసంతోత్సవం, త్రిశూలస్నానం నిర్వహించారు. నారికేళాలు, సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు తదితరాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. చివరగా పుష్కరిణిలో త్రిశూలస్నానం జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావు, అర్చకులు తదితరులు పాల్గ్గొన్నారు.
అశ్వవాహనంపై ఆది దంపతుల విహారం
ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన అశ్వవాహనంపైౖ ఆశీనులను చేసి అర్చకులు, వేదపండితులు విశేష పూజలు జరిపారు. అనంతరం అశ్వవాహనసేవను మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఉత్సవం నిర్వహించారు.
అమ్మవారి నిజరూప దర్శనం: ఉగాది మహోత్సవాల్లో భాగంగా చివరిరోజు అమ్మవారు భ్రమరాంబదేవి నిజరూప అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టభుజాలు కలిగిన ఈ దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిగ మొదలైన ఆయుధాలను ధరించి జగన్మాతగా దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవం నిర్వహించారు.