వసూల్ రాజా
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:18 AM
ఎవర్నీ వదలకుండా దోచుకోవడమే ఆయన మొదటి పని అయితే నోటికొచ్చినట్టు బండ బూతులు తిట్టడం రెండో పని. గట్టిగా అరవడం, తిట్ల దండకం అందుకోవడం వంటి చర్యలతో ముందుగా షాపుల యజమానులు, రోడ్డు సైడు వ్యాపారులను భయాందోళనకు గురి చేస్తాడు.

డ్రైవర్, రైటర్‌ను అడ్డుపెట్టుకొని దందా
రోడ్డు సైడు వ్యాపారులనూ వదలని వైనం
ఇసుక, మట్టి టిప్పర్ల నుంచి నెలవారీ మామూళ్లు
ఆటో స్టిక్కర్ల పేరుతోనూ దోపిడీ
నోరు తెరిస్తే బూతు పురాణమే
హడలెత్తిపోతున్న షాపుల యజమానులు
ఓ పోలీసు అధికారిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఎవర్నీ వదలకుండా దోచుకోవడమే ఆయన మొదటి పని అయితే నోటికొచ్చినట్టు బండ బూతులు తిట్టడం రెండో పని. గట్టిగా అరవడం, తిట్ల దండకం అందుకోవడం వంటి చర్యలతో ముందుగా షాపుల యజమానులు, రోడ్డు సైడు వ్యాపారులను భయాందోళనకు గురి చేస్తాడు. ఆ తరువాత వారి నుంచి మామూళ్లు రాబట్టడానికి తన డ్రైవర్, రైటర్‌ను ఉసిగొల్పుతాడు. ఇలా పెద్ద పెద్ద షాపింగ్ కాంపెక్స్ యజమానులు మొదలుకొని రోడ్డు సైడు వ్యాపారుల వరకు ఆయనకు డబ్బులు ముట్టజెప్పాల్సిందే. అలాగే నగరంలోకి వచ్చే మట్టి, ఇసుక తదితర టిప్పర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా ఆటో స్టిక్కర్ల పేరుతో దోపిడీ చేస్తున్నారని సమాచారం.
నంద్యాల, మార్చి 20(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో పని చేసే ఓ పోలీసు అధికారిపై పోలీసు వృత్తిలోకి వచ్చిన మొదట నుంచే అనేక ఆరోపణలు ఉన్నట్లు ఆ శాఖ వర్గాల నుంచి తెలుస్తోంది. ఇతర జిల్లాల్లో పని చేసిన సందర్భాల్లోనూ పలు అవినీతి ఆరోపణలు రావడంతో శాఖ పరమైన చర్యలకు గురైనట్టు సమాచారం. ఆయినప్పటికీ సదరు అధికారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. వాహనాచోదకులు, హోటళ్ల, వ్యాపార దుకాణాదారులు, పలు షాపింగ్ మాల్స్ యజమానాలు అనే తేడా లేకుండా ట్రాఫిక్ నిబంధనల పేరుతో సదరు అధికారి బెదిరింపులు, బూతు పురాణాలతో హడలెత్తిస్తున్నారు. తమ కింద పని చేసే సిబ్బందిపై కూడా ఇదే తరహాలో తిట్ల దండకం అందుకుంటారని ఆశాఖ వర్గాల్లోనూ చర్చ ఉంది. ఈ నేపథ్యంలో కొందరు సిబ్బంది సదరు అధికారి కింద పని చేయకలేక.. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా.. మరికొందరు తాజాగా బయటకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
ట్రాఫిక్ సమస్య పేరుతో వసూళ్లు
నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య ఉన్న విషయం తెలిసిందే. మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా భవనాలకు అనుమతులు ఇవ్వడంతో ఆయా యజమానులు సైతం రోడ్లను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేసేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు కూడళ్లలో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైంది. ఇదే అదునుగా భావించి సదరు ట్రాఫిక్ పోలీసు అధికారి నిబంధనల పేరుతో వాహనచోదకుల నుంచి ఫుట్‌పాత్ దుకాణాలు, పలు హోటళ్లు, షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలు, బార్‌ల వరకు నెలవారీ మామూళ్లకు తెరలేపారని సమాచారం. ఇది చాలదన్నట్లు.. నగరంలో ఇసుక, మట్టి, కంకర తరలించే వాహనాలపై తమదైన శైలిలో అధిక లోడు, బడా వాహనాలు, అక్రమ రవాణా పేరుతో బెదిరించి వీరితో కూడా నెలవారీ మామూళ్లు పెద్దఎత్తున వసూలు చేస్తున్నారని తెలిసింది. ఇటీవల నగరంలో ఓ హోటల్ యజమానితో కూడా సదరు పోలీసు అధికారి వాగ్వాదానికి దిగి ఆ తరువాత చేతివాటం ప్రదర్శించారని సమాచారం. ప్రధానంగా మంత్రి ఫరూక్ క్యాంప్ కార్యాలయం సమీపంలోని ఓ కూల్ డ్రింక్ షాపు ఫుట్‌పాత్ మీద పెట్టారని బెదిరించి రూ. 25 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఇలా పలు దుకాణాదారులను బెదిరించి అక్రమ వసూళ్లకు బరితెగించారని బాధిత వర్గాల నుంచి తెలిసింది. జరిమానాల విషయంలోనూ ఈ ముగ్గురు చేతివాటం ప్రదర్శించి సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. కోర్టుకు వెళ్లే వాహనాదారుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసి క్యాష్ చేసుకుంటున్నారని తెలిసింది.
ఆటో స్టిక్కర్ల పేరుతోనూ దోపిడీ..
సదరు అధికారి తమదైన శైలిలో అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారనే ప్రచారం నగరంలో జోరుగా ఉంది. పై నుంచే వచ్చే అక్రమ ఆదాయం చాలదన్నట్టుగా భావించి.. నగరంలోని ఆటోలకు స్టిక్కర్లు వేయడం మొదలెట్టాడు. ఈ క్రమంలో ఆయా ఆటోలకు రేడియం స్టిక్కర్ వేయడం అంటే... రూ. 150 నుంచి.. రూ. 250 వరకు ఖర్చు అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే సదరు అధికారి ఇక్కడ కూడా తమదైన శైలిలో చేతివాటం ప్రదర్శించి ఒక్కొక్క ఆటో నుంచి సుమారు.. రూ.400 నుంచి..రూ. 1000 వరకు వసూలు చేశారని సమాచారం. ఇదే క్రమంలో రికార్డులు సక్రమంగా లేకపోతే. అంతే సంగతులు. రికార్డులు సక్రమంగా లేవని సాకుగా చూపి రూ.1500 నుంచి రూ. 3000 వరకు అక్రమంగా వసూలు చేశారని బాధిత వర్గాల నుంచి తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా కూడా ఓ ఏజెన్సీ ద్వారా సాగిందని సమాచారం. అయితే ఇందులో సిబ్బంది పాత్ర కూడా ఎక్కువ ఉందని సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆటో స్టిక్కర్ల రూపంలోనూ సదరు పోలీసు అధికారి ఇలా అక్రమ వసూళ్లకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది.
సదరు పోలీసు అధికారి ట్రాఫిక్‌లో పని చేస్తున్న సిబ్బందిపై ఒక్కొక్కరిపై ఒక్కో రకమైన భావనతో వ్యవహరిస్తుండటం ఆశాఖ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కొందర్నైయితే విధుల పేరు తో పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా సిబ్బంది ప్రశ్నిస్తే అంతే సంగతులు ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో డ్యూటీ వేయడం.. బహిరంగానే బూతులు తిట్టడం వంటి చర్యలతో వారు మానసిక వేదనకు గురవుతున్నారు. సదరు పోలీసు అధికారి అక్రమార్జన గుట్టు బయటపడకుండా డ్రైవర్, సదరు స్టేషన్‌లోని రైటర్ చక్రం తిప్పుతున్నారని ఆ శాఖ వర్గాల నుంచి తెలిసింది. పైగా సదరు డ్రైవర్ ఏఆర్ నుంచి ఇక్కడికి వచ్చి ఏళ్ల తరబడి పాతుకుపోయారని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఏళ్ల తరబడి ట్రాఫిక్‌లో పని చేసిన అనుభవం ఉండటంతో.. సదరు అధికారి కూడా సదరు డ్రైవర్‌ను అడ్డుపెట్టుకుని మరీ అక్రమ వసూళ్లు జోరుగా కొనసాగిస్తున్నారని సమాచారం.
వణికిపోతున్న వాహనచోదకులు, దుకాణదారులు..
సదరు ట్రాఫిక్ పోలీసు అధికారితో పాటు డ్రైవర్, రైటర్ వ్యవహారంతో స్టేషన్‌లో పని చేస్తున్న కొంతమంది సిబ్బందితో పాటు.. పలు వాహనచోదకులు, దుకాణాదారులు, హోటల్, షాపింగ్ మాల్స్ తదితర వ్యాపార సముదాయాల యజమానులు వణికిపోతున్నారు. ఏ సమయంలో ఎలాంటి బూ తులు ఆయన నోటి నుంచి వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ నిబంధనల పేరుతో ఈ ముగ్గురు చేస్తున్న అక్రమ వసూళ్లపై నంద్యాల జిల్లా కేంద్రంలో పెద్ద దుమారం రేగుతోంది. తనపై అధికారులు జిల్లా కేంద్రంలోనే ఉన్నప్పటికీ సదరు ట్రాఫిక్ పోలీసు అధికారి తీరు దురుసుగా ప్రవరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. పలువురు వ్యాపారులు, వాహననచోదకులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు సైతం ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అక్రమాలకు పాల్పడితే చర్యలు...
ట్రాఫిక్ నిబంధనలను పేరుతో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్‌లో కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. త్వరలోనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. సిబ్బందికి ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకు రండి. అక్రమ వసూళ్లపై లోతుగా విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటాం.
-ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా