Share News

వైసీపీ ఇక అధికారంలోకి రాదు

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:48 PM

ఇకపై జన్మలో వైసీపీ అధికారం చేపట్టే అవకాశాలే లేవని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి అన్నారు.

వైసీపీ ఇక అధికారంలోకి రాదు
అమడాలలో లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేస్తున్న మంత్రి బీసీ

అసెంబ్లీ నుంచి పారిపోయిన జగన్‌ అండ్‌ కో

వైసీపీ నేతలపై మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి ఫైర్‌

కోవెలకుంట్ల, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఇకపై జన్మలో వైసీపీ అధికారం చేపట్టే అవకాశాలే లేవని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలబడి పోరాడకుండా తోకముడిచి పారిపోయిన వైసీపీ నాయకుడు జగన్‌ అని విమర్శించారు. మంగళవారం కోవెలకుంట్ల మండలం అమడాల గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను మంత్రి పంపిణీ చేశారు. ఉదయమే గ్రామానికి చేరుకున్న మంత్రి ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బీసీ అన్నారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ జన్మలో కూడా అధికారంలోకి రాలేదని మంత్రి ఎద్దేవ చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని అనాథను చేసిన ఘనత వైసీపీకి చెందుతుందన్నారు. ఈ నెలలో గౌరవ ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి రాజధానికి తిరిగి పునాదులు వేస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్‌అండ్‌బిలో రూ.12వేల కోట్లు బకాయి పెండింగ్‌ పెడితే నేడు వాటిని తీర్చామన్నారు. అంతేకాకుండా రూ.1500 కోట్ల వ్యయంతో దాదాపు 19వేల కి.మీ రహదారులను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దామన్నారు. సీ కేటగిరి కింద రాష్ట్రంలో చాలా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని, వాటి కోసం మరో రూ.800 కోట్లు విడుదల చేశామని మంత్రి అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న టీడీపీని విమర్శించే అర్హత వైసీపీకి లేదన్నారు. ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల సమస్యలపై పోరాడాలని, అసెంబ్లీలో ప్రజల తరపున గళమెత్తాలి కానీ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా పారిపోవడం ఏమిటన్నారు. అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని హితవు పలికారు. ఒక్కమాటలో చెప్పాలంటే చట్టసభలకు రాకుండా జీతాలు తీసుకునే హక్కు వైసీపీ ఎమ్మెల్యేలకు లేదన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:48 PM