Share News

Mango Farming: మామిడికి తెగుళ్ల దెబ్బ

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:50 AM

ఈ ఏడాది మామిడి పంటకు తెగుళ్లు, మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో దిగుబడి తగ్గింది. పూత బాగా వచ్చినా, నల్ల తామర పురుగు దాడితో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో దిగుబడి తగ్గినా, ఎగుమతి ఆర్డర్లు పెరగడం వల్ల ధరలు స్థిరంగా ఉన్నాయి.

Mango Farming: మామిడికి తెగుళ్ల దెబ్బ

దిగుబడులపై తీవ్ర ప్రభావం

దెబ్బతీసిన మంగు, నల్ల తామర, పేను కొరుకుడు

పంటను రక్షించుకునే ప్రయత్నాల్లో రైతులు

కాయలకు కవర్లు తొడిగి.. రక్షణ కోసం పాట్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మధుర ఫలం.. మామిడిని ఈ ఏడాది తెగుళ్లు బాగా దెబ్బతీశాయి. దీంతో ధర బాగున్నా.. దిగుబడి పెద్దగా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మార్చి రెండోవారం వరకు తెల్లవారుజామున మంచు కురవడంతో పండ్లకు మంగు ఏర్పడింది. ఇంకోవైపు తామర పురుగు దాడి చేస్తోంది. మిర్చి సాగైన ప్రాంతాల్లో ఉన్న మామిడి తోటలను నల్ల తామర పురుగు ఆశిస్తోంది. ఏలూరు, ఎన్టీఆర్‌, ప్రకాశం, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో నల్ల తామర ప్రభావం ఉందని చెబుతున్నారు. పేను కొరుకుడు విపరీతంగా రావడంతో రైతులు రసాయనాలు పిచికారి చేస్తున్నారు. ఈ ఏడాది పూత బాగా వచ్చినా.. చీడపీడలతో దిగుబడి తగ్గుతుందని చెబుతున్నారు. దిగుబడి తగ్గిపోతున్న నేపథ్యంలో మామిడి ఈ ఏడాది బాగాగిరాకీ పెరిగే పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో చీడపీడలతో కాపు తగ్గినా.. మరికొన్ని జిల్లాల్లో పంట బాగుండటం, మరోవైపు ఎగుమతి ఆర్డర్లు మెరుగుపడటం వల్ల మామిడి ధరలు బాగానేఉన్నాయి. మొదటి కోతకు ధర బాగున్నా.. ఇప్పుడు ధర తక్కువ పలుకుతోంది. అయితే కాపు చివరి కొచ్చేసరికి మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే రైతులు ఒక విడత కాయల్ని కోసి అమ్మేశారు. రెండో విడత కోతకు సిద్ధమౌతున్నారు. అత్యంత నాణ్యమైన పండ్లను రైతులు బయ్యర్ల ద్వారా ఎగుమతిదారులకు విక్రయిస్తుండగా, తక్కువ రకం పంటను స్థానిక మండీల్లో మధ్యవర్తులకు అమ్ముకుంటున్నారు. గత నెలలో బంగినపల్లి మామిడి టన్ను రూ.లక్ష దాకా పలికింది. పంట మార్కెట్‌కు వస్తుండటంతో ధర తగ్గింది.


ఇప్పుడు టన్ను రూ.30వేల నుంచి రూ.60వేల దాకా పలుకుతోంది. అయినా నాణ్యత, సైజును బట్టి ధరలు పలికే అవకాశాలున్నాయని చెప్తున్నారు. కాయలకు కవర్లు తొడిగి, రైతులు పంట నాణ్యత పెంచుతున్నారు. నాణ్యమైన పండ్లను దేశ, విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్యాన శాఖ రైతులకు ఊతమిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ ఏడాది మామిడి పంటకు బీమా వర్తింపజేయడం, ఉద్యాన శాఖ ద్వారా రాయితీలిచ్చి ప్రోత్సహించడం రైతులకు కలిసివస్తోంది. సాధారణంగా హెక్టారుకు 9నుంచి12 టన్నుల మామిడి దిగుబడి వస్తుంది. ఈ ఏడాది 40 లక్షల టన్నుల దిగుబడి అంచనాగా ఉంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో పంట ఓ మోస్తరుగా ఉంది. ఏలూరు, ఎన్టీఆర్‌, ప్రకాశం, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో పూత బాగానే ఉన్నా, చీడపీడలు దెబ్బకొట్టాయి. చిత్తూరు, అన్నమయ్య, విజయనగరం, అనకాపల్లి ప్రాంతాల్లో తోటలు బాగున్నందున ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 30లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యాన అధికారులు అంచనా వేశారు. స్థానిక విక్రయాలతోపాటు మన మామిడి ఢిల్లీతోసహా, ఇతర రాష్ట్రాలకు విరివిగా ఎగుమతి అవుతోంది. రాష్ట్రం నుంచి గత ఐదేళ్లలో 1,400టన్నుల మామిడి పండ్లు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఈ ఏడాది తాజా పండ్లు 2వేల టన్నులు, గుజ్జు 3లక్షల టన్నులకు తగ్గకుండా ఎగుమతి చేయాలని ఉద్యాన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అపెడా సంస్థ సమన్వయంతో ఇటీవల బయ్యర్లు, ఎక్స్‌పోర్టర్లతో ఉద్యాన శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు.


పండ్లకు కవర్లతో రక్షణ

బంగినపల్లి మామిడికి భౌగోళిక గుర్తింపు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ రకానికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ రకం మామిడిని నాణ్యంగా సిద్ధంచేసి, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు బయ్యర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నాయి. ఒక్కో కాయ 250-350గ్రా. ఉంటే.. కిలో రూ.60-75 చొప్పున పలుకుతోంది. అయితే మచ్చ, మంగు, ఒత్తిడి, మెత్తదనం లేకుండా రసాయనాలు పిచికారి చేయని పసుపు వర్ణంలో ఉన్న పండ్లకే డిమాండ్‌ ఉంటోంది. ఈ కారణంగా మంచి ధర, ఎగుమతికి అనువుగా రైతులు మామిడి తోటల్లో కాయలకు జూట్‌తో చేసిన కవర్లు తొడిగి, జాగ్రత్తగా ప్యాకింగ్‌ చేసి, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అలాగే ఏటా మే-జూన్‌లో చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తోతాపురం మామిడి నుంచి 3.5లక్షల టన్నుల గుజ్జు ఉత్పత్తి అవుతోంది. గుజ్జును మామిడి తాండ్ర, చాక్లెట్స్‌, జెల్లీ, మ్యాంగో జ్యూస్‌కు వాడుతున్నారు. తోతాపురి మామిడి గుజ్జు ఎక్కువగా ఆఫ్రికా ఖండానికి ఎగుమతి అవుతోంది. రాష్ట్రంలో మామిడి ప్రొసెసింగ్‌ యూనిట్లు 50 దాకా ఉన్నా.. 38 మాత్రమే నడుస్తున్నాయి.

మామిడి రైతుకు బీమా

రాష్ట్రంలో మామిడి సాగుకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. మామిడి తోటల నిర్వహణ, పండ్ల నిల్వ సామర్ధ్యం, ఎగుమతుల విషయంలో రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఎంఐడీహెచ్‌ పథకం కింద 60ు ప్రభుత్వం, 40ు రైతులు భరించేలా ఈ ఏడాది 25వేల ఎకరాల తోటల్లోని మామిడి పండ్లకు కవర్లను అమర్చడానికి ఉద్యాన శాఖ రూ.10కోట్లు కేటాయించింది. మామిడి తోటలు, పండ్ల యాజమాన్యంపై ఎస్‌ఎంఎ్‌సల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు ఉద్యాన శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:50 AM