కోడ్ ఉల్లంఘించిన జగన్‌ను అరెస్టు చేయాలి: డోలా
ABN , Publish Date - Feb 20 , 2025 | 05:00 AM
రైతులపై ప్రేమ ఉన్నట్లు జగన్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తన పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాలను ముంచిన జగన్...

ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మిర్చియార్డులో హడావుడి చేసిన జగన్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని మంత్రి డీఎస్‌బీవీ స్వామి ఒంగోలులో డిమాండ్ చేశారు. రైతులపై ప్రేమ ఉన్నట్లు జగన్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తన పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాలను ముంచిన జగన్... రైతు భరోసా నిధులు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖ రాశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ప్రశ్నించిన వారిని నిర్బంధించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వంశీ అరెస్టుపై ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా జగన్ వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. వైసీపీకి చెందిన దళిత నాయకులు జైలులో ఉంటే జగన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. సప్త సముద్రాల అవతల ఉన్న అధికారులను పట్టుకొస్తామని చెబుతున్న జగన్... అవి దాటాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని మంత్రి స్వామి ఎద్దేవా చేశారు.