Share News

Minister Nimmala Ramanaidu : పోలవరం ఎత్తు తగ్గింపు అవాస్తవం

ABN , Publish Date - Mar 05 , 2025 | 04:35 AM

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విష ప్రచారానికి రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు శాసనమండలిలో ఘాటుగా సమాధానం చెప్పారు.

Minister Nimmala Ramanaidu : పోలవరం ఎత్తు తగ్గింపు అవాస్తవం

  • 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మించి తీరుతాం: మంత్రి నిమ్మల

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విష ప్రచారానికి రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు శాసనమండలిలో ఘాటుగా సమాధానం చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గింపు అవాస్తవమని, 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మించి తీరుతామని, ప్రాజెక్టు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. 2014-19 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్‌1, ఫేజ్‌-2 అని గానీ, 41.15 మీటర్లు, 55.72మీటర్లు అని గానీ లేవని తేల్చిచెప్పారు. అలాంటిదేమైనా ఉంటే వైసీపీ సభ్యులు చూపించాలని సవాల్‌ విసిరారు. ఎత్తుకు సంబంధించి ఫేజ్‌-1, ఫేజ్‌-2లు తెచ్చింది కూడా 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వమేనన్నారు. 2020లో జగన్‌ పోలవరం కుడికాలువ నీటి సామర్థాన్ని 17,560 నుంచి 11,650 క్యూసెక్కులకు, ఎడమ కాలువ సామర్థాన్ని 17,500 నుంచి 8122 క్యూసెక్కులకు తగ్గించి ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ద్రోహం చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం 72 శాతం పనులు పూర్తి చేసిందని, వైసీపీ ప్రభుత్వం రెండు శాతం మాత్రమే చేసిందని తెలిపారు. ఈ ఏడాది జూన్‌ కల్లా ఎడమ కాలువ పనులు పూర్తి చేసి జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలు తీసుకెళ్లే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టు అంటే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకు వస్తారని, పోలవరంపై హక్కు తమదేనని శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తోందా? లేదా? ప్రభుత్వం చెప్పాలన్నారు. దీనిపై మంత్రి నిమ్మల స్పందిస్తూ.. 72 శాతం పూర్తయిన ప్రాజెక్టును గత ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. అనంతరం మీడియా పాయింట్‌ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ‘పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గిస్తే పవర్‌ ప్లాంట్‌ రాదు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు నీళ్లు రావు’ అన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 04:35 AM