Share News

Nara Lokesh : కార్యకర్తే అధినేత

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:58 AM

‘నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు కోటి మందితో అతి పెద్ద కుటుంబంగా మారింది’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీ కోటి

Nara Lokesh : కార్యకర్తే అధినేత

పసుపు జెండా ఒక ఎమోషన్‌

ప్రాణమా? పార్టీనా? అంటే... పార్టీనే ఎక్కువని జై కొట్టే చేతులు అనేకం

కోటి మందితో అతి పెద్ద కుటుంబం

కార్యకర్తలకు మంత్రి లోకేశ్‌ లేఖ

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ‘నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు కోటి మందితో అతి పెద్ద కుటుంబంగా మారింది’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆయన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. ‘సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఒక పండుగలా నిర్వహించారు. ఊరూ వాడా జై టీడీపీ నినాదాలతో హోరెత్తించారు. ఏపీ, తెలంగాణ, అండమాన్‌తో సహా అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, వివిధ దేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున భాగస్వాములయ్యారు. గత రికార్డులు తిరగరాస్తూ కోటి సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించాం. సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులు, సిబ్బందికి శుభాకాంక్షలు. పసుపు జెండా మనకు ఒక ఎమోషన్‌. పీకమీద కత్తి పెట్టి వేరే పార్టీ అధినేతకు జై కొడితే విడిచిపెడతామని చెప్పినా... ‘జై చంద్రబాబు, జై టీడీపీ’ అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య నాకు ప్రతిక్షణం గుర్తుకొస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులు ఉన్మాదుల్లా మీద పడుతుంటే మీసం మెలేసి, తొడకొట్టి... ‘జై చంద్రబాబు’ అన్న అంజిరెడ్డి తాత తెగువ నాకు నిత్యస్ఫూర్తి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రతి గ్రామంలో ‘ప్రాణం ఎక్కువా? పార్టీ ఎక్కువా?’ అంటే పార్టీనే ఎక్కువ అని జై కొట్టే చేతులు అనేకం. ఏమిచ్చినా, ఎన్ని జన్మలెత్తినా కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది. దేశంలో ఏ పార్టీకీ లేని కార్యకర్తల బలం టీడీపీకి సొంతం. అలాగే ఏ పార్టీ ఇవ్వని గౌరవం కార్యకర్తలకు టీడీపీ ఇస్తుంది. కార్యకర్తల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ టీడీపీ’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.


కార్యకర్తల కష్టమే కోటి సభ్యత్వం: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టమే కోటి సభ్యత్వమని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ సభ్యత్వం కోటి మైలురాయిని దాటిన సందర్భంగా గురువారం ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘పార్టీ సభ్యత్వం కోటి దాటడం ఎంతో గర్వకారణం. రాజకీయ పార్టీ సభ్యత్వ నమోదులో ఇదో గొప్ప రికార్డు. అసాధారణమైన ఈ లక్ష్యాన్ని చేరుకొన్న వేళ టీడీపీ కుటుంబ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు. ఈ ఘనత ఎనలేని సంతృప్తిని ఇచ్చింది. ఈ మహా క్రతువులో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికీ నా అభినందనలు. ధన్యవాదాలు. కోటి మంది పసుపు సైన్యంతో పార్టీని తీర్చిదిద్దిన కార్యకర్తే ఈ పార్టీకి అధినేత. కార్యకర్తల పార్టీగా టీడీపీ దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతోంది. కార్యకర్తల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్న లోకేశ్‌కు ప్రత్యేక అభినందనలు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు, ఎంపీలతో చంద్రబాబు కొంతసేపు సమావేశం కానున్నారు. వర్తమాన పరిణామాలపై వారితో చర్చిస్తారు. ఆదివారం రాత్రికి ముఖ్యమంత్రి బృందం దావోస్‌ బయలుదేరి వెళ్తోంది.


కార్యకర్తలకు చేసిన చిరుసాయం

‘కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా పవిత్రమైన బాధ్యత నాకు అప్పగించారు. ఇప్పటివరకు 2,500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సాయం అందించాం. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5,164మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున రూ.103.28 కోట్లను అందజేశాం. అనారోగ్యంతో బాధపడుతున్న అనేకమంది కార్యకర్తలకు వైద్య సాయం అందించాం. 2వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం. 5వేల కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచి రూ.19కోట్లు సాయం చేశాం. జెండా మోసే ప్రతి కార్యకర్తలకు అండగా నిలవడమే అజెండా. కొన్ని నియోజకవర్గాల నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని లక్షకు పైగా సభ్యత్వాలు చేయడంతో పాటు జీవితకాల సభ్యత్వాలూ ఎక్కువ చేశారు. వారికి ప్రత్యేక అభినందన. కార్యకర్తకు భరోసా ఇచ్చే నమోదు కార్యక్రమంలో పాల్గొని కోటి సభ్యత్వాలతో రికార్డులు బద్దలు కొట్టడంలో భాగస్వామి అయిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు’ అని లోకేశ్‌ భావోద్వేగభరితంగా లేఖ రాశారు.

Updated Date - Jan 17 , 2025 | 03:58 AM