University Bifurcation: వర్సిటీల విభజన ఇంకెప్పుడు?
ABN , Publish Date - Feb 22 , 2025 | 02:55 AM
ప్రభుత్వాలు మారుతున్నా ఈ యూనివర్సిటీలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడంపై శ్రద్ధ కనిపించడం లేదు. విభజన జరిగాక మొదటి ఐదేళ్లు ప్రభుత్వ సంస్థల విభజన ప్రక్రియ సంక్లిష్టంగా ఉంది. అనంతరం విభజనకు అవకాశమున్నా వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా గాలికొదిలేసింది.

హైదరాబాద్‌లోనే ఓపెన్ వర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయం
రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటినా తేలని పంచాయితీ
ఏపీలోని స్టడీ సర్కిళ్లకు సేవలు ఆపేసిన ఓపెన్ వర్సిటీ
ఈ ఏడాది రాష్ట్ర విద్యార్థులకు దూర విద్య అడ్మిషన్లు బంద్
జీతాల బిల్లులూ పంపని ఓపెన్ వర్సిటీ అధికారులు
రెణ్నెల్లుగా జీతాలు బంద్.. ఏపీ ఉన్నత విద్యామండలి లేఖ
జగన్ హయాంలో వర్సిటీల విభజనపై తీవ్ర నిర్లక్ష్యం
ప్రభుత్వం మారినా ఇప్పుడూ కనిపించని కదలిక
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటింది. ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది. కానీ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విభజనపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రభుత్వాలు మారుతున్నా ఈ యూనివర్సిటీలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడంపై శ్రద్ధ కనిపించడం లేదు. విభజన జరిగాక మొదటి ఐదేళ్లు ప్రభుత్వ సంస్థల విభజన ప్రక్రియ సంక్లిష్టంగా ఉంది. అనంతరం విభజనకు అవకాశమున్నా వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. నాటి తెలంగాణ ప్రభుత్వంతో చెట్టపట్టాలేసుకుని తిరిగిన జగన్ యూనివర్సిటీల విభజనను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఓపెన్ యూనివర్సిటీని తిరుపతిలో ఏర్పాటు చేయాలని హడావుడిగా నిర్ణయం తీసుకున్నా అది అక్కడే ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చినా వర్సిటీల విభజన విషయంలో తీరు మారలేదు. దీంతో ఈ రెండు యూనివర్సిటీలు రాష్ట్రంలో ఎప్పుడు ఏర్పాటవుతాయో అర్థంకాని అయోమయ పరిస్థితి.
ఇంకా ఉమ్మడిగానే...
రాష్ట్ర విభజన జరిగి దశాబ్దకాలం దాటినా ఇప్పటికీ అనేక ప్రభుత్వ సంస్థల విభజన పూర్తికాలేదు. ఆస్తుల విషయంలో ఏర్పడిన న్యాయ వివాదాల కారణం గా ఉమ్మడిగానే ఉన్నాయి. అయితే రెండు రాష్ర్టాల మధ్య ఉమ్మడి సేవలు అందించడం కష్టమని భావించి చాలా సంస్థలు అనధికారికంగా విడిపోయాయి. ఉదాహరణకు విభజన జరగకపోయినా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఉన్నత విద్యామండలి వంటి వాటికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సొంతంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించాయి. కానీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉమ్మడిగా కొనసాగుతున్నాయి. ఏపీలో ఓపెన్ వర్సిటీకి 76 స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడిలో కేంద్రాలు ఉన్నాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య స్వల్పంగానే ఉంది. కానీ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదివే విద్యార్థులు ఏపీలో సుమారు 30వేల మంది ఉన్నారు. కాగా ఉమ్మడి రాజధాని కాల పరిమితి ముగిసిందనే కారణం చూపుతూ హైదరాబాద్‌లోని ఓపెన్ యూనివర్సిటీ ఈ ఏడాది నుంచి ఏపీలోని స్టడీ సర్కిళ్లకు సేవలు ఆపేసింది.
ఆగిన అడ్మిషన్లు, జీతాలు
దూర విద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఏటా జూన్, జనవరి నెలల్లో అడ్మిషన్లు చేపడతారు. కానీ ఈ ఏడాది నుంచి ఏపీలోని స్టడీ సర్కిళ్లకు ఓపెన్ యూనివర్సిటీ సేవలు నిలిపివేయడంతో కొత్తగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వలేదు. ఏపీలోని స్టడీ సర్కిళ్ల ద్వారా చదివే విద్యార్థులు ఏటా దాదాపు రూ.16 కోట్ల ఫీజులు యూనివర్సిటీకి చెల్లిస్తున్నారు. ఆ ఫీజులు తీసుకుంటున్న యూనివర్సిటీ.. స్టడీ సర్కిళ్లు ఏపీలో ఉన్నందున అక్కడి ఉద్యోగులకు జీతాలు ఇవ్వబోమని గతంలోనూ మెలిక పెట్టింది. దీంతో ఉద్యోగుల జీతాల బిల్లులు జనరేట్ చేసి పంపితే ఏపీ ప్రభుత్వమే ఇక్కడి ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోంది. ఇప్పుడు వర్సిటీ సేవలు ఆపేసినందున జీతాల బిల్లులు కూడా పంపబోమంటూ అక్కడి అధికారులు అడ్డం తిరిగారు. దీంతో రెండు నెలలుగా ఏపీలోని స్టడీ సెంటర్లలో ఉద్యోగుల జీతాలు ఆగిపోయాయి. జీతాల చెల్లింపులకు బిల్లులు పంపాలంటూ సోమవారం ఏపీ ఉన్నత విద్యామండలి... అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి లేఖ రాసింది.
జగన్ సర్కారు నిర్లక్ష్యం
రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ర్టాల మధ్య సఖ్యత లోపించింది. అప్పటి టీడీపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలకు అన్ని విషయాల్లోనూ వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో అప్పట్లో ఉమ్మడి సంస్థల విభజన ముందుకు కదల్లేదు. అనంతరం ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో విభజన సమస్యలు కొలిక్కి వస్తాయని అందరూ ఊహించారు. ప్రభుత్వాల పరంగానూ, వ్యక్తిగతంగానూ వైసీపీ, టీఆర్‌ఎస్ సర్కార్లు, నాటి సీఎంలు జగన్, కేసీఆర్ సన్నిహితంగా మెలిగారు. ఆ సమయంలో ప్రభుత్వ సంస్థల విభజనకు మంచి అవకాశం ఏర్పడినా జగన్ సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఎంతసేపూ వ్యక్తిగత అంశాలు తప్ప ఉమ్మడి ఆస్తుల విభజనను పట్టించుకోలేదు. పోనీ రాష్ట్రంలో వర్సిటీలను ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెట్టలేదు. దీనిపై విమర్శలు తీవ్రం కావడంతో ఎన్నికలకు ముందు హడావిడిగా తిరుపతిలో ఓపెన్ యూనివర్సిటీని నెలకొల్పే ఫైలు పెట్టారు. సరిగ్గా ఎన్నికల కోడ్ విడుదలైన రోజునే షార్ట్ సర్క్యులేషన్ ద్వారా దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దానిపై ఆర్డినెన్స్ జారీకి అనుమతివ్వాలని ఈసీని కోరింది. ఈసీ అంగీకరించకపోవడంతో ఏర్పాటు ప్రక్రియ ఆగిపోయింది. కాగా, కూటమి ప్రభుత్వంలో అయినా యూనివర్సిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటారని ఆశించారు. హైదరాబాద్‌లోని ఓపెన్ వర్సిటీ ఏపీకి సేవలు నిలిపివేయడంతో తాత్కాలికంగా నాగార్జున వర్సిటీ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. కానీ, ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందించలేదు.
ఇవి కూడా చదవండి..
మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర ఎంతకు చేరిందంటే..
భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా
Read Latest AP News And Telugu News