Share News

Nellore : ఏడో తరగతి విద్యార్థినిపై లైంగికదాడి

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:07 AM

బాలికను రోజూ స్కూల్‌కు తీసుకెళ్లే క్రమంలో వ్యాను డ్రైవర్‌ ఆమె యోగక్షేమాలు అడిగేవాడు. చదువు వివరాలు ప్రస్తావిస్తూ సొంత మనిషిలా నమ్మించాడు.

Nellore : ఏడో తరగతి విద్యార్థినిపై లైంగికదాడి

  • ప్రతిఘటించడంతో కడుపులో పిడిగుద్దులు

  • స్కూల్‌ వ్యాను డ్రైవరే కీచకుడు

  • గత నెల 29న ఘటన.. నిందితుడి కోసం గాలింపు

నెల్లూరు రూరల్‌, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఏడో తరగతి చదువుతున్న బాలికను రోజూ స్కూల్‌కు తీసుకెళ్లే క్రమంలో వ్యాను డ్రైవర్‌ ఆమె యోగక్షేమాలు అడిగేవాడు. చదువు వివరాలు ప్రస్తావిస్తూ సొంత మనిషిలా నమ్మించాడు. అదను చూసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. గత నెల 29న ఈ దారుణం జరగగా, బాలిక తల్లికి అనుమానం వచ్చి ఆరా తీయడంతో వెలుగుచూసింది. నెల్లూరు రూరల్‌ సీఐ గుంజి వేణు కథనం మేరకు... నెల్లూరు రూరల్‌ మండల పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బాలిక(13) ఏడో తరగతి చదువుతోంది. ఆ చిన్నారికి తండ్రి లేడు. గత నెల 29న బాలిక వ్యాన్‌లో స్కూలుకు బయలుదేరింది. కొంతదూరం వెళ్లేసరికి వాంతులు రావడంతో కిందికి దిగింది. రోజూ వ్యానుకు డ్రైవర్‌గా వచ్చే నరుకూరు దళితవాడకు చెందిన నంబూరు సతీష్‌, ఆ రోజు కొత్త డ్రైవర్‌కు రూట్‌ చూపించేందుకు స్కూటర్‌పై వచ్చాడు. కిందకు దిగిన బాలికను స్కూటర్‌పై ఎక్కించుకుని తీసుకువస్తానని చెప్పి వ్యానును పంపించేశాడు. కానీ బాలికను స్కూల్‌కు తీసుకెళ్లకుండా కోడూరు వద్దనున్న సముద్రతీరానికి మరో స్నేహితుడు కోవూరు సునీల్‌ సాయంతో తీసుకెళ్లాడు.


అక్కడ పొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో కడుపులో పిడిగుద్దులు గుద్దాడు. తర్వాత టీడీగూడూరు మండలం చిన్నతోపు వద్దకు స్కూల్‌ వ్యానును పిలిపించుకుని, మరోసారి వ్యానులో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించి యథావిధిగా స్కూల్‌ ముగిసే సమయానికి వ్యానులో ఇంటి వద్ద దింపేశారు. అయితే, బాలిక ప్రవర్తనపై అనుమానంతో ఏం జరిగిందంటూ తల్లి ఈ నెల 7న గట్టిగా నిలదీసింది. దీంతో జరిగిన దారుణాన్ని చిన్నారి ఆమెకు వివరించింది. దిగ్ర్భాంతికి గురైన తల్లి.. ఆదివారం తమకు ఫిర్యాదు చేయడంతో బాలికకు వైద్య పరీక్షలు జరిపించి, కేసు నమోదు చేశామని సీఐ వెల్లడించారు. నిందితులు నంబూరు సతీష్‌, కోవూరు సునీల్‌ కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నామని తెలిపారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 05:12 AM