ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట
ABN , Publish Date - Mar 25 , 2025 | 01:24 AM
ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలు వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థిక బకాయిలను చెల్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

విశ్రాంత ఉద్యోగుల బిల్లులు కూడా క్లియర్
జిల్లావ్యాప్తంగా వందలాది మందికి లబ్ధి
రూ.500 కోట్లకుపైగా జమయ్యే అవకాశం
మూడు రోజుల్లో చెల్లింపు ప్రక్రియ పూర్తి
ఒంగోలు కలె క్టరేట్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలు వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థిక బకాయిలను చెల్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న రూ.6,200 కోట్లను విడుదల చేయాలని సీఎం ఇటీవల ఆదేశించారు. తదనుగుణంగా సోమవారం నుంచి పెండింగ్ బకాయిలను ఆర్థికశాఖ విడుదల చేస్తోంది. అవి ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు రూ.500 కోట్లకుపైగా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఆర్థిక బకాయిలు జమకానున్నట్లు సమాచారం. ఈ మొత్తం మూడు రోజుల్లో పూర్తిగా చెల్లింపులు జరగనున్నట్లు తెలిసింది.
ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ఉన్న జీపీఐ, ఏపీజీఎల్‌ఐ బకాయిలతోపాటు రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బిల్లులను కూడా ఆర్థిక శాఖ నుంచి ట్రెజరీకి వెళ్లాయి. అక్కడి వారి అకౌంట్లలో జమ అవుతున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిన్నరలో ఉద్యోగ విరమణ చేసిన వారు వెయ్యి మందికిపైగా ఉండగా వందలాది మంది జీపీఎఫ్, ఎపీజీఎల్‌ఐ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ బిల్లులు కూడా ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక బకాయిల కోసం ఉద్యోగులు అనేక సార్లు రోడ్డెక్కినా పట్టించుకోలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సకాలంలో జీతాలు చెల్లింపుతోపాటు ఇప్పుడు ఆర్థిక బకాయిలు ఇస్తుండటంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.