చీరాలలో జోరందుకున్న క్రికెట్ బెట్టింగ్
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:11 PM
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఊపందుకున్నాయి. దాదాపుగా రెండు మాసాలు ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లను కొందరు వినోదం కోసం చూస్తుంటే.. మరి కొందరు సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఈక్రమంలో క్రికెట్ మ్యాచ్‌లను వేదికగా మలుచుకుని ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. అయితే అమాయకు ల ఆశలను ఆసరాగా చేసుకుని బుకీలు డబ్బులు దండుకుని సామాన్యులను మోసగిస్తున్నారు.

అత్యాశకు లోనై.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న యువత
రెండు నెలల్లో రూ. కోట్లల్లో పందేలు జరిగే అవకాశం!
పోలీసులు దృష్టి సారించకుంటే ప్రమాదమే
చీరాల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఊపందుకున్నాయి. దాదాపుగా రెండు మాసాలు ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లను కొందరు వినోదం కోసం చూస్తుంటే.. మరి కొందరు సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఈక్రమంలో క్రికెట్ మ్యాచ్‌లను వేదికగా మలుచుకుని ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. అయితే అమాయకు ల ఆశలను ఆసరాగా చేసుకుని బుకీలు డబ్బులు దండుకుని సామాన్యులను మోసగిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే ఈ రెండు మాసాల్లో చీరాల నియోజకవర్గ పరిధిలోని బెట్టింగ్‌లు రూ.కోట్లలో చేరే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. బెట్టింగ్ వ్యసనాలకు బానిసలుగా మారిన యువత, జూదరులు ఉన్న కాడకి ముట్ట చెప్పుకుంటున్నారు. హద్దు దాటాక వాహనాలు, స్థిరాస్తులు వంటివి సర్వస్వం వదిలేసుకుంటున్నారు. ఈక్రమంలో అప్పులు ఊబిలోకి చేరి ఐపీలు పెట్టడం, బలవన్మరణాలకు పాల్పడడం వంటి ఘటనలు మనం చూస్తున్నాం.
చాపకింద నీరులా..
బెట్టింగ్‌లు ఒకప్పుడు చీరాల పట్టణంలో లేదా పేరాల, వేటపాలెం, జాండ్రపేట, మండల పరిధిలోని ప్రధాన కేంద్రాలలోనే ఉన్నాయి. కానీ తాజాగా ఈ వ్యసనాలుకు గ్రామీణ యువకులు సైతం బానిసలుగా మారుతున్నారు. గతంలో ఆన్‌లైన్‌లో మాత్రమే బెట్టింగ్‌లు జరిగేవి. ఇప్పుడు సెల్‌ఫోన్ ఉన్న యువత వాట్సాప్, బెట్టింగ్ యాప్ వంటి వాటికి చేరువయ్యారు. దీంతో బంతి బంతికీ పందేలు కడతారు. చీరాల పరిధిలోని రిసార్ట్స్, లాడ్జీలు, బార్‌లు, ఎంజీసీ మార్కెట్ పరిధిలోని కొందరు యువత, విద్యార్థులు, క్రికెట్ వీరాభిమానులు బెట్టింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు వినిపిస్తుంది.
పాత, యాక్టివ్ పాత్రలపై దృష్టి సారించాలి
చీరాల పరిధిలో ఇప్పటికే జాండ్రపేటకు చెందిన ఓ వ్యక్తి అత్యున్నత స్థాయిలో బుకీగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పేరాలలో మరో ఇద్దరు, వేటపాలెం, జవహర్‌నగర్, ఈపూరుపాలెం, గ్రామీణంలో అక్కడక్కడా యువత బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. ఈక్రమంలో పోలీసులు బెట్టింగ్‌పై కచ్చితంగా దృష్టి సారించాల్సిందే. అలాగే పాత, కొత్తగా ఫీల్డ్‌లోకి రంగ ప్రవేశం చేసిన వారిపైనా కన్నేయాలి. లేకుంటే ఎందరో జీవితాలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదు. బుకీలకు పాల్పడే వారు ప్రత్యేకమైన ఫోన్ నెంబర్‌లను వాడుతున్నారు. మ్యాచ్ ప్రారంభమయ్యే అరగంట ముందు మాత్రమే ఆ నెంబర్‌ను వినియోగాస్తారు. మిగిలిన సమయమంతా ఆ నెంబర్ ఆఫ్‌లోనే ఉంటుంది. ఆన్ చేసిన సమయంలో గతంలో వారి వద్ద ఫీడ్ అయిన, వారి పాత పరిచయస్తుల నెంబర్‌లకు మాత్రమే ఆన్సర్ చేస్తారు. కొత్త నెంబర్‌లకు రెస్పాండ్ కాకుండా జాగ్రత్త పడతారు.
గతంలో అరకొర కేసులు
గతంలో చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జంజనం కాంప్లెక్స్‌లో యథేచ్ఛగా కొంతకాలం బెట్టింగ్ జరిగింది. దీంతో ఎట్టకేలకు పోలీసులు దాడులు నిర్వహించి వారిపై కేసులు నమోదు చేశారు. అలాగే టీవీతో పాటు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఆ స్టేషన్ పరిధిలో 2016, 2021 సంవత్సరాల్లో వేటపాలెంలో 2021, 23లో రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక చీరాల రూరల్, టూటౌన్ పరిధిలో కేసులే లేవు. ఈ మధ్య కాలంలో అసలు దాడులే చేయలేదు. దీంతో బెట్టింగ్ రాయుళ్లకు, బుకీలు పోలీసుల శైలిని అలుసుగా తీసుకొని వారి దందా కానిస్తున్నారు. ఏదేమైనా పోలీసులు ఈసారి క్రికెట్ బెట్టింగ్‌లపై కన్నెర్ర చేయకుంటే ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుంది.
ఆకస్మిక దాడులు
క్రికెట్ బెట్టింగ్‌లు జోరుకుందుంటున్న నేపథ్యంలో సోమవారం రాత్రి ట్రైనీ డీఎస్పీ అభిషేక్ ఈపురుపాలెం ఎస్‌ఐ చంద్రశేఖర్‌తో కలిసి రామాపురం, వాడరేవు తీరప్రాంతాల్లో లాడ్జిలు, రిసార్ట్స్‌లల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి రికార్డులను పరిశీలించి, అనుమానితుల వివరాలను తెలుసుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకులకు రూములు ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పూర్తి స్థాయిలో నిఘా
ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్‌లపై అవగాహన కార్యక్రమా లు నిర్వహించాం. అలాగే కొన్ని నిర్దేశిత ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో లావాదేవీల డేటాను సేకరిస్తున్నాం. నేరస్థులు తప్పించుకోలేరు. యువత ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి.
- ఎండీ మొయిన్, డీఎస్పీ, చీరాల