Share News

Language Politics : భారత్‌ భవిష్యత్తుపై రెండు దృక్కోణాలు

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:55 AM

తమిళనాడు పాలక పార్టీ నాయకులు, బీజేపీ రాజకీయవేత్తల మధ్య మాటల యుద్ధాన్ని రెండు భాషల (తమిళం, హిందీ) మధ్య పోరాటంగా పత్రికలలో చిత్రిస్తున్నారు. ఈ వర్ణన సరైనదే కానీ, సంపూర్ణమైనది కాదు.

Language Politics : భారత్‌ భవిష్యత్తుపై రెండు దృక్కోణాలు

మిళనాడు పాలక పార్టీ నాయకులు, బీజేపీ రాజకీయవేత్తల మధ్య మాటల యుద్ధాన్ని రెండు భాషల (తమిళం, హిందీ) మధ్య పోరాటంగా పత్రికలలో చిత్రిస్తున్నారు. ఈ వర్ణన సరైనదే కానీ, సంపూర్ణమైనది కాదు. విశదంగా చూస్తే అధికార భాషా చర్చ రెండు భిన్న భారత్‌ భావనలకు ప్రాతినిధ్యం వహిస్తోంది: మొదటి భావన రాజకీయాలలోను, సంస్కృతిలోను వైవిధ్యం, వ్యత్యాసాన్ని స్వాగతించేది కాగా రెండో భావన అవ్యక్త ఆదర్శం ‘ప్రమాణీకరణ, సజాతీయత, కేంద్రీకరణ’. తమిళనాడులో హిందీ పట్ల వ్యతిరేకతకు దశాబ్దాల చరిత్ర ఉన్నది. 1937లో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ దశల వారీగానే అయినప్పటికీ పాఠశాలల్లో హిందీ బోధనను తప్పనిసరి చేసింది. ఇందుకు కారకుడు అయిన నాటి మద్రాస్‌ ప్రధానమంత్రి (ముఖ్యమంత్రికి అప్పటి వాడుక అది) సి.రాజగోపాలాచారి ఆ తరువాత హిందీకి వ్యతిరేకమయ్యారు. 1950వ ఆరంభం నాటికే ఆయన, ఇప్పటి తమిళ రాజకీయవేత్తలవలే, మాతృభాషకు అదనంగా ద్వితీయ భాషనేదైనా బోధించవలసివస్తే అది ఇంగ్లీషే అవ్వాలి కాని, హిందీ కాకూడదని వాదించారు. 1965లో ప్రధానమంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రి హిందీని దేశవ్యాప్తంగా అధికార భాషగా అమలుపరిచేందుకు ప్రయత్నించారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఆంగ్లంలో కాకుండా హిందీలో జరగాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మద్రాసు రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆనాడు ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే హిందీ వ్యతిరేక ఆందోళనను తనకు అనుకూలంగా ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందింది. తమిళుల మనోభావాలను గాయపరిచిన హిందీ ఉత్తర్వును శాస్త్రి ఉపసంహరించుకున్నప్పటికీ కాంగ్రెస్‌ ప్రతిష్ఠకు తీరని విఘాతమేర్పడింది.


తమిళనాట దశాబ్దాలుగా ప్రాబల్య పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ 1967లో అధికారాన్ని కోల్పోయింది. తదాది తమిళనాడులో ఏదో ఒక ద్రావిడ పార్టీ మాత్రమే అధికారంలో ఉంటూ వస్తోంది. ఈ చరిత్ర అంతా ఎమ్‌కె స్టాలిన్‌, ఆయన సలహాదారులకు బాగా తెలుసు. హిందీ పట్ల తీవ్ర వ్యతిరేకత 1960ల్లో ఒక ఆధిపత్య రాజకీయ పార్టీని అధికారం నుంచి కూల్చి వేసినట్టుగానే ఇప్పుడు కూడా ఆ వ్యతిరేకత వర్తమాన ఆధిపత్య పార్టీని దూరంగా ఉంచుతుందనేది వారి సునిశ్చిత విశ్వాసం. తమిళనాడులో రాజకీయంగా విస్తరించి అధికార జయ పతాక నెగురవేసేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. నరేంద్ర మోదీ విశేష ప్రచారం కల్పించిన ‘కాశీ–తమిళ్‌ సంగమం’ కార్యక్రమం, కొత్త పార్లమెంటు భవనంలో ‘సెంగోల్‌’ ప్రతిష్ఠాపన, ఒక మాజీ ఐపీఎస్‌ అధికారిని తమిళనాడులో హిందూత్వ ఉద్ధారకుడుగా నిలబెట్టేందుకు బీజేపీ అగ్రనాయకత్వం వినియోగిస్తున్న శక్తియుక్తులను పరిశీలిస్తే తమిళనాట అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఎంతగా ఆరాటపడుతుందో అర్థమవుతుంది. హిందీ విధింపుపై తమిళనాడు వ్యతిరేకతకు రాజకీయ, సాంస్కృతిక ప్రాతిపదికలు ఉన్నాయి. అయినప్పటికీ మౌలిక రాజ్యాంగ స్ఫూర్తికి అది పూర్తిగా అనుకూలంగా ఉన్నది. 1976 వరకు విద్య రాష్ట్ర జాబితాలోని అంశంగా ఉండేది. అత్యవసర పరిస్థితి కాలంలో దానిని ఉమ్మడి జాబితాలో చేర్చారు. నిరంకుశపాలనలో ఏకపక్షంగా జరిగిన మార్పు అది. ఆ రాజ్యాంగ సవరణ ఆధారంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాను నిర్దేశించిన విద్యా విధానాన్ని అనుసరించి తీరాలని తమిళనాడును ఒత్తిడి చేస్తోంది.


లేనిపక్షంలో నిధులను ఉపసంహరించకుంటామని బెదిరిస్తోంది. తమిళనాడు వైఖరిని వ్యతిరేకిస్తున్నవారు వివిధ కమిషన్లు సిఫారసు చేసిన త్రిభాషా సూత్రాన్ని ప్రస్తావిస్తున్నారు. పాఠశాల బాలలు మాతృభాష, ఇంగ్లీష్‌తో పాటు మూడో భాషనూ నేర్చుకోవాలని ఆ సూత్రం ప్రతిపాదించింది. అయితే హిందీ రాష్ట్రాలలో మూడో భాషగా సంస్కృతాన్ని మాత్రమే బోధించడం జరుగుతోంది. యూపీ, బిహార్‌ల్లో ప్రభుత్వ పాఠశాలల్లో తమిళం లేదా కన్నడం లేదా బెంగాలీ లేదా మలయాళ భాషను ఎన్నడూ మూడో భాషగా బోధించిన దాఖలాలు లేవు. కనీసం మరాఠీ లేదా గుజరాతీని సైతం బోధించలేదు. ఈ త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు అమలుపరచలేదు. ఉత్తరాది రాష్ట్రాలలో అది ఆచరణలో ఎలా పరిణమించిందన్నది తమిళనాడు అభ్యంతరాలను ధ్రువపరిచింది. జాతీయ సమైక్యతను పెంపొందించడానికి బదులుగా ప్రభుత్వ ప్రాయోజిత హిందీ విస్తరణ వాదానికి త్రిభాషా సూత్రం ఒక అనుద్దేశపూర్వక సాధనమయింది. సరిగ్గా ఈ కారణంగానే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా త్రిభాషాసూత్రాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ విషయమై ప్రధానమంత్రి మౌనంగా ఉన్నప్పటికీ హోం మంత్రి మాత్రం విభిన్న రాష్ట్రాల మధ్య కమ్యూనికేషన్‌ మాధ్యమంగా హిందీ మాత్రమే ఉండాలని ఉంటుందని పదే పదే ఉద్ఘాటిస్తూ వస్తున్నారు. ఆంగ్లంలో మాట్లాడే భారతీయుల పట్ల తన అయిష్టతను సైతం ఆయన పదే పదే వ్యక్తం చేస్తూనే ఉన్నారు.


1965 నుంచి 2014 దాకా అర్ధ శతాబ్దం పాటు హిందీయేతర రాష్ట్రాలలో హిందీని ప్రోత్సహించేందుకు కేంద్రం శ్రద్ధగా ప్రయత్నించలేదు. అయినప్పటికీ హిందీ దేశ వ్యాప్తంగా వ్యాపించింది. అంతర్‌ రాష్ట్ర వలసలు, మరీ ముఖ్యంగా సినిమాలు, టీవీ మాధ్యమం ద్వారా ఆ భాషా వ్యాప్తి జరిగింది. బాంబే హిందీ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో ఉపయోగించే హిందీ మృదువైన, వ్యవహారిక హిందుస్థానీయే గానీ ఆకాశవాణి, ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలలో ఉపయోగించే సౌలభ్యమూ, సౌందర్యమూ కొరవడిన, మితిమీరిన స్థాయిలో సంస్కృతీకరణ అయిన హిందీ కాదు. మోహన్‌ భగవత్‌ ఇటీవల కేరళలో ఒక సమావేశంలో మాట్లాడుతూ హిందువులు ఆంగ్ల భాషను త్యజించాలని కోరారు. ఒకప్పుడు లోహియా వలే ఇప్పుడు ఆరెస్సెస్‌ అధినేత కడా ఇంగ్లీష్‌ను ఆంగ్ల మానస పుత్రులైన భారతీయుల భాషగా పరిగణిస్తున్నారు. వలసపాలన భావ దాస్యంలో ఉన్నవారు ఆ భాషను ఔదలదాలుస్తున్నారనేది వారి ఆరోపణ. ఇంగ్లీష్‌ త్వరలోనే భారత్ నుంచి బహిష్కృతమవుతుందని లోహియా భావించారు. ఆయన ఆశించినట్టు జరగ లేదు. ముఖ్యంగా 1990ల నుంచి ఇంగ్లీష్‌ శీఘ్రగతిన వ్యాప్తి చెందింది. ప్రభుత్వ ప్రాపకం ద్వారా కాకుండా ఇతరేతర రీతుల్లో అది వ్యాప్తి చెందింది. సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ ఇందుకొక ప్రధాన కారణం. మన ఇంజినీరింగ్‌ కళాశాలలు అన్నీ ఇంగ్లీష్‌లోనే బోధించడం వల్లే అది సంభవించింది. సామాజిక చలనశీలతకు మార్గంగా, వృత్తిపరమైన పురోగతికి సోపానంగా, విశాల ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఒక ప్రధాన గవాక్షంగా ఆంగ్ల భాష గుర్తింపు, ప్రాధాన్యాన్ని పొందింది.


ఆధునిక వృత్తులలోకి ప్రవేశించేందుకు దళితులు ఆంగ్ల భాషను నేర్చుకుని తీరాలని ప్రముఖ మేధావి చంద్రభాన్‌ ప్రసాద్ చాలా సంవత్సరాలుగా వాదిస్తున్నారు. ఆంగ్ల భాషలో ప్రావీణ్యాలు లేక పోవడం వల్లే ఆధునిక వృత్తులలో దళితుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని ఆయన విశ్వసిస్తున్నారు. ‘ఇంగ్లీష్‌ సివంగి పాలు వంటిది, ఆ పాలను తాగిన వారే గర్జించగలరన్న’ అంబేడ్కర్‌ మాటలను తన వాదనకు మద్దతుగా ఆయన తరచు ఉటంకిస్తుంటారు. మాతృభాషా అభిమానంతో కన్నడ సాహిత్యలోక దిగ్గజాలు పాఠశాలల్లో ఆంగ్ల భాషను బోధించ వద్దని విజ్ఞప్తి చేసినప్పుడు దళిత మేధావులు గర్హిస్తూ ఇలా ప్రతిస్పందించారు: తొలుత మీరు మాకు సంస్కృతాన్ని నిరాకరించారు. ఇప్పుడు ఇంగ్లీష్‌నూ అదే విధంగా నిరాకరిస్తున్నారు. మీ అగ్రకుల ప్రాముఖ్యాన్ని, నిలబెట్టుకునేందుకే మీరు ఇలా చేస్తున్నారు. నరేంద్ర మోదీ అధికారానికి రావడానికి ముందు కాలంలో హిందీ, ఇంగ్లీష్‌ రెండూ దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందాయి. వ్యాకరణ సమ్మతంగా రాయలేక పోయినప్పటికీ, స్ఫుటంగా మాట్లాడలేకపోయినప్పటికీ ఇప్పుడు చాలా మంది భారతీయులు ఆ రెండిటిలో ఏదో ఒక భాషను గానీ లేదా రెండిటినీ గానీ అర్థం చేసుకోగలుగుతారు. హిందీయేతరులు హిందీని, భారతీయులు ఇంగ్లీష్‌ను ఇలా ఆదరంగా స్వీకరించడమనేది స్వచ్ఛందంగా, స్వతస్సిద్ధంగా జరిగిందని చెప్పి తీరాలి.


ఇది దేశ ప్రజలపై రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా ఆరోగ్యకరమైన ప్రభావాన్ని చూపింది. విషాదేమేమిటంటే ఈప్రక్రియ మరింత ప్రగతిశీలంగా ముందుకు సాగకుండా సంఘ్‌ పరివార్‌ రాజ్యాధికారాన్ని ఉపయోగించి ఆంగ్లాన్ని అణచివేసి హిందీని సర్వత్రా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. హిందువులు మాత్రమే ఈ దేశ సహజ పౌరులు అన్న వారి సంకుచిత విశ్వాసం వల్లే ఇలా వ్యవహరించడం జరుగుతోంది. భాషా రంగంలో జాతీయ సమైక్యతకు హిందీ ఉపయోగపడుతుందని వారు విశ్వసిస్తున్నారు. హిందువులే ఈ దేశ నిజమైన పౌరులు అని చెప్పుతూ భారతీయ ముస్లింలను తులనాడుతూ అణచివేసేందుకు మోదీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న ప్రయత్నాలను ఇదే కాలమ్‌లో గతంలో పలుమార్లు వివరించాను. అయితే నేను తమిళనాడులో ఓటు వేయడం లేదు. కుటుంబ పాలన విషయంలో కాంగ్రెస్‌కు తీసిపోని డీఎంకే పట్ల నాకు అభిమానమూ లేదు, నేను ఆ పార్టీ పక్షపాతినీ కాను. అధికార భాషపై ఘర్షణ రెండు పాలక పార్టీల మధ్య కాదు, అది మన దేశం గురించిన రెండు దృక్కోణాల మధ్య ఘర్షణ. వాటిలో ఒకటి– వస్త్రధారణ, ఆహార అలవాట్లు, వివాహ బంధం, దైవ ప్రార్థన విషయంలో భారతీయుల స్వేచ్ఛను సమర్థించేది, సంపూర్ణంగా ప్రోత్సహించేదికాగా మరొకటి ఆ స్వేచ్ఛ స్థానంలో అన్నిరకాల నిర్దేశాలు, నిషిద్ధాలు విధించేది.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Mar 22 , 2025 | 04:56 AM