పరిశ్రమ పండుగ
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:44 PM
ఇప్పటివరకూ చూడని పెద్దపెద్ద కార్లతో, ప్రముఖుల రాకతో గ్రామాల్లో సందడి నెలకొంది. రయ్‌రయ్‌మంటూ అధికార యంత్రాంగం సైతం పరుగులు పెడుతోంది. ఊళ్లకు మంచి రోజులొచ్చాయని కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండల వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇంతకు విషయం ఏంటంటే... రాష్ట్రంలో తొలిసారిగా పశ్చిమ ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం కీలక ప్రాజెక్టును మంజూరు చేసింది.

మాఊళ్లకు మంచి రోజులొచ్చాయి..!
చిగురిస్తున్న పశ్చిమప్రాంత ప్రజల ఆశలు
రాష్ట్రానికే తలమానికంగా బయోగ్యాస్ ప్లాంట్
శంకుస్థాపనకు వేగంగా జరుగుతున్న ఏర్పాట్లు
దగ్గరుండి పనులను సమీక్షిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్
పీసీపల్లి ప్రజల్లో ఆనందం
వచ్చే నెల 2వ తేదీన మంత్రులు లోకేష్, అనంత్ అంబానీ రాక
ఇప్పటివరకూ చూడని పెద్దపెద్ద కార్లతో, ప్రముఖుల రాకతో గ్రామాల్లో సందడి నెలకొంది. రయ్‌రయ్‌మంటూ అధికార యంత్రాంగం సైతం పరుగులు పెడుతోంది. ఊళ్లకు మంచి రోజులొచ్చాయని కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండల వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇంతకు విషయం ఏంటంటే... రాష్ట్రంలో తొలిసారిగా పశ్చిమ ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం కీలక ప్రాజెక్టును మంజూరు చేసింది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఆధ్వర్యంలో వెంగళాయపల్లి పంచాయతీ పరిధిలోని దివాకరపల్లి సమీపంలో ఇంటిగ్రేటెడ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. అందుకోసం దాదాపు 2వేల ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటికే 1200 ఎకరాలను అధికారులు గుర్తించి సిద్ధం చేస్తున్నారు. అందులో దాదాపు రూ.130 కోట్లకుపైగా వెచ్చించి ఆయా భూమిలో 6 ప్లాంట్‌ల ఏర్పాటు కోసం పనులు వేగంగా చేపట్టారు.
కనిగిరి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పశ్చిమప్రాంతంలో అత్యంత వెనుకబాటుకు గురైన కనిగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా తొలిసారి అతిపెద్ద సంస్థ రిలయన్స్ సంస్థ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావటం విశేషం. ఇది శుభపరిణామంగా అటు రాజకీయ విశ్లేషకులు, ఇటు కనిగిరి ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటులో ఎమ్మెల్యే చొరవ, కృషితోపాటు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహకారం ఎంతో ఉంది. ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా కనిగిరిలో పర్యటించిన మంత్రి లోకేష్ నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజలు వలస జీవితాలతో మగ్గుతున్నట్లు గుర్తించారు. సరైన వర్షాలు, భూగర్భ జలాలు లేక వ్యవసాయం పూర్తిగా కుంటుపడిపోయిందని, ప్రజలకు వలస బాటే శరణ్యంగా మారిందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర లోకేష్‌కు విన్నవించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే భూములన్నీ సస్యశ్యామలం అవుతాయని, పరిశ్రమలు ఏర్పాటైతే ఉపాధి లభించి ప్రజల వలసలు ఆగుతాయని లోకేష్ గుర్తించారు. వెలిగొండ పూర్తయ్యేలోపు పరిశ్రమల స్థాపన కూడా జరిగితే ప్రజలకు మేలు చేకూరుతుందని భావించిన లోకేష్ రాష్ట్రంలో కనిగిరి ప్రాంతంలోనే బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
పశ్చిమ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురింపు
కనిగిరి ప్రాంతంలో దశాబ్దకాలంగా అభివృద్ధి కుంటుపడిందనే చెప్పాలి. ఆ కొద్దిపాటి అభివృద్ధి కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అప్పట్లో నిమ్జ్ ఏర్పాటు కాబోతుందని ప్రజలు బాగా నమ్మారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అది ఆలస్యం కావటంతో అందరూ మదనపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే పారిశ్రామిక సంస్థలు కనిగిరి ప్రాంతంలో ఏర్పాటుకు అడుగులు వేశాయి. అందులోభాగంగా బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు చకచకా పనులు జరుగుతున్నాయి. ఎంతోమందికి ఉపాధితోపాటు రైతుల భూములు వినియోగంలోకి వచ్చి ఆదాయం తెచ్చేపెట్టే మార్గం ఏర్పడింది.
శరవేగంగా విద్యుత్ లైన్ల పనులు
శంకుస్థాపనకు సిద్ధం కాబోతుండటంతో ఆ ప్రాంతానికి వెలుగులొచ్చాయి. దివాకరపల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల మేర పెద్ద పెద్ద విద్యుత్ స్తంభాలు వేసి పనులు చేపడుతున్నారు. రెండు త్రీఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాత్రింబవళ్లు పనులు చేసేందుకు అవసరమైన వెలుతురు కోసం బిగించిన ఫ్లడ్ లైట్‌లకు ప్రత్యేకంగా మరో సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వేగంగా జరుగుతున్న పనులను చూస్తున్న ప్రజలు తమకు ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖల రాకతో సందడే సందడి
పీసీపల్లి మండలంలోని వెంగళాయపల్లి పంచాయతీలో దివాకరపల్లి సమీపంలో ఏర్పాటయ్యే బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కోసం పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో నాయకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పెద్ద, పెద్ద కార్లు, వాహనాలలో నిత్యం తిరుగుతుండటంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. కనిగిరి నుంచి పీసీపల్లి మండల కేంద్రానికి 25 కి.మీ ఉంది. అక్కడి నుంచి దివాకరపల్లి వరకు 4 కి.మీ, అక్కడి నుంచి ప్లాంట్ ఏర్పాటు చేసే భూమి వద్దకు మరో 4కి.మీ ఉంటుంది. దీంతో మొత్తం 33 కి.మీ నిత్యం వాహనాల రాకపోకలు పెరిగాయి. మారుమూల ప్రాంతంగా ఉన్న పీసీపల్లికి ఇటీవలి వరకు చెప్పుకోదగ్గ వాహన రాకపోకలు జరగలేదు. ప్రస్తుతం బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుతో శరవేగంగా పనులు జరుగుతుండటంతో ప్రముఖులు వచ్చిపోతుంటే ఆయా ప్రాంత ప్రజల్లో ఆనందంతోపాటు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
అనంత్ అంబానీ, లోకేష్ రాక
రిలయన్స్ లాంటి పెద్ద పారిశ్రామిక సంస్థ కనిగిరి ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఏప్రిల్ 2న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి ముఖేష్ అంబాని కుమారుడు అనంత్ అంబానితోపాటు మంత్రి లోకే్‌షతోపాటు వస్తున్నారు. ఇక్కడ నిమ్జ్ పరిశ్రమ ఏర్పాటు, ఇతర సోలార్ లేదా పునరుత్పాదన ఇంధనంతో కూడిన ప్లాంట్ ఏర్పాటుకు సుగమంగా మారుతుందని చర్చ జరుగుతోంది. కనిగిరి ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటుకు 475 ఎకరాలు కేటాయించగా, ఇంకా విస్తరణ పనులు జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.