అర్హత ఉన్న వారందరికీ రుణాలివ్వాలి
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:47 PM
కేవలం లక్ష్యాలకు పరిమితం కాకుండా.. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన అందరికీ రుణాలు ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు.

కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 27(ఆంఽధ్రజ్యోతి): కేవలం లక్ష్యాలకు పరిమితం కాకుండా.. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన అందరికీ రుణాలు ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో గురువారం జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి రుణ పంపిణీపై సమీక్ష చేసి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో పశుపోషణ, మత్స్య, వ్యవసాయ ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ అవకాశాలు ఉన్నందున పెద్దఎత్తున రుణాలు ఇవ్వాలన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త రావాలన్నది సీఎం లక్ష్యమని, ఈ దిశగా ప్రభుత్వ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని రుణాలు మంజూరుచేయాలని చెప్పారు. ఎల్‌డీఎం రమేష్ మాట్లాడుతూ పరిశ్రమలు, అనుబంధ రంగాలకు ఈ వార్షిక ప్రణాళికలో 2024 డిసెంబరు 31 నాటికి 91.99 శాతం సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు 88.72శాతం రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలోని స్వయం సహాయక సంఘాలకు లక్ష్యానికి మించి నాలుగు రెట్లు రుణాలు మంజూరు చేశామన్నారు. డీఆర్‌డీఏ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు 83శాతం రుణాలు ఇచ్చామని, మహిళా పారిశ్రామికవేత్తలకు 71శాతం రుణాలు ఇచ్చామన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాల మంజూరుకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ దరఖాస్తుదారులకు సాంకేతిక కారణాలను చూపిస్తూ రుణాల మంజూరులో జాప్యం చేయవద్దన్నారు. సమావేశంలో ఆర్‌బీఐ అధికారి రోహిత్ అగర్వాల్, నాబార్డు డీడీఎం రవికుమార్, డీఏవో శ్రీనివాసరావు, వివిధశాఖల అధికారులు శ్రీనివాసరావు, నారాయణ, శ్రీనివాసప్రసాద్, సుజన్‌కుమార్, అర్చన, ధనలక్ష్మి, అర్జున్‌నాయక్, రవితేజ, రూడ్‌సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, రఘునంద పాల్గొన్నారు.