పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టేదీ
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:37 PM
ఆస్తి పన్నుల వసూళ్లలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్కాపురం మున్సిపాలిటీ వెనుకబడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పన్నులపై రాబడిని పెంచేందుకు బకాయిలపై 50 శాతం మేర వడ్డీ రాయితీ ఇచ్చింది. అయినా వసూళ్లలో పెద్దగా మార్పు రాలేదు. గతేడాదితో పోల్చితే కొంతమేర మాత్రమే పన్నుల వసూళ్లు పెరిగాయి. గత వైసీపీ పాలనలో ఐదేళ్లు పన్నుల వసూళ్లపై పెద్దగా దృష్టిసారించింది లేదు.

రూ.4.58 కోట్ల మేర బకాయిలు
సమస్యలతో అల్లాడుతున్న శివారు కాలనీలు
మార్కాపురం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ఆస్తి పన్నుల వసూళ్లలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్కాపురం మున్సిపాలిటీ వెనుకబడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పన్నులపై రాబడిని పెంచేందుకు బకాయిలపై 50 శాతం మేర వడ్డీ రాయితీ ఇచ్చింది. అయినా వసూళ్లలో పెద్దగా మార్పు రాలేదు. గతేడాదితో పోల్చితే కొంతమేర మాత్రమే పన్నుల వసూళ్లు పెరిగాయి. గత వైసీపీ పాలనలో ఐదేళ్లు పన్నుల వసూళ్లపై పెద్దగా దృష్టిసారించింది లేదు. దీంతో మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో పట్టణ ప్రజలు ఆదరించారు. వారి ఆశలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే తగినన్ని నిధులు అందుబాటులో ఉండాలి. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన నిధులతో మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైన్లు, పారిశుధ్యం, తాగునీటి నిర్వహణ తదితర పనులకు ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. మున్సిపాలిటీ యంత్రాంగం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించిన దాఖలాలు కనిపించలేదు.
60 శాతంలోపే పన్ను వసూళ్లు
మార్కాపురం మున్సిపాలిటీలో మొత్తం 18,345 అసె్‌సమెంట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం డిమాండ్ బకాయిలతో కలిపి రూ.11.20 కోట్లు పన్నులు వసూలు చేయాల్సిఉంది. కానీ మార్చి నెలాఖరుకు రూ.6.62 కోట్ల మేర మాత్రమే వసూలయ్యాయి. మొత్తం మీద 59.13 శాతం మేర వసూళ్లు సాధించారు. ఇంకా బకాయిలు రూ.4.58 కోట్ల మేర ఉన్నాయి. వాస్తవానికి గత ఐదేళ్లలో సక్రమంగా పన్నుల వసూళ్లు చేయక 2024-25 ఆర్థిక సంవత్సరానికి ముందు మొత్తం రూ.4.27 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయి. వాటికి సంబంధించి ప్రత్యేక దృష్టిపెట్టామని మున్సిపాలిటీ రెవెన్యూ విభాగం చెబుతున్నా వసూలు చేసింది రూ.1.21 కోట్లు మాత్రమే. పాత బకాయిలు ఇంకా రూ.3.06 కోట్లు వసూలు చేయాల్సిఉంది. పాత బకాయిల వసూళ్ల కోసం ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇచ్చినా 32 శాతం మేర మాత్రమే వసూలు చేయగలిగారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.6.93 కోట్లు డిమాండ్ ఉండగా రూ.5.41 కోట్లు వసూలు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించే రూ.1.52 కోట్ల మేర బకాయి పడినట్లు అయింది.
- రోడ్లు, డ్రైన్లు లేక శివారు కాలనీలు విలవిల
మార్కాపురం మున్సిపాలిటీలో ప్రధాన పట్టణం మినహా శివారు కాలనీల్లో పక్కా రోడ్లు, డ్రైన్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 12వ వార్డు మొదలుకొని 17వ వార్డు వరకు, 27వ వార్డు నుంచి 32 వార్డు వరకు, 2, 3వ వార్డుల్లో మౌలిక వసతులు మృగ్యంగా మారాయి. ఆయా వార్డుల్లో సుమారు 60 శాతం మేర పక్కా రోడ్లు, డ్రైన్లు లేవు. వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు వచ్చే పరిస్థితి ప్రస్తుతం కనిపించడంలేదు. పన్నుల రూపంలో సక్రమంగా వసూళ్లు సాధిస్తే ఆయా వార్డుల్లో మున్సిపాలిటీ సాఽధారణ నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టేందుకు వెసులుబాటు కలిగేది. మున్సిపాలిటీ యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితంగా పన్ను వసూళ్లు సక్రమంగా లేక అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవరోధం ఏర్పడుతోంది.