Share News

Rayalaseema Lift Irrigation: సీమ కంట్లో జగన్‌ కారం!

ABN , Publish Date - Mar 22 , 2025 | 05:24 AM

కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూ రు జిల్లాలను కరువురహితం చేసి. 19 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకంటూ రూ.3,278 కోట్ల అంచనా వ్యయంతో ఈ స్కీంకు పాలనానుమతి ఇచ్చేశారు. అధ్యయనం చేయలేదు. ప్రాజెక్టు డిజైన్లే రూపొందించలేదు. పర్యావరణ మదింపు కూడా చేయలేదు.

Rayalaseema Lift Irrigation: సీమ కంట్లో జగన్‌ కారం!

సాంకేతిక అధ్యయనం లేకుండానే సీమ ఎత్తిపోతలకు నాడు పాలనామోదం

డీపీఆర్‌ సిద్ధం కాకుండానే జీవో జారీ

పర్యావరణ అనుమతులూ తీసుకోలేదు

దీంతో 2020 అక్టోబరు 19న ఎన్‌జీటీ స్టే

పర్మిషన్‌ ఇచ్చేది లేదని తాజాగా తేల్చేసిన ఈఏసీ

ఆ పాపం కూటమిపై నెట్టేందుకు జగన్‌ యత్నం

నీలి మీడియాతో విషపు రాతలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాజకీయ ప్రయోజనాల కోసం నాటి సీఎం జగన్‌ 2020 ఆగస్టులో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూ రు జిల్లాలను కరువురహితం చేసి. 19 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకంటూ రూ.3,278 కోట్ల అంచనా వ్యయంతో ఈ స్కీంకు పాలనానుమతి ఇచ్చేశారు. అధ్యయనం చేయలేదు. ప్రాజెక్టు డిజైన్లే రూపొందించలేదు. పర్యావరణ మదింపు కూడా చేయలేదు. అసలు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)నే తయారుచేయకుండా జీవో జారీచేసేశారు. శ్రీశైలం జలాశయం ఎగువన 800 అడుగుల్లో సంగమేశ్వరం వద్ద నుంచి కుడి ప్రధాన కాలువలోకి రోజుకు టీఎంసీ చొప్పున నీటిని ఎత్తిపోస్తామని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)ను ఆశ్రయించారు. పర్యావరణంతోపాటు ఎలాంటి అనుమతులూ లేకుండా ఏకంగా పనులే చేపట్టారని తెలిపారు. అయితే ఎలాంటి పనులూ చేయడం లేదని.. డీపీఆర్‌ తయారీ కోసమే తవ్వకాలు సాగిస్తున్నామని జగన్‌ సర్కారు బుకాయించింది. దీనిపై సర్వేకు ఎన్‌జీటీ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు కావాలని స్పష్టం చేసింది. దీంతో సీమ స్కీంపై ఎన్‌జీటీ స్టే విధించింది. కేంద్ర అటవీ శాఖ అనుమతులు పొందాకే పనులు చేపట్టాలని 2021 డిసెంబరులో మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఆ తర్వాత మూడేళ్లు అధికారంలో ఉన్న జగన్‌.. ఆ స్టే ఉత్తర్వులు ఎత్తివేయించేందుకు ప్రయత్నించలేదు. కనీసం కేంద్ర శాఖలతో సంప్రదింపులు జరుపలేదు. ఇప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని పర్యావరణ మదింపు కమిటీ అనుమతిచ్చేది లేదని తేల్చిచెప్పడంతో కూటమి ప్రభుత్వంపై నెపం మోపాలని చూస్తున్నారు.


పుట్టినగడ్డనే మోసగించారు. ముందస్తు అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించారు.. ఆనక ఎన్‌జీటీ దానిని నిలిపివేస్తే.. స్టే ఎత్తివేయించేందుకు ఏ దశలోనూ ప్రయత్నించలేదు. ఫలితంగా ఆ పథకానికి పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్రం తాజాగా తేల్చిచెప్పింది. దీంతో సీమ కరువును పారదోలడానికే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టానంటూ జగన్‌ ఆడిన డ్రామా బయటపడింది. దీని నుంచి జనం దృష్టి మళ్లించేందుకు.. కూటమి ప్రభుత్వం వల్లే పథకం ఆగిపోయిందంటూ తప్పుడు కథనాలను నీలి మీడియాలో వండివారుస్తున్నారు.

ఈ ప్రశ్నలకు బదులేది?

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్‌ విమర్శలను సాగునీటి రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. పర్యావరణ అనుమతుల కోసం తన హయాంలో మాజీ సీఎం ఎందుకు ప్రయత్నించలేదని నిలదీస్తున్నారు. పూర్తి నిర్తక్ష్యం వహించడంపై రాష్ట్రానికి సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. పుట్టిన గడ్డకు ద్రోహం చేసిన ఆయన.. సీమ ప్రజలకు క్షమాపణలు కోరాలని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అంటున్నారు. నిపుణులు ఈ సందర్భంగా జగన్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు.

నాటి సీఎం కేసీఆర్‌ పిలువగానే.. రాష్ట్రానికి అన్యాయం చేసేలా గోదావరి నదిపై తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి జగన్‌ 2019 జూన్‌ 21న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలంగాణ సీఎంతో సామరస్యంతో ఉంటున్నామని సమర్థించుకున్న ఆయన.. మరి తన ప్రాంతానికి న్యాయం చేసే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మద్దతివ్వాలని కేసీఆర్‌ను నాడెందుకు కోరలేదు?

రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణ ఆచరణలో అనుసరించాల్సి సాంకేతిక, పాలనా విధానాలను ఎందుకు పాటించలేదు? డీపీఆర్‌ రూపొందించకుండానే రూ.3,278 కోట్లకు పాలనామోదం ఎలా ఇచ్చేశారు?

పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టును చేపట్టవద్దంటూ ఎన్‌జీటీ ఆదేశించినా.. కాంట్రాక్టు సంస్థలతో ఎలా ఒప్పందం చేసుకున్నారు? 2020 అక్టోబరు 19న ఎన్‌జీటీ ఆదేశాలు ఇస్తే.. తొమ్మిది నెలలు నిద్రపోయి.. 2021 జూన్‌ 8వ తేదీన పర్యావరణ ఆమోదం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలోనే పథకంపై మీకున్న శ్రద్ధ ఏపాటిదో తేలిపోయింది.


జగన్‌ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై 2021 జూన్‌ 17వ తేదీన.. 2021 జూలై 19వ తేదీన పర్యావరణ మదింపు కమిటీ (ఈఏసీ) చర్చించి మరింత సమాచారం కావాలని కోరింది. డీపీఆర్‌ కూడా సమర్పించాలని కోరింది. సకాలంలో సమాచారం ఇవ్వకపోవడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రాజెక్టు ప్రతిపాదనల జాబితా నుంచి ఈఏసీ తొలగించడం నిజం కాదా?

ఇది జరిగిన ఏడాది తర్వాత 2023 సెప్టెంబరు 20న గుర్గామ్‌కు చెందిన ఓయెంట్స్‌ సొల్యూషన్స్‌ సంస్థకు డీపీఆర్‌ బాధ్యతలను అప్పగించింది. ఆ డీపీఆర్‌ను ఈఏసీకి పంపగా.. సీమ ఎత్తిపోతల స్కీంను 2023 నవంబరు 11వ తేదీన తన ప్రాజెక్టుల జాబితాలో ఉంచింది. ఆ తర్వాత ఎన్‌జీటీ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టారంటూ 2024 మార్చి 13వ తేదీన రాష్ట్రప్రభుత్వంపై రూ.2.65 కోట్ల జరిమానా విధించింది. ప్రాజెక్టుల జాబితా నుంచి దీనిని మళ్లీ తొలగించింది. తద్వారా రెండుసార్లు డీలిస్ట్‌ అయిన తొలి ప్రాజెక్టుగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నమోదు కావడం వాస్తవం కాదా?

డీపీఆర్‌ కోసమే రూ.883 కోట్లతో పంప్‌హౌస్‌ పనులు, మెషినరీ కొనుగోలు చేశామంటూ ఎన్‌జీటీ ముందు బుకాయించలేదా? రూరల్‌ ఎలక్ట్రికల్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) నుంచి రూ.740 కోట్ల రుణం తీసుకోవడం, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా బలమైన వాదనలను ఎన్‌జీటీలో వినిపించేందుకు సమర్థులైన సీనియర్‌ న్యాయవాదులను నియమించకపోవడం నిజం కాదా?

తాగునీటి అవసరాలకు ఈఏసీ ఆమోదం అక్కర్లేదని తెలిసినా మూడేళ్లు నిద్రపోయి ఎన్నికల ముందు 2023 ఆగస్టు 11వ తేదీన ప్రాజెక్టును తాగునీటి అవసరాలకు కుదిస్తూ పాలనామోదం ఇవ్వడం నిజం కాదా?


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 05:24 AM