Share News

Sudden Heart Attack: గుండె ఆగిపోతోంది.. జాగ్రత్త

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:02 AM

ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి, ముఖ్యంగా 40 ఏళ్లలోపు వారిలో. ఈ పరిస్థితికి జీవనశైలి మార్పులు, కోవిడ్‌ ప్రభావం, ఆరోగ్య సమస్యల నిర్లక్ష్యం ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.

Sudden Heart Attack: గుండె ఆగిపోతోంది.. జాగ్రత్త

దేశంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు ప్రపంచవ్యాప్తంగా 38 సెకన్లకు ఒకరు మృతి

రాష్ట్రంలోనూ అధికమైన ఆకస్మిక మరణాలు

40 ఏళ్లలోపు వారికీ ఆగుతున్న గుండె

కొవిడ్‌ తర్వాత పెరిగిన హార్ట్‌ ఎటాక్‌లు

అధిక స్టెరాయిడ్స్‌ వాడకంతో గడ్డకడుతున్న రక్తం

సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వాలని గుండె వైద్యుల సూచన

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ఆకస్మిక గుండెపోటు మరణాలను పరిశీలిస్తే ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువ గా ఉంటోంది. సాధారణంగా గుండెపోటు వచ్చే ముం దు ఛాతిలో విపరీతమైన నొప్పి, గుండెల్లో, గొంతులో మంట, కొంతదూరం నడిచినా ఆయాసం రావడం, ఎడమ చేయి బాగా లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే 40 శాతం మందిలో ఈ లక్షణాలేమీ లేకుండానే గుండెపోటుకు గురవుతున్నారు. 15 శాతం మంది మాత్రం జన్యుపరమైన సమస్యలతో గుండెపోటుకు గురవుతున్నారు. అయితే చాలామంది బీపీ, షుగర్‌ ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఆహార నియంత్రణ లేకపోవడం, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తిన డం, వ్యాయామం లేకపోవడం, ధూమ, మద్యపానం కారణంగా సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ కారణాలతో ఆకస్మిక గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో గుండెపోటు మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

కొవిడ్‌ ఒక కారణం...

కొవిడ్‌ తర్వాత గుండె సమస్యలు పెరిగాయని వైద్యులు నిర్ధారిస్తున్నారు. కొవిడ్‌ బారినపడిన వారిలో, వ్యాక్సిన్లు వేయించుకున్న కొద్ది మందిలో గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు కొవిడ్‌ సమయం లో అధిక మోతాదులో స్టెరాయిడ్స్‌ ఉపయోగించడం కూడా పెద్ద సమస్యగా మారింది. స్టెరాయిడ్స్‌ తీసుకున్నవారికి షుగర్‌, బీపీ వంటి సమస్యలు వచ్చాయి. ఈ విషయం తెలియక చాలా మంది ఎప్పటిలానే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి వారిలో రక్తం చిక్కగా మారి అకస్మాత్తుగా గడ్డకడుతోంది. దీంతో ఆ భారం గుండెపై పడి చాలా మంది మృత్యువాతపడుతున్నారు. ఇలాంటి వాటిని నివారించాలంటే ప్రతి ఏటా కచ్చితంగా హెల్త్‌ చెక్‌పలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


వ్యాయామంతో చెక్‌..

గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల నివారణ కు వ్యాయామం తొలి మందు. ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ వ్యాయామంతో పాటు వాకింగ్‌ చేయాలి. వాకింగ్‌ చేసేవారి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ బ్లాక్స్‌ పెరిగే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా షుగర్‌ వ్యాధిగ్రస్తుల్లో రక్తనాళాలు సన్నబడి రక్తప్రసరణకు అవరోధం ఏర్పడుతుంది. షుగర్‌ రోగులు ప్రతి రోజు 45 నిముషాల పాటు వ్యాయామం చేయాలని, అలా చేస్తే బ్లాక్స్‌ ఏర్పడే అవకాశం తగ్గుతుందని సూచిస్తున్నారు.

బేసిక్‌ సీపీఆర్‌పై శిక్షణ..

గుండెపోటుకు గురైన వారిని సీపీఆర్‌ ద్వారా కొంత వరకూ రక్షించవచ్చు. దీనివల్ల ఆకస్మిక మరణాలను తగ్గించే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఒక్కరికీ బేసిక్‌ సీపీఆర్‌ శిక్షణ ఇస్తారు. భారత్‌లో దీనిపై అవగాహన కల్పించడం లేదు. గుండెపోటుకు గురైనవారికి ఛాతిపై నొక్కుతూ నోటి ద్వారా గాలిని అందిస్తే ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేయవచ్చు. బేసిక్‌ సీపీఆర్‌ శిక్షణపై ప్రభుత్వాలు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.

వ్యక్తిగత జాగ్రత్తలు

ప్రస్తుతం ఉద్యోగ, వ్యాపారాల్లో పని ఒత్తిడి అధికంగా ఉంటోంది. గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండాలంటే పనిఒత్తిడి తగ్గించుకోవాలి. ఒత్తిడి నివారణ వ్యాయామం చేయాలి. తగినంత సమయం నిద్రకు కేటాయించాలి. ధూమ, మద్యపానం అలవాటు తగ్గించుకోవాలి. ఆహారపు అలవాట్లను మా ర్చుకోవాలి. మాంసాహారం తక్కువ తినాలి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. నూనె తగ్గించాలి.


తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద లక్ష్మీపురం గ్రామస్థులు ఆన్‌లైన్‌ విషయమై సర్వేయర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో పొలం యజమాని వెంకటరావుకు(47) అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు.

తిరుపతి జిల్లా వడమాలపేట ఎఎస్సై... బైక్‌పై వస్తుండగా ఉన్నట్టుండి గుండె పోటు వచ్చింది. దీంతో డ్రైవింగ్‌ చేస్తున్న కానిస్టేబుల్‌ బైక్‌ను కంట్రోల్‌ చేయలేక ఇద్దరూ కిందపడిపోయారు. అంబులెన్స్‌ వచ్చేలోపు ఎఎస్సై మరణించారు.

కానిస్టేబుల్‌ సెలెక్షన్స్‌లో భాగంగా నిర్వహించిన పరుగు పందెంలో ఒక అభ్యర్థి పరిగెత్తుతూ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.

గుండెపోటు మరణాలకు భారత్‌ కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలుస్తోంది! ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.86 కోట్ల మంది గుండెపోటుతో మరణిస్తుంటే.. అందులో భారత్‌లోనే 25 శాతం మంది ఉంటున్నారు. వీరిలో 40 ఏళ్లలోపు వారు అధికంగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి 38 సెకన్ల కు ఒకరు గుండెపోటుతో మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలోనూ మరణాలుపెరుగుతున్నాయి.


గుండెపోటుకు కారణాలు..

వయసు పెరగడం, కొలెస్ట్రాల్‌ ఎక్కువవడం, ఊబకాయం.

వారసత్వంగా వచ్చే సమస్యలు

ధూమపానం, మద్యపానం చేయడం

కొవిడ్‌ ప్రభావం, స్టెరాయిడ్స్‌ అధిక వినియోగం

ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ప్రోటీన్‌ తగ్గుదల

గుండె సమస్యను గ్యాస్‌ అనుకోవద్దు

చాలామంది గుండె సమస్యను గ్యాస్‌ అనుకుని ఇంటి వద్ద వాకింగ్‌ చేస్తూ, గ్యాస్‌ నియంత్రణ మాత్రలు వేసుకుంటున్నారు. గోల్డెన్‌ అవర్‌ అనేది చాలా కీలకం. ఆ సమయంలో ప్రాథమిక చికిత్స అందించకపోతే హార్ట్‌లో మజిల్‌ డ్యామేజ్‌ అవుతుంది. గుండెపోటు వచ్చిన గంటలోపు ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలి. గోల్డెన్‌ అవర్‌లో ప్రైమరీ యాంజియో ప్లాస్టీ చేస్తే గుండెకు రక్షణ కలగడంతో పాటు జీవన ప్రమాణం పెరుగుతుంది. క్రీడాకారులకు, కానిస్టేబుల్‌, ఎస్సై ఎంపికలో నిర్వహించే పరీక్షలకు ముందు ప్రతి ఒక్కరికీ ఈసీజీతో పాటు గుండె పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల ఆకస్మిక మరణాలను నివారించవచ్చు.

డా. శ్రీమన్నారాయణ, చీఫ్‌ కార్డియాలజిస్ట్‌, సెంటిని హాస్పిటల్స్‌, విజయవాడ


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 10:17 AM