SC Categorization: ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్!?
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:49 AM
ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది.

ఉభయ సభల్లో తీర్మానంపై ‘హైడ్రామా’
మండలిలో వైసీపీ సహాయ నిరాకరణ
తీర్మానానికి చైర్మన్ మోషేన్ రాజు ‘నో’!?
నివేదికను తాను చదవాలని పట్టు
చర్చ కూడా జరపకుండా వాయిదా
మండలిలో వైసీపీకే మెజారిటీ
తీర్మానం ఆగిపోతే వర్గీకరణకు బ్రేకులే
దీంతో వ్యూహం మార్చిన పాలక పక్షం
అసెంబ్లీకి నివేదిక సమర్పణ, లఘు చర్చ
సిఫారసుల సారాంశం జాతీయ కమిషన్‌కు!
ప్రోరోగ్ కాగానే ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ!
ఎస్సీ వర్గీకరణపై చట్టసభల్లో తీర్మానం చేయకుండా వైసీపీ కుయుక్తులు పన్నింది. మండలిలో తనకున్న బలాన్ని అడ్డుపెట్టుకుని... అసలు వర్గీకరణ ప్రక్రియకే బ్రేకులు వేయాలని భావించింది. కానీ... పాలకపక్షం అప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ‘ఆర్డినెన్స్’ ద్వారా ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గం సుగమం చేసింది. దీనిపై సుమారు 24 గంటలపాటు హైడ్రామా నడిచింది.
అమరావతి - ఆంధ్రజ్యోతి) ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది. దీనిని అసెంబ్లీ, శాసనమండలిలో ప్రవేశపెట్టి... తీర్మానం ఆమోదించి కేంద్ర ఎస్సీ కమిషన్ ఆమోదం పొంది పకడ్బందీగా వర్గీకరణ అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ‘‘ఇది చరిత్రాత్మకం అవుతుంది. అసెంబ్లీ తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపిద్దాం. కమిషన్ అనుమతితో మరింత చట్టబద్ధత వస్తుంది’’ అని బుధవారం చంద్రబాబు పార్టీ నేతలతో అన్నారు. దీంతో... గురువారం ఉభయ సభల్లో వర్గీకరణపై తీర్మానం ప్రవేశపెట్టడం ఖాయమని అంతా భావించారు. అసెంబ్లీలో తీర్మానం అమలుకు ఎలాంటి అడ్డంకీ లేదు. కానీ మండలిలోనూ సాఫీగా సాగడం ముఖ్యం. దీంతో... ప్రభుత్వం తరఫున కొందరు ప్రతినిధులు బుధవారమే మండలి చైర్మన్ మోషేన్ రాజును కలిశారు. ‘ఎస్సీ వర్గీకరణపై మండలిలో తీర్మానం ప్రవేశపెడతాం. దీనికి ఆమోదించండి’ అని కోరారు. ఆయన అంగీకరించలేదని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘కమిషన్ నివేదికను నేను చూడాలి. చదవాలి.
ఇప్పటికిప్పుడు ప్రవేశపెట్టి తీర్మానం చేయడమంటే కుదరదు’ అని పేర్కొన్నట్లు తెలిసింది. మండలిలో వైసీపీకే ఎక్కువ బలముంది. చైర్మన్ నియామకం కూడా వైసీపీ హయాంలోనే జరిగింది. దీంతో దాని వైఖరేమిటో పాలక పక్షానికి అర్థమైంది. అసెంబ్లీలో ఇలా.. మండలిలో అలా.. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో తీర్మానం ఆమోదించి... మండలిలో ఆగిపోతే దాని అమలుకు బ్రేకులు పడినట్లే. మండలిలో విషయం పెండింగ్‌లో ఉండగా.. వర్గీకరణ అమలు చేయడం కుదరదు. అందుకే శాసనసభలోనూ తీర్మానం ప్రవేశపెట్టలేదు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను సభ ముందుంచి, లఘు చర్చ మాత్రమే జరుపుతున్నట్లు అజెండాలో పేర్కొన్నారు. ఆ మేరకు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి నివేదికను సభముందుంచారు. దీనిపై సభ్యులు మాట్లాడారు. ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. అదే సమయంలో... ఈ నివేదికను మండలిలో హోంమంత్రి అనిత ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదించాలని కోరారు. అభ్యంతరాలు, అభిప్రాయాలు చెప్పాలని పదేపదే అడిగారు. వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు లేచి... దీనిపై చర్చించాలంటుండగానే, విపక్ష నేత బొత్స సత్యనారాయణ చెయ్యి ఊపుతూ ఆయన్ను ఆపేశారు. మరోవైపు చైర్మన్ దీనిపై చర్చ లేదని తేల్చేశారు. అప్పటికీ పండుల మాట్లాడుతుండగా ‘మీరు చెప్పేది రికార్డుల్లోకి రాదు’ అని స్పష్టం చేశారు. అనిత ప్రకటన చేస్తుండగానే సభను వాయిదా వేసి వెళ్లిపోయారు. అడ్డంకిని తొలగించే ‘ఆర్డినెన్స్’ రూటు... ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేసి... మండలిలో అడ్డంకి ఎదురై ఉంటే దీని అమలుకు ఆటంకాలు ఏర్పడేవి. వైసీపీ కుయుక్తిని గ్రహించిన పాలకపక్షం.. శాసనసభలోనూ తీర్మానం చేయలేదు. వెరసి... ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలుకు రంగం సిద్ధం చేసింది. కమిషన్ నివేదికను ఇప్పటికే సభకు సమర్పించిన నేపథ్యంలో... సిఫారసుల సారాంశాన్ని జాతీయ ఎస్సీ కమిషన్‌కు వివరించనున్నారు. అసెంబ్లీ ప్రొరోగ్ కాగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ అమలు చేయాలని భావిస్తున్నారు.