Share News

Simhachalam: ‘పంచ’ గ్రామాల సమస్యకు పరిష్కారం!

ABN , Publish Date - Jan 30 , 2025 | 03:51 AM

బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెవెన్యూ, దేవదాయశాఖల అధికారులతో జరిగిన సమావేశంలో పంచగ్రామాల సమస్యకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. ‘

Simhachalam: ‘పంచ’ గ్రామాల సమస్యకు పరిష్కారం!

సింహాచలం దేవస్థానానికి రూ.5,300 కోట్ల విలువైన 610 ఎకరాల భూమి బదలాయింపు

జగన్‌ ప్రభుత్వం పట్టించుకోనందుకే సమస్య రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌

సింహాచలం దేవస్థానానికి రూ.5,300 కోట్ల విలువైన 610 ఎకరాల భూమి బదలాయింపు

జగన్‌ ప్రభుత్వం పట్టించుకోనందునే సమస్య

రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సింహాచలం పంచ గ్రామాల సమస్యకు త్వరలో పరిష్కారం చూపనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెవెన్యూ, దేవదాయశాఖల అధికారులతో జరిగిన సమావేశంలో పంచగ్రామాల సమస్యకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. ‘‘పంచగ్రామాల్లో 12,149 ఇళ్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించాం. దీనికి ప్రత్యామ్నాయంగా రూ.5,300 కోట్ల విలువైన 610 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచలం దేవస్థానానికి ఇవ్వనున్నాం. ఈ నిర్ణయానికి సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతి రాజు కూడా ఆమోదాన్ని తెలిపారు. ఈ సమస్యపై గత ప్రభుత్వం జారీ చేసిన జీవోపై పలువురు కోర్టుకు వెళ్లారు. ఈ కేసును కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకుంటుంది’’ అని మంత్రి వివరించారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు 338, 296 జీవోలు జారీ చేసిందని, ఈ జీవోల కింద విశాఖలో 70వేల మంది క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారని మంత్రి చెప్పారు. ఈ జీవోల ప్రకారం రెండేళ్లలో ఆ భూములపై లబ్ధిదారులకు సర్వ హక్కులు లభించేలా కన్వేయన్సు డీడ్‌ కూడా ఇవ్వాల్సి ఉందన్నారు.

అయితే గత ప్రభుత్వం ఈ జీవోలను పట్టించుకోలేద ని, లబ్ధిదారులకు న్యాయం చేయలేదని తెలిపారు. 2017లో జీవో జారీ చేసిన నేపథ్యం లో అప్పటి నుంచే ఈ భూములను క్రమబద్ధీకరించాలని, అప్పటి నుంచి రెండేళ్లలో కన్వేయన్సు డీడ్‌లు కూడా జారీ చేయాలని ప్రభు త్వం నిర్ణయించిందన్నారు. అదేవిధంగా రైతు లు సాగు చేసుకునే భూములు, కొన్ని ఖాళీ స్థలాలకు సంబంధించి కోర్టులో పలు కేసులు ఉన్నందున వాటిని కూడా దశలవారీగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. యూఎల్‌సీలోని అదనపు భూ ములు ఏవైనా ఆక్రమణకు గురైనా, వాటిని పీవోటీ చట్ట ప్రకారం పదేళ్లలో అలియనేట్‌ (స్వాధీనం) చేయాల్సి ఉందని, వీటికి కూడా కన్వేయన్సు డీడ్స్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గాజువాక ఈనాం భూముల క్రమబద్ధీకరణకు 2018లో జీవో 301 జారీ చేయగా, 7వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయితే, ఈ ప్రక్రియ కూడా అపరిష్కృతంగా ఉందని, మరో జీవో జారీ చేయనున్నట్లు మంత్రి వివరించారు.


సమస్య తీరింది: పల్లా

గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సింహాచలం దేవస్థానానికి చెందిన 420 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని తెలిపారు. దీనిలో 12,149 ఇళ్లు నిర్మించారని చెప్పారు. ఈ ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు గతంలో 420 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇచ్చేందుకు, క్రమబద్ధీకరణ ఫీజును కూడా దేవస్థానానికి ఇచ్చేందుకు నిర్ణయించారన్నారు. అయితే, ఆక్రమణకు గురైన దేవస్థానం భూమి విలువకు తగిన భూమి ఇవ్వాలని కొందరు కోర్టుకెళ్లారని, ఇప్పుడు సీఎం చంద్రబాబు నిర్ణయంతో 420 ఎకరాల భూమికి బదులు సమాన రిజిస్ర్టేషన్‌ విలువతో 610 ఎకరాలు దేవస్థానానికి బదలాయించనున్నట్లు చెప్పారు. దీని రిజిస్ర్టేషన్‌ విలువ రూ.5,300 కోట్లు ఉంటుందని చెప్పారు. పెదగంట్యాడ, గాజువాక, గొల్లలపాలెం ప్రాంతాల్లో 610 ఎకరాలు దేవస్థానానికి ఇవ్వనున్నట్లు తెలిపారు.

పూర్తి పరిష్కారం: గంటా

వచ్చే ఎన్నికల్లోపు పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పంచగ్రామాల సమస్య శాశ్వత పరిష్కారానికి సీఎం చంద్రబాబు చక్కని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

Updated Date - Jan 30 , 2025 | 03:51 AM